సాక్షి, అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న గిరిజన మహిళ ద్రౌపది ముర్ము మంగళవారం విజయవాడకు రానున్నారు. ద్రౌపది ముర్ము వెంట కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్ హాల్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సీకే కన్వెన్షన్ హాల్‌కు చేరుకోనున్న ద్రౌపది ముర్ముకు సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలకనున్నారు.
సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిర్వహించే సమావేశంలో ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతూ వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ప్రసంగిస్తారు. సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీగా రాష్ట్రపతి అభ్యర్థిగా తొలి సారి గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు అవకాశం ఇవ్వడాన్ని స్వాగతించిన వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ఆమెకు మద్దతు తెలిపింది. ఇదే అంశాన్ని వెల్లడిస్తూ ద్రౌపది ముర్ముకు మద్దతు తెలుపుతూ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడి.. మద్దతు కోరనున్నారు.
గిరిజన నృత్యాలతో ముర్ముకు బీజేపీ స్వాగతం
బీజేపీ, దాని మిత్రపక్షాల (ఎన్డీయే) రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుంటారని పార్టీ నేతలు వెల్లడించారు. విమానాశ్రయం ప్రాంగణంలో సంప్రదాయ గిరిజన నృత్యాలతో ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేసింది. కాగా, రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి వస్తున్నారని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు చెప్పారు.
తెలంగాణ పర్యటన రద్దు!
సాక్షి, హైదరాబాద్: ఎన్డీఏ పక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్ర పర్యటన రద్దయింది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. పశ్చిమబెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో ముర్ము ప్రచారం ఇంకా పూర్తికాని నేపథ్యంలో సమయాభావం వల్ల ఆమె తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నట్టు బీజేపీ వర్గాల సమాచారం. ఈ నెల 16న ఢిల్లీలో ద్రౌపది ముర్ము పాల్గొననున్న బీజేపీ ఎంపీల సమావేశానికి రాష్ట్రానికి చెందిన ఐదుగురు ఎంపీలకు ఆహ్వానం అందింది.
కాగా, ద్రౌపది ముర్ము బెంగళూరు పర్యటనకు వచ్చినపుడు రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలను కలిపించే ప్రయత్నం చేస్తున్నా అది ఏ మేరకు సాధ్యమనే దానిపైనా చర్చ సాగుతోంది. అదీగాక రాష్ట్రం నుంచి బీజేపీకి ఐదుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడం కూడా ఈ పర్యటన రద్దుకు ఒక కారణమని తెలుస్తోంది. ఒకవేళ రాష్ట్రంలోని టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుంచి ఎవరైనా ఎన్డీయే అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ చేస్తే అది బోనస్‌గా భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment