108, 104 పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి
బిల్లులు కూడా అప్‌లోడ్ చేయని దుస్థితి
ఏప్రిల్ నుంచి బిల్లుల పెండింగ్
నిర్వహణ సంస్థకు రూ.140 కోట్ల బకాయి
సాక్షి, అమరావతి: పేద ప్రజల ప్రాణాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. రోడ్ యాక్సిడెంట్లు, ఇతర ప్రమాదాలు సంభవించిన ఆపద సమయంలో క్షతగాత్రులకు ప్రాథమిక వైద్యం అందించడంతో పాటు, మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు తరలించే 108 అంబులెన్స్ వ్యవస్థ పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. అదే విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామాల్లోని పేదలకు వైద్య సేవలందించే 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)పైనా చిన్న చూపు చూస్తోంది. 2014–19 మధ్య ఈ రెండు వ్యవస్థలను అంపశయ్య ఎక్కించిన బాబు.. మరోసారి అదే పంధాను అనుసరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచి నిర్వహణ సంస్థ అరబిందోకు పైసా విదల్చక పోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో 108, 104 సేవలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి .
రూ.140 కోట్లపైనే బకాయి..
సాధారణంగా ప్రతి మూడు నెలలకోసారి ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది. కాగా, ఏప్రిల్, మే, జూన్ నెలల బిల్లులను జూలై నెలలో చెల్లించాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కనీసం బిల్లులను వెరిఫై చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కూడా చేయలేదని తెలిసింది. మరోవైపు జూలై, ఆగస్టు, సెపె్టంబర్ నెలల బిల్లులు వచ్చే నెలలో చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన పరిశీలించినట్‌లైతే ఆరు నెలల బిల్లులు బకాయి పడినట్లవుతోంది. మొత్తంగా రూ.140 కోట్ల మేర ప్రభుత్వం బకాయి పడడంతో ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు సంస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
నిలిచిపోయిన ఆగస్టు నెల వేతనాలు..
ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాయిలు పెట్టడంతో నిర్వహణ సంస్థ 104, 108 వాహనాల డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఈఎంటీలకు వేతనాలు సరిగా చెల్లించడం లేదు. సెప్టెంబర్ నెల ముగస్తున్నా.. ఆగస్టు నెల వేతనాలు చెల్లించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్, జూలై నెలల వేతనాలను సైతం సంస్థ ఆలస్యంగా చెల్లించిందని చెబుతున్నారు. 2019కు ముందు రాష్ట్రంలో 108 అంబులెన్స్‌లు 336 మాత్రమే ఉండేవి. వీటిని 768కి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పెంచారు. అదే విధంగా 104 ఎంఎంయూలను 936 ప్రవేశపెట్టారు. డ్రైవర్లు, ఈఎంటీలకు వేతనాలను సైతం పెంచి జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment