మగుల మదిని దోచే జాంధానీ చీర
పిఠాపురం: తూర్పు గోదావరి జిల్లాలో చేనేత కార్మికులు చరిత్ర సృష్టించారు.. సృష్టిస్తున్నారు.. వీరి చేతిలో రూపుదిద్దుకుంటున్న జాంధానీ చీరలు వారి కళాత్మకతకు మచ్చుతునకలుగా నిలుస్తున్నాయి. తక్కువ కాలంలోనే విశేష ఖ్యాతిని ఆర్జిస్తున్నాయి. గతంలో పేటెంట్ హక్కు పొందిన ఉప్పాడ జాంధానీ.. ఇండియన్ హ్యాండ్లూమ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. జాంధానీ చీరల డిజైన్లతో పోస్టల్ కవర్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం దీని విశిష్టతను చాటుతోంది. కుటీర పరిశ్రమగా ప్రారంభమైన జాంధానీ చీరల తయారీ నేడు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతోంది. ఏటా కోట్ల రూపాయల మేర క్రయవిక్రయాలు జరుగుతున్నాయంటే ఇక్కడి చేనేత కార్మికుల కళానైపుణ్యం అర్థం చేసుకోవచ్చు. రెండువైపులా ఒకేవిధంగా కనిపించే ఈ చీరలకు రానురానూ గిరాకీ పెరుగుతోంది. కొత్తపల్లి మండలంలో గతంలో 50 వరకూ ఉండే మగ్గాలు ఇప్పుడు సుమారు 500కు చేరుకున్నాయి. కులంతో సంబంధం లేకుండా అందరూ వీటి తయారీలో పాలుపంచుకుంటున్నారు. తాటిపర్తి, అమలాపురం, కోనసీమ ప్రాంతాల్లోనూ ఈ చీరల నేత తయారీ ఊపందుకుంది.
అంతా చే‘నేత’తోనే..
పాతికేళ్లుగా నేత పని చేస్తున్నాను. ఎంత సృజనాత్మకమైనదైనా చేతి నైపుణ్యత ద్వారానే నేస్తాం. జాంధానీకి వెండి కోటింగ్ ఉంటుంది. దీనిలో తల వెంట్రుక మందంలో ఎరుపు రంగు పట్టుదారం ఉంటుంది. నాణ్యతగల జరీ దారంలో ముడుచుకుపోయేగుణం కలిగి ఉంటుంది. దృఢంగా నేయాల్సి ఉంది. అడ్డు, నిలువు పట్టు దారాలనే ఉపయోగిస్తాం. చీర నేయడానికి ముగ్గురి నుంచి నలుగురు అవసరమవుతారు. డిజైన్‌ను బట్టి 20 నుంచి 40 రోజుల వరకూ సమయం పడుతుంది.
- మీసాల నాగేశ్వరరావు, నేత కార్మికుడు, కొత్తపల్లి
కుటుంబమంతా కష్టపడితేనే..
చిన్నప్పటి నుంచీ నేత పని చేస్తున్నా. డిజైన్లలో చాలా మార్పులు వస్తున్నాయి. గిరాకీకి దీటుగా ఉత్పత్తి పెరుగుతోంది. రోజూ గతంలో ఒకటి రెండు చీర్లకంటే ఎక్కువ తయారయ్యేవి కావు. ప్రస్తుతం 50 నుంచి వంద వరకూ తయారు చేస్తున్నారు. ఎక్కడ చూసిన జాంధానీ చీరల మగ్గాలే కనిపిస్తున్నాయి. వీటి తయారీకి ఆసక్తి చూపుతున్నారు. కుటుంబమంతా కష్టపడితేనే అందమైన నాణ్యతైన చీర తయారవుతుంది.
- దున్న మురళీకృష్ణ, నేత కార్మికుడు, కుతుకుడుమిల్లి
ఏకాగ్రతతో పని చేయాలి
జాంధానీ చీరల తయారీకి ఇంటిల్లి పాదీ పని చేయాల్సిందే. వంట, ఇంటి పనులు పూర్తి చేసుకుంటూనే నేస్తుంటాను. చీరకున్న బుటాలు, డిజై న్లు రెండువైపులా ఒకేలా కనిపిస్తాయి. డిజైన్ ప్రింట్ చేశారా అన్నట్టుగా ఉంటుంది. చాలా ఏకాగ్రతతో పనిచేయాలి.
- చింతా నాగేశ్వరి, నేత కార్మికురాలు, కొత్తపల్లి
ఆన్‌లైన్ విక్రయాలకు అవకాశం
జాంధానీ చీరల డిజైన్లతో పోస్టల్ కవర్ విడుదల కానుండడంతో చేనేతకు అరుదైన ఘనత దక్కుతోంది. కాలానుగుణంగా వ్యాపారాలను విస్తరించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం వల్ల చేనేత రంగం అభివృద్ది చెందుతోంది. ఆన్‌లైన్ మార్కెటింగ్ వ్యవస్థ ఉన్నా దళారులు ఎక్కువగా ఉన్నారు. కారి్మకులే నేరుగా ఆన్‌లైన్‌లో విక్రయాలు జరుపుకొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- రాజాపంతుల నాగేశ్వరరావు, ఏపీ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ సభ్యుడు, మూలపేట
Comments
Please login to add a commentAdd a comment