నకిలీ 'ఎంటెక్'తో ఉద్యోగం.. తెలుగు యువకుడిపై కేసు
కాన్పూర్: ఎంటెక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ గేట్లో మెరిట్ ర్యాంకు వచ్చిందని నమ్మబలికి ఓఎన్జీసీలో ఉద్యోగం కొట్టేయడానికి ప్రయత్నించిన ఓ తెలుగు యువకుడిపై డెహ్రాడూన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గేట్- 2015 కన్వీనర్, ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ షౌనక్ ఛటర్జీ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం..
చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన గుణతేజ సుదర్శన్ కొద్దిరోజుల కిందట డ్రెహ్రాడూన్లోని ఓఎన్జీసీలో ఇంజనీర్ ఉద్యోగానికిగానూ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. గేట్ ఎగ్జామ్లో 712 స్కోరుతో ఆలిండియా 206వ ర్యాంకు పొందానని, కెమికల్ ఇంజనీరింగ్లో టాప్ మార్కు తనదేనని నమ్మబలికాడు. అతని తీరును శంకించిన ఇంటర్వ్యూ అధికారులు.. సుదర్శన్ ఇచ్చిన గేట్ మార్కుల లిస్టుపై తమకు అనుమానం ఉదని, ఓ సారి పరిశీలించి చూడమని గత సోమవారం గేట్- 2015 కన్వీనర్కు ఫిర్యాదుచేశారు.
దీంతో అసలు విషయం బయటపడింది. గేట్ ఎంట్రెన్స్లో సుదర్శన్ అసలు పాస్ కానేలేదు! 100కు అతనికి వచ్చింది కేవలం 17.67 మార్కులే! ఓఎన్జీసీ అధికారుల ఫిర్యాదుతో సీన్లోకి ఎంటరైన డెహ్రాడూన్ పోలీసులు సుదర్శన్ దాఖలు చేసిన నకిలీ సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేశారు.