సుజనా వ్యక్తిగత దివాలా ప్రక్రియకు ఎన్‌సీఎల్‌టీ అనుమతి
స్ప్లీ0డిడ్ మెటల్ ప్రొడక్ట్స్ రుణం ఎగ్గొట్టిన కేసులో ఉత్తర్వులు
ట్రిబ్యునల్ తీర్పుతో బీజేపీ నేతకు షాక్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, మాజీ ఎంపీ, ఎన్డీఏ కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దివాళా పరిష్కారకర్త (రెజల్యూషన్ ప్రొఫెషనల్)ను నియమిస్తూ.. ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఆయన ఆస్తుల క్రయవిక్రయాలను నిలిపివేసింది. దివాలా ప్రక్రియకు వెళ్లిన స్లె్పండిడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎస్‌బీఐలో రూ. 500 కోట్లకు రుణం తీసుకుంది. దీనికి సుజనా చౌదరి వ్యక్తిగతంగా గ్యారెంటీ ఇచ్చారు. దీంతో సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియ ప్రారంభించి, పరిష్కారాన్ని చేపట్టాలని ఎస్‌బీఐ 2021లో ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేసింది.
ఆయన ఆస్తుల మదింపు చేపట్టి, వేలం ద్వారా ఎస్‌బీఐ రుణాలను చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ జ్యుడిషియల్ సభ్యుడు రాజీవ్ భరద్వాజ్, టెక్నికల్ సభ్యుడు సంజయ్ పూరి బెంచ్ విచారణ జరిపి, తాజా ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వీవీఎస్‌ఎన్ రాజు వాదనలు వినిపించారు. రుణదాతకు ఏదైనా కంపెనీ, వ్యక్తులు రుణాన్ని ఎగవేసినప్పుడు దానికి వ్యక్తిగతంగా గ్యారెంటీ ఉన్న వాళ్లు బాధ్యత వహించాలని చట్టం చెబుతోందన్నారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని పలు తీర్పుల సందర్భంగా చెప్పిందన్నారు.
హామీదారుగా ఉన్న సుజనా చౌదరి తప్పకుండా బాధ్యత వహించేలా ఆదేశాలివ్వాలని కోరారు. సుజనా తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడం, మధ్యంతర పరిష్కార ప్రక్రియ (ఐఆర్‌పీ) ఇచ్చిన నివేదికను పరిశీలించిన బెంచ్.. సుజనా వ్యక్తిగత దివాలా ప్రక్రియకు అనుమతించింది. దీంతో బీజేపీ నేతకు షాక్ తగిలినట్లయింది. దీని ప్రకారం దివాలా ప్రక్రియను ప్రారంభించేందుకు పరిష్కారకర్తను నియమిస్తారని, ఆయన సుజనా అప్పులు, ఆస్తులను పరిశీలించి, ఆయా రుణదాతలకు ఇవ్వాల్సిన నిష్పత్తి మేరకు పరిష్కారాన్ని సూచిస్తారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment