పెద్దలతో సంబంధం లేకుండా సొంతంగా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికే అమ్మాయిలు, అబ్బాయిలు ఇప్పుడు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఏపీ, తెలంగాణల్లో పెళ్లి కోసం మ్యాట్రిమోని సంస్థల్లో తమ వివరాలు నమోదు చేసుకున్న ఆరు లక్షల మంది యువతీయువకులపై ఆ సంస్థ అధ్యయనం చేసి ఆసక్తికర అంశాలను వెల్లడించింది.
సాక్షి, అమరావతి: పెద్దలతో సంబంధం లేకుండా సొంతంగా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికే తెలుగు యువత ఇప్పుడు ఎక్కువ ఆసక్తి చూపుతోంది. పెళ్లి సంబంధాలను కుదిర్చే ఓ మ్యాట్రిమోని సంస్థ పరిశీలనలో ఈ విషయం వెల్లడైంది. ఈ విషయంలో అమ్మాయిలు, అబ్బాయిలదీ ఒకటే తీరుగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో పెళ్లి కోసం మ్యాట్రిమోని సంస్థల్లో తమ వివరాలు నమోదు చేసుకున్న ఆరు లక్షల మంది యువతీయువకులపై ఆ సంస్థ అధ్యయనం చేసి ఆసక్తికర అంశాలను వెల్లడించింది.
ఓ మ్యాట్రిమోని సంస్థ అధ్యయనంలో వెల్లడి
గుంటూరు నగరానికి సమీపంలో ఉండే ఒక గ్రామానికి చెందిన రమ్య (24) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. తల్లిదండ్రులతో సంబంధం లేకుండా తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి పెళ్లి సంబంధాలు కుదిర్చే ఓ మ్యాట్రిమోని సంస్థలో వివరాలు నమోదు చేసుకుంది. మంచి ఉద్యోగం, వ్యక్తిత్వం ఉంటే దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తినైనా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమంటోంది.
ఆ ఐదు ప్రాంతాల వారే..
► మ్యాట్రిమోని సంస్థల్లో నమోదు చేసుకుంటున్న వారిలో 60 శాతం మంది యువత పెద్దలతో సంబంధం లేకుండా తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటోంది.
► 76 శాతం మంది మ్యాట్రిమోని సంస్థల ఆఫీసుల వద్దకు కూడా వెళ్లకుండా యాప్‌లు, వెబ్‌సైట్ ద్వారానే తమ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. సొంత రాష్ట్ర పరిధిలోనే తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటామన్న అబ్బాయిలు.. 26 శాతం మంది, అమ్మాయిలు.. 23 శాతం మంది.
► 67 శాతం మంది అమ్మాయిలు, 64 శాతం మంది అబ్బాయిలు ఎటువంటి పరిధులు లేకుండా దేశంలో ఏ ప్రాంతం వారినైనా పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపారు.
► మ్యాట్రిమోని సంస్థల్లో నమోదు చేసుకుంటున్న తెలుగు వారిలో ఎక్కువ మంది హైదరాబాద్, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన వారే.
► మ్యాట్రిమోని సంస్థలను సంప్రదిస్తున్న వారిలో 81 శాతం మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న వారే. 9 శాతం మంది ఇతర రాష్ట్రాలవారు, 10 శాతం మంది ఎన్నారైలు ఉన్నారు. వివరాలు నమోదు చేసుకుంటున్న అమ్మాయిల్లో 53 శాతం మందికి 23–27 ఏళ్ల మధ్య వయసు ఉండగా.. 42 శాతం మంది 26–30 ఏళ్ల మధ్య వయసు వారిగా తేలింది.
► 8 శాతం మంది అమ్మాయిలు, 10 శాతం మంది అబ్బాయిలు కులాల ప్రస్తావన లేకుండా పెళ్లికి సిద్ధమంటున్నారు.
► మ్యాట్రిమోని సంస్థల వద్ద వివరాలు నమోదు చేసుకుంటున్న అమ్మాయిల్లో 42 శాతం మంది ఇంజనీరింగ్ చదివినవారు కాగా, 14.5 శాతం మంది ఇతర వృత్తి విద్యా కోర్సులు చేసిన వారు. అబ్బాయిల్లో 36.8 శాతం మంది ఇంజనీరింగ్ చదివిన వారు కాగా, 9 శాతం మంది ఇతర ఉన్నత వృత్తి విద్యా కోర్సులు చేసిన వారు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment