Telugu youth
-
పెద్దలతో పనిలేదు..
పెద్దలతో సంబంధం లేకుండా సొంతంగా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికే అమ్మాయిలు, అబ్బాయిలు ఇప్పుడు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఏపీ, తెలంగాణల్లో పెళ్లి కోసం మ్యాట్రిమోని సంస్థల్లో తమ వివరాలు నమోదు చేసుకున్న ఆరు లక్షల మంది యువతీయువకులపై ఆ సంస్థ అధ్యయనం చేసి ఆసక్తికర అంశాలను వెల్లడించింది. సాక్షి, అమరావతి: పెద్దలతో సంబంధం లేకుండా సొంతంగా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికే తెలుగు యువత ఇప్పుడు ఎక్కువ ఆసక్తి చూపుతోంది. పెళ్లి సంబంధాలను కుదిర్చే ఓ మ్యాట్రిమోని సంస్థ పరిశీలనలో ఈ విషయం వెల్లడైంది. ఈ విషయంలో అమ్మాయిలు, అబ్బాయిలదీ ఒకటే తీరుగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో పెళ్లి కోసం మ్యాట్రిమోని సంస్థల్లో తమ వివరాలు నమోదు చేసుకున్న ఆరు లక్షల మంది యువతీయువకులపై ఆ సంస్థ అధ్యయనం చేసి ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఓ మ్యాట్రిమోని సంస్థ అధ్యయనంలో వెల్లడి గుంటూరు నగరానికి సమీపంలో ఉండే ఒక గ్రామానికి చెందిన రమ్య (24) హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. తల్లిదండ్రులతో సంబంధం లేకుండా తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి పెళ్లి సంబంధాలు కుదిర్చే ఓ మ్యాట్రిమోని సంస్థలో వివరాలు నమోదు చేసుకుంది. మంచి ఉద్యోగం, వ్యక్తిత్వం ఉంటే దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తినైనా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమంటోంది. ఆ ఐదు ప్రాంతాల వారే.. ► మ్యాట్రిమోని సంస్థల్లో నమోదు చేసుకుంటున్న వారిలో 60 శాతం మంది యువత పెద్దలతో సంబంధం లేకుండా తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటోంది. ► 76 శాతం మంది మ్యాట్రిమోని సంస్థల ఆఫీసుల వద్దకు కూడా వెళ్లకుండా యాప్‌లు, వెబ్సైట్ ద్వారానే తమ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. సొంత రాష్ట్ర పరిధిలోనే తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటామన్న అబ్బాయిలు.. 26 శాతం మంది, అమ్మాయిలు.. 23 శాతం మంది. ► 67 శాతం మంది అమ్మాయిలు, 64 శాతం మంది అబ్బాయిలు ఎటువంటి పరిధులు లేకుండా దేశంలో ఏ ప్రాంతం వారినైనా పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపారు. ► మ్యాట్రిమోని సంస్థల్లో నమోదు చేసుకుంటున్న తెలుగు వారిలో ఎక్కువ మంది హైదరాబాద్, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన వారే. ► మ్యాట్రిమోని సంస్థలను సంప్రదిస్తున్న వారిలో 81 శాతం మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న వారే. 9 శాతం మంది ఇతర రాష్ట్రాలవారు, 10 శాతం మంది ఎన్నారైలు ఉన్నారు. వివరాలు నమోదు చేసుకుంటున్న అమ్మాయిల్లో 53 శాతం మందికి 23–27 ఏళ్ల మధ్య వయసు ఉండగా.. 42 శాతం మంది 26–30 ఏళ్ల మధ్య వయసు వారిగా తేలింది. ► 8 శాతం మంది అమ్మాయిలు, 10 శాతం మంది అబ్బాయిలు కులాల ప్రస్తావన లేకుండా పెళ్లికి సిద్ధమంటున్నారు. ► మ్యాట్రిమోని సంస్థల వద్ద వివరాలు నమోదు చేసుకుంటున్న అమ్మాయిల్లో 42 శాతం మంది ఇంజనీరింగ్ చదివినవారు కాగా, 14.5 శాతం మంది ఇతర వృత్తి విద్యా కోర్సులు చేసిన వారు. అబ్బాయిల్లో 36.8 శాతం మంది ఇంజనీరింగ్ చదివిన వారు కాగా, 9 శాతం మంది ఇతర ఉన్నత వృత్తి విద్యా కోర్సులు చేసిన వారు ఉన్నారు. -
పదవులన్నీ ఆ వర్గానికేనా
సాక్షి, అమరావతి: పేదరికమే తన కులమంటూ తరచూ సినీ డైలాగులు వల్లించే ముఖ్యమంత్రి చంద్రబాబు నిజానికి అధికారం చేపట్టిన నాలుగేళ్ల తొమ్మిది నెలల కాలంలో పార్టీ, ప్రభుత్వంలో తన సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారని టీడీపీకే చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు పేర్కొంటున్నారు. రాజ్యసభ సభ్యత్వం నుంచి ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్లు చివరికి పార్టీ పదవుల్లోనూ సీఎం తన సొంత సామాజిక వర్గానికే అగ్రతాంబూలం కల్పించారు. తనవర్గం వారికివ్వగా మిగిలిన పదవులనే ఇతరులకు బిస్కెట్ల మాదిరిగా వేశారనే అభిప్రాయం పార్టీలోనే బలంగా వ్యక్తమవుతోంది. టీడీపీలో సీఎం సామాజికవర్గం మినహా మిగతావారు కీలక పదవి దక్కించుకోవాలంటే మోకాళ్లు అరిగిపోయేలా తిరగాల్సిందేనని విజయవాడకు చెందిన ఒక బీసీ నాయకుడు వ్యాఖ్యానించారు. ఒకవేళ అంత తిరిగినా గ్యారంటీ ఉండదని, సీఎం సామాజిక వర్గం అండదండలు ఉంటేనే పదవి వరిస్తుందనే అభిప్రాయం టీడీపీలో దిగువ స్థాయి నుంచి పైస్థాయి వరకూ వ్యక్తమవుతోంది. శాసనమండలిలోనూ 40 శాతం తనవారికే శాసనమండలిలో టీడీపీకి 30 మంది ఎమ్మెల్సీలు ఉండగా సీఎం సామాజిక వర్గానికి చెందిన పయ్యావుల కేశవ్, వైవీబీ రాజేంద్రపసాద్, నారా లోకేష్, గాలి సరస్వతమ్మ, వీవీవీ చౌదరి, కరణం బలరామకృష్ణమూర్తి, దొరబాబు (బీఎన్ రాజసింహులు), టీడీ జనార్థన్లకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన కేశవ్‌ను ఎమ్మెల్సీగా చేయడమే కాకుండామండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని కట్టబెట్టారు. లోకేష్‌కు ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా ఎమ్మెల్సీ పదవితోపాటు మంత్రిని చేసి కీలక శాఖలిచ్చారు. వీవీవీ చౌదరి, టీడీ జనార్థన్‌లు చంద్రబాబు కోటరీలో అత్యంత ముఖ్యులు. పార్టీ పదవులు, ఇతర వ్యవహారాలన్నీ వీరే చక్కబెడతారు. అందువల్లే వారికి ప్రజలతో సంబంధం లేకపోయినా ఎమ్మెల్సీలను చేశారు. కొద్ది నెలల క్రితం మృతి చెందిన ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి చంద్రబాబుకు బంధువు, ఆప్తుడు. ఇలా శాసన మండలిలో 40 శాతం మంది తన మనుషులకే చంద్రబాబు అవకాశం కల్పించారు. ఐదుగురు రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు తనవారే ప్రస్తుతం టీడీపీకి ఐదుగురు రాజ్యసభ సభ్యులుంటే అందులో ఇద్దరు చంద్రబాబు సామాజికవర్గం వారే ఉన్నారు. సుజనా చౌదరి, కనకమేడల రవీంద్రకుమార్‌లు చంద్రబాబు కోటగిరీలో కీలక వ్యక్తులు. కనకమేడల కోసం దళిత వర్గానికి చెందిన వర్ల రామయ్యను చంద్రబాబు పక్కనబెట్టారు. దళితుల నుంచి వ్యతిరేకత చవిచూడాల్సి వస్తుందనే భయంతోనే రామయ్యకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి కట్టబెట్టారే తప్ప ఆ వర్గంపై బాబుకు ఏమాత్రం అభిమానం లేదని చెబుతారు. నిజంగానే అభిమానం ఉంటే రామయ్యను రాజ్యసభకు పంపి ఉండేవారని పార్టీలోనే చాలా రోజులు చర్చ జరిగింది. ఇక ఢిల్లీలో రాష్ట ప్రభుత్వం తరఫున అధికార ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహనరావు సైతం సీఎం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడం గమనార్హం. తెలుగు యువత, కార్పొరేషన్లూ వారికే.. పార్టీ పదవుల్లో చంద్రబాబు తన సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు. ఇటీవలే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి స్థానంలో తన వర్గానికే చెందిన దేవినేని అవినాష్‌ను కూర్చోబెట్టారు. టీఎన్ఎస్ఎఫ్ బ్రహ్మం చౌదరి, ఐటీ వింగ్ బ్రహ్మం చౌదరి, లీగల్ సెల్ గొట్టిపాటి శివరామకృష్ణప్రసాద్, స్వచ్ఛాంద్ర మిషన్ ఛైర్మన్ సీఎల్ వెంకట్రావు, అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దివి శివరాం, గిడ్డంగుల సంస్థ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్, 20 సూత్రాల పథకం ఛైర్మన్ శేషసాయిబాబు, మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, శ్యాప్ ఛైర్మన్ అంకమ్మ చౌదరి, వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్‌గా తన సామాజిక వర్గానికి చెందిన కోటేశ్వరరావును నియమించారు. సిఫారసు లేఖలు ఉంటేనే.. పదవుల పంపిణీలో చంద్రబాబు తనవారికే ప్రాధాన్యమిస్తుండడంపై పార్టీలో మొదటి నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ సమయంలో పైస్థాయిలో ముఖ్య నాయకులకు అరకొరగా పదవులిచ్చి మిగిలిన వాళ్ల నోళ్లు మూయించారు. పార్టీని భుజానెత్తుకుని మోస్తున్న తమను గుర్తించడంలేదని, ఐదేళ్లుగా ఎదురు చూపులతోనే కాలం గడిచిపోయిందని పలువురు వాపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల కోసం దరఖాస్తు చేసుకోవాలని పార్టీ అగ్రనాయకత్వం కిందిస్థాయి నాయకులకు సూచించడంతో వేల సంఖ్యలో వచ్చాయి. అయితే వీటిని పక్కనపడేసి స్థానిక ఎమ్మెల్యే / పార్టీ ఇన్‌ఛార్జి సిఫారసు చేసిన వారి పేర్లను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అంతేకాదు జిల్లాకు చెందిన అందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల సిఫారసు లేఖలు కూడా అడుగుతున్నారు. ఈ పదవులన్నీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేష్ సూచనల ప్రకారమే పంపిణీ చేశారు. కృష్ణా జిల్లాలో 16 మార్కెట్ కమిటీలకుగానూ 13 పదవులను సీఎం సామాజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వడం గమనార్హం. తప్పనిసరి అయితేనే... టీడీపీలో కులానికే ప్రథమ ప్రాధాన్యమనే విషయం జగమెరిగిన సత్యమని పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు పేర్కొంటున్నారు. చంద్రబాబు పైకి నీతి సూత్రాలు వల్లించినా పాటించేది మాత్రం కుల సూత్రాన్నే అని స్పష్టం చేస్తున్నారు. సీఎం సామాజిక వర్గానికి చెందిన వారైతే సీఎంవోలో అయినా, పార్టీ కార్యాలయమైనా, చంద్రబాబు ఇంటి వద్దైనా ఆత్మీయత కనపడుతుంది. మిగిలిన వారి పట్ల అవసరం, పరిస్థితులను బట్టి కపట ప్రేమను ఒలకబోస్తుంటారని పార్టీకి చెందిన ఇతర నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చదవండి: ఖాకీవనంలో ‘కుల’కలం! సీఎం ‘సొంత’ లాభం! -
నకిలీ 'ఎంటెక్'తో ఉద్యోగం.. తెలుగు యువకుడిపై కేసు
కాన్పూర్: ఎంటెక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ గేట్లో మెరిట్ ర్యాంకు వచ్చిందని నమ్మబలికి ఓఎన్జీసీలో ఉద్యోగం కొట్టేయడానికి ప్రయత్నించిన ఓ తెలుగు యువకుడిపై డెహ్రాడూన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గేట్- 2015 కన్వీనర్, ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ షౌనక్ ఛటర్జీ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన గుణతేజ సుదర్శన్ కొద్దిరోజుల కిందట డ్రెహ్రాడూన్లోని ఓఎన్జీసీలో ఇంజనీర్ ఉద్యోగానికిగానూ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. గేట్ ఎగ్జామ్‌లో 712 స్కోరుతో ఆలిండియా 206వ ర్యాంకు పొందానని, కెమికల్ ఇంజనీరింగ్‌లో టాప్ మార్కు తనదేనని నమ్మబలికాడు. అతని తీరును శంకించిన ఇంటర్వ్యూ అధికారులు.. సుదర్శన్ ఇచ్చిన గేట్ మార్కుల లిస్టుపై తమకు అనుమానం ఉదని, ఓ సారి పరిశీలించి చూడమని గత సోమవారం గేట్- 2015 కన్వీనర్‌కు ఫిర్యాదుచేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. గేట్ ఎంట్రెన్స్‌లో సుదర్శన్ అసలు పాస్ కానేలేదు! 100కు అతనికి వచ్చింది కేవలం 17.67 మార్కులే! ఓఎన్జీసీ అధికారుల ఫిర్యాదుతో సీన్లోకి ఎంటరైన డెహ్రాడూన్ పోలీసులు సుదర్శన్ దాఖలు చేసిన నకిలీ సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేశారు. -
టీడీపీ జిల్లా, నగర సారథులు..
- జిల్లా ఉదయం బందరులో, సాయంత్రం నగరంలో ఎన్నిక - తెలుగు యువతకు కొత్తముఖం? - కొత్త అధ్యక్షులకు అభినందనలు సాక్షి, విజయవాడ : టీడీపీ జిల్లా, అర్బన్ అధ్యక్షుల ఎన్నిక ఆదివారం ఏకగ్రీవంగా జరిగింది. ఉదయం బందరులో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా బచ్చుల అర్జునుడు, సాయంత్రం నగరంలోని ఐవీ ప్యాలెస్‌లో జరిగిన సమావేశంలో అర్బన్ అధ్యక్షుడిగా బుద్దా వెంకటేశ్వరరావు (వెంకన్న)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలో జరిగిన సమావేశంలో పార్టీ పరిశీలకుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇస్తామన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు 33వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన నాయకులకు నామినేటెడ్ పోస్టు ఇస్తామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారని చెప్పారు. జూన్ 2న నవ నిర్మాణ దీక్ష అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రకటించాలని చెప్పారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ నూతన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు కృషిచేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి నాగుల్‌మీరా, డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, ఫ్లోర్‌లీడర్ హరిబాబు, టీడీపీ నాయుడు ముష్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా, అర్బన్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన బచ్చుల అర్జునుడు, బుద్దా వెంకన్నను పలువురు నేతలు కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. కార్యదర్శి ఎన్నిక వాయిదా అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పదవికి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేరు వినిపించినా ఆదివారం అనూహ్యంగా ఆ పేరు పక్కన పెట్టారు. అయితే, పార్టీలో దీర్ఘకాలం పనిచేస్తున్న వారిని పక్కనపెట్టి కొత్తవారికి కీలక పదవులు ఇవ్వడంపై కొందరు సీనియర్లు గుర్రుగా ఉన్నారు. దీనికితోడు ఎస్సీ నేతలు కూడా రహస్య సమావేశం నిర్వహించి పార్టీ పరిశీలకులను నిలదీయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సమావేశంలో పట్టాభిరామ్ పేరు ప్రకటిస్తే కార్యకర్తల నుంచి నిరసన వస్తుందని భావించిన నేతలు మిన్నకుండిపోయారు. దీనికితోడు కార్యదర్శి పదవికి గన్నె వెంకటనారాయణ ప్రసాద్ (అన్నా), పట్టాభిరామ్, సోంగా రవీంద్రవర్మ, కోట్టేటి హనుమంతరావు, చెన్నుపాటి గాంధీ తదితరులు పోటీపడ్డారు. పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ పార్టీలో కొంతమంది ముఖ్యనేతలు అన్నాకు అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఎన్నికను వాయిదా వేశారు. ఒకటి రెండు రోజుల్లో నేతలంతా చర్చించి అన్నా పేరు ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుయువత పైనా దృష్టి తెలుగు యువత అధ్యక్ష పదవికి కాట్రగడ్డ శ్రీనివాస్ పేరు వినిపించింది. అయితే, పార్టీలోని కొంతమంది నేతల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ పేరును పక్కన పెట్టారని సమాచారం. ఎంఎస్ (కంప్యూటర్స్) చదివిన జీఎన్ఆర్ కోటేశ్వరరావు (కోటి) అనే నాయకుడి పేరును తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సిఫారసు చేశారని తెలిసింది. -
భలే ఛాన్స్ !
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఎల్ఈడీ బల్బుల డీలర్ షిప్ వ్యవహారం టీడీపీలో చర్చనీయాంశమైంది. తెలుగు యువత విభాగంలోని ముఖ్య నేత ఒకరు ఈ డీలర్ షిప్ దక్కించుకుని వ్యాపారాన్ని ప్రారంభించడంతో భలే ఛాన్స్ మిస్ అయ్యామని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వయసు, పార్టీలో చిన్నోడైనా మంచి లాభాలు వచ్చే వ్యాపారాన్ని దక్కించుకున్నాడని మరి కొందరు ప్రశంసిస్తున్నారు. ఆ డీలర్షిప్ ఎలా దక్కించుకున్నారు? ఆ నేతకు ఎవరి ఆశీస్సులు ఉన్నాయంటూ సీనియర్లు ఆరా తీస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల కోసం నిరీక్షించే కంటే ప్రభుత్వ పలుకుబడితో ఇలాంటి వ్యాపారాలు చేసుకుంటే మేలనే భావనకు సీనియర్లు వస్తున్నారు. విద్యుత్ పొదుపు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎల్ఈడీ బల్బుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా నాలుగు జిల్లాలను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాకు 20 లక్షల బల్బులు కేటాయింది. {పతీ వినియోగదారునికి రెండు ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ పంపిణీ బాధ్యత ‘కృషి కనస్ట్రక్షన్స్’ కంపెనీకి లభించింది. ‘ఈ’ టెండరు విధానంలో పంపిణీ బాధ్యతలను పొందిన సంస్థ ప్రతినిధులకు స్థానిక పరిస్థితులపై పూర్తి అవగాహన లేకపోవడంతో తమ సమీప బంధువు సహకారం తీసుకున్నారు. ఆయనే తెలుగు యువత విభాగంలోని ముఖ్య నాయకుడు. {పస్తుతం ఈ నాయకుడు కృషి సంస్థ తరఫున జిల్లాలో ఎల్ఈడీ బల్బుల పంపిణీని ప్రారంభించడం పార్టీలో చర్చనీయాంశమైంది. 110 రోజుల వ్యవధిలో జిల్లా వినియోగదారు లకు 20 లక్షల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేయాల్సి ఉంది. డీలరుషిప్ పొందిన సంస్థకు ఒక్కో బల్బు పంపిణీకి రూ.5.40 పైసలను కమీషన్‌గా ప్రభు త్వం చెల్లించనుంది. వినియోగదారుని నుంచి ఆధార్‌కార్డు నకలు, విద్యుత్ బిల్లు చెల్లించిన రశీదు, రెండు 60 వాల్టుల బల్బులు తీసుకుని రూ.20 లకు రెండు ఎల్ఈడీ బల్బులను ఈ సంస్థ అందచేస్తున్నది. బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. నెడ్‌క్యాప్ సంస్థ సూచనల మేరకు కృషి సంస్థ పనిచేయాల్సి ఉంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో 20 లక్షల బల్బులను వినియోగదారులకు పంపిణీ చేసేందుకు రోజుకు 250 నుంచి 300 కార్మికులను నియమించాల్సి ఉంది. {పభుత్వ నియమ నిబంధనల ప్రకారం బల్బులు పంపిణీ చేసిన వినియోగదారుల వివరాలను కంప్యూటరీకరించాలి. వచ్చిన బల్బులను మండల కేంద్రాల్లోనిగోడౌన్లో నిల్వ చేయాలి. ఇవన్నీ చేసినందుకు డీలర్ షిప్ పొందిన సంస్థకు కోటి రూపాయల వరకు కమీషన్ లభించనున్నది. ఈ విషయమై డీలర్ షిప్ లభించినట్టుగా ప్రచారం పొందిన తెలుగు యువత జిల్లా అధ్యక్షు లు మన్నెం శివనాగమల్లేశ్వరరావును ‘సాక్షి’ వివరణ కోరగా, డీలర్ షిప్ తనది కాదని చెప్పారు. పార్టీలో రెండు రోజుల నుంచి చర్చ జరుగుతున్న విషయం వాస్తవమేనన్నారు. డీలర్ షిప్ పొందిన కృషి సంస్థ ప్రతినిధులు తనకు సమీప బంధువు లని చెప్పారు. వారికి స్థానిక పరిస్థితులు తెలియక పోవడంతో వర్కర్ల పంపిణీ, రూట్‌మ్యాప్ తదితర పనుల్లో సహాయం చేస్తున్నానని చెప్పారు. ఈ వ్యాపారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కొందరు చేసే దుష్ర్పచారమేనని ఆయన స్పష్టం చేశారు.