Nellore TDP Leader Shaik Abdul Aziz Fire On Kotamreddy Sridhar Reddy - Sakshi
Sakshi News home page

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి టీడీపీలో నో చాన్స్..! అజీజ్‌ ప్లాన్‌తో ఎమ్మెల్యేకు షాక్‌?

Published Tue, Feb 14 2023 8:05 AM | Last Updated on Tue, Feb 14 2023 10:08 AM

Nellore TDP Leader Shaik Abdul Aziz Fire On Kotamreddy Sridhar Reddy - Sakshi

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి టీడీపీలో ఎంట్రీకి దారులు మూసుకుపోతున్నాయి. ఆ పార్టీ నేతలు కోటంరెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కోటంరెడ్డి ఎపిసోడ్‌ ప్రారంభమైనప్పటి నుంచి నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తాను టీడీపీ తరఫున పోటీ చేస్తానని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి తనకు తానుగా బహిరంగంగా ప్రకటించుకున్నారు. అయితే ఇప్పటికే టీడీపీ నెల్లూరు రూరల్‌ ఇన్‌చార్జిగా ఉన్న అబ్దుల్‌ అజీజ్‌ శ్రీధర్‌రెడ్డికి వ్యతిరేకంగా శ్రేణులను కూడగడుతున్నారు.  

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని ఊహల్లో తేలియాడిపోతున్న అజీజ్‌కు కోటంరెడ్డి ఎపిసోడ్‌తో గొంతులో వెలక్కాయ పడినట్లు అయింది. వైఎస్సార్‌సీపీలో రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికై చక్రం తిప్పిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన రాజకీయాలతో గ్రాఫ్‌ కోల్పోయాడు. ఈ దఫా టికెట్‌ వచ్చే అవకాశాలు లేవని ముందుగానే పసిగట్టిన ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో రహస్యంగా టచ్‌లోకి వెళ్లి టికెట్‌ కన్ఫర్మ్‌ చేసుకున్నాడని సమాచారం.

అధికార పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడానికి అంతా సిద్ధం చేసుకున్నాక.. ఫోన్‌ ట్యాంపింగ్‌ హైడ్రామాతో రాజకీయ అలజడి సృష్టించారు. రానున్న ఎన్నికల్లో తాను టీడీపీ అభ్యరి్థగా నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. టీడీపీ రూరల్‌ టికెట్‌ నాదే అనుకుంటూ ఇదే ఎమ్మెల్యే కోటంరెడ్డిపై, ప్రభుత్వం నోరుపారేసుకున్న అబ్దుల్‌ అజీజ్‌ షాక్‌కు గురయ్యాడు. అప్పటికప్పుడే పార్టీ పెద్దలతో కలిసి చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టాడు. చంద్రబాబు సైతం కోటంరెడ్డి రాకపై స్పష్టత ఇవ్వకపోవడంతో అజీజ్‌ మల్లగుల్లాలు పడుతున్నాడు. పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలోనే సమావేశాలు నిర్వహించి అధిష్టానానికి అలి్టమేటం పంపిస్తున్నాడు.  

కోటంరెడ్డి మౌనం.. అజీజ్‌ అల్లరి 
నెల్లూరు రూరల్‌ టీడీపీ టికెట్‌ నాదేనంటూ బహిరంగంగానే ప్రకటించుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి అంతర్గత సమావేశాల్లోనూ ధీమాగా చెప్పుకుంటున్నాడు. అయితే మరో వైపు నెల్లూరు రూరల్‌ టీడీపీ ఇన్‌చార్జి, టికెట్‌ ఆశావహుడు అజీజ్‌ మాత్రం రచ్చరచ్చ చేస్తున్నాడు. కోటంరెడ్డి మాత్రం మౌనంగా తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ పోతున్నాడు.

సోదరుడు గిరిధర్‌రెడ్డితో వ్యాపార సంబంధాలు ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ద్వారా కోటంరెడ్డి టికెట్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోవైపు అజీజ్‌ కూడా చంద్రబాబు, లోకేశ్‌లతో జిల్లా పెద్దల ద్వారా మాట్లాడించారు. రాజకీయ వ్యూహాల్లో భాగంగా టీడీపీ అధిష్టాన పెద్దలు మాత్రం పైకి కోటంరెడ్డిని పారీ్టలోకి తీసుకునే అవకాశం లేదని చెబుతున్నారు. టీడీపీ అధిష్టాన పెద్దలపై నమ్మకం లేని అజీజ్‌ మాత్రం కోటంరెడ్డికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులను సమీకరించి సమావేశాలు పెడుతున్నాడు.   

నిప్పులు చెరిగిన తమ్ముళ్లు 
ఆదివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో అబ్దుల్‌ అజీజ్‌ నేతృత్వంలో జరిగిన నెల్లూరు రూరల్‌ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిపై ఆ పార్టీ శ్రేణులు నిప్పులు చెరిగాయి. మూడేన్నర ఏళ్ల కాలంగా పార్టీ నేతలను అష్టకష్టాలు పెట్టి, దాడులతో భయభ్రాంతులకు గురి చేసిన ఎమ్మెల్యేను పార్టీ లోకి తీసుకోవద్దని ముక్తకంఠంతో తీర్మానం చేశారు. ఒకరిద్దరిని కాదు ఎంతో మంది నేతలను రౌడీమూకలతో చితక్కొట్టించిన ఎమ్మెల్యేను ఎలా తీసుకుంటారని? నేతలు, కార్యకర్తలు మండి పడ్డారు. ఓ ముస్లిం మహిళ అయితే ఏకంగా మా శవాలపై వెళ్లి పారీ్టలోకి ఆహా్వనించడంటూ నేతలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది.

టీడీపీకి చెందిన ఓ మైనార్టీ నేతను కొట్టించి వేధింపులకు గురి చేసిన విషయం అందరికీ తెలుసు. అలాంటి అరాచక వాదిని పార్టీ లోకి ఎలా తీసుకువస్తారని, ఆయనతో కలిసి ఎలా నడవాలని ఆ మహిళ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేసింది. కార్యకర్తల అభీష్టానానికి వ్యతిరేకంగా కోటంరెడ్డికి పారీ్టలో రాచబాట వేస్తామంటే చూస్తూ ఊరుకోమని, అవసరమైతే చంద్రబాబు వద్దే పంచాయితీ తేల్చుకుంటామంటూ నేతలందరూ తీర్మానించారు. ఈ పరిస్థితులు చూస్తుంటే.. కోటంరెడ్డికి టీడీపీలోకి దారేది?.. అన్నట్లుగా ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement