సాక్షి, అమరావతి: పర్యావరణ కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రయత్నాలు ఆరంభించింది. దేశంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో గుట్టలు, గుట్టలుగా వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఈ వ్యర్థాలను దేశంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్న జాతీయ రహదారుల నిర్మాణం కోసం భూమిని ఎత్తు చేసేందుకు ఉపయోగించుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. ఇందుకోసం చేపట్టిన పైలట్ ప్రాజెక్టులు విజయవంతమవడంతో దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది. స్వచ్ఛ భారత్ మిషన్ కార్పొరేషన్ సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది.
వ్యర్థాలను జాతీయ రహదారుల నిర్మాణం కోసం సద్వినియోగం చేసుకోవడాన్ని ఎన్‌హెచ్‌ఏఐ పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టింది. ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే, ఢిల్లీ–ఎన్‌సీఆర్ హైవేల నిర్మాణంలో ఈ వ్యర్థాలను ఉపయోగించింది. జాతీయ రహదారుల నిర్మాణం కోసం మార్కింగ్ చేసిన మార్గంలో భూమిని కొంత వరకు ఎత్తు పెంచిన అనంతరం కొత్త రహదారులను నిర్మిస్తారు.
ఇందుకోసం ఇప్పటి వరకు మట్టి, కంకరలను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వాటితోపాటు నగరాలు, పట్టణాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లలోని సాలిడ్ వేస్ట్‌ను ఉపయోగించనున్నారు. కొత్తగా నిర్మించే జాతీయ రహదారుల్లో ఈ వ్యర్థాలను ఉపయోగించాలని ఎన్‌హెచ్‌ఏఐ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
దేశంలోని నగరాలు, పట్టణాల్లోని 2,304 డంపింగ్ యార్డుల్లో ప్రస్తుతం 170 మిలియన్ టన్నుల సాలిడ్ వేస్ట్ అందుబాటులో ఉందని స్వచ్ఛ భారత్ మిషన్ అంచనా వేసింది. దాదాపు 10వేల హెక్టార్ల మేర ఉన్న డంపింగ్ ప్రదేశాల్లో ఆ వ్యర్థాలన్నీ గుట్టలుగా పడి ఉన్నాయి. వాటిని జాతీయ రహదారుల నిర్మాణం కోసం ఎన్‌హెచ్‌ఏఐకు అందించాలని స్వచ్ఛ భారత్ మిషన్ ఆదేశించింది.
ఇందుకోసం డంపింగ్ యార్డ్‌ల వద్ద బయోమౌనింగ్ యంత్రాలను ఎన్‌హెచ్‌ఏఐ సమకూర్చనున్నది. తద్వారా దేశంలోని వ్యర్థాలను సక్రమ నిర్వహణ, సరైన రీతిలో సద్వినియోగానికి సాధ్యపడుతుందని ప్రభుత్వం కూడా భావిస్తోంది. మరోవైపు పర్యావరణ కాలుష్య సమస్యకు కూడా సరైన పరిష్కారంగా పరిగణిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment