- జిల్లా ఉదయం బందరులో, సాయంత్రం నగరంలో ఎన్నిక
- తెలుగు యువతకు కొత్తముఖం?
- కొత్త అధ్యక్షులకు అభినందనలు
సాక్షి, విజయవాడ : టీడీపీ జిల్లా, అర్బన్ అధ్యక్షుల ఎన్నిక ఆదివారం ఏకగ్రీవంగా జరిగింది. ఉదయం బందరులో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా బచ్చుల అర్జునుడు, సాయంత్రం నగరంలోని ఐవీ ప్యాలెస్‌లో జరిగిన సమావేశంలో అర్బన్ అధ్యక్షుడిగా బుద్దా వెంకటేశ్వరరావు (వెంకన్న)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలో జరిగిన సమావేశంలో పార్టీ పరిశీలకుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇస్తామన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు 33వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన నాయకులకు నామినేటెడ్ పోస్టు ఇస్తామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారని చెప్పారు. జూన్ 2న నవ నిర్మాణ దీక్ష అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రకటించాలని చెప్పారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ నూతన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు కృషిచేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి నాగుల్‌మీరా, డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, ఫ్లోర్‌లీడర్ హరిబాబు, టీడీపీ నాయుడు ముష్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా, అర్బన్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన బచ్చుల అర్జునుడు, బుద్దా వెంకన్నను పలువురు నేతలు కార్యకర్తలు గజమాలతో సత్కరించారు.
కార్యదర్శి ఎన్నిక వాయిదా
అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పదవికి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేరు వినిపించినా ఆదివారం అనూహ్యంగా ఆ పేరు పక్కన పెట్టారు. అయితే, పార్టీలో దీర్ఘకాలం పనిచేస్తున్న వారిని పక్కనపెట్టి కొత్తవారికి కీలక పదవులు ఇవ్వడంపై కొందరు సీనియర్లు గుర్రుగా ఉన్నారు. దీనికితోడు ఎస్సీ నేతలు కూడా రహస్య సమావేశం నిర్వహించి పార్టీ పరిశీలకులను నిలదీయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సమావేశంలో పట్టాభిరామ్ పేరు ప్రకటిస్తే కార్యకర్తల నుంచి నిరసన వస్తుందని భావించిన నేతలు మిన్నకుండిపోయారు. దీనికితోడు కార్యదర్శి పదవికి గన్నె వెంకటనారాయణ ప్రసాద్ (అన్నా), పట్టాభిరామ్, సోంగా రవీంద్రవర్మ, కోట్టేటి హనుమంతరావు, చెన్నుపాటి గాంధీ తదితరులు పోటీపడ్డారు. పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ పార్టీలో కొంతమంది ముఖ్యనేతలు అన్నాకు అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఎన్నికను వాయిదా వేశారు. ఒకటి రెండు రోజుల్లో నేతలంతా చర్చించి అన్నా పేరు ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగుయువత పైనా దృష్టి
తెలుగు యువత అధ్యక్ష పదవికి కాట్రగడ్డ శ్రీనివాస్ పేరు వినిపించింది. అయితే, పార్టీలోని కొంతమంది నేతల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ పేరును పక్కన పెట్టారని సమాచారం.
ఎంఎస్ (కంప్యూటర్స్) చదివిన జీఎన్‌ఆర్ కోటేశ్వరరావు (కోటి) అనే నాయకుడి పేరును తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సిఫారసు చేశారని తెలిసింది.
టీడీపీ జిల్లా, నగర సారథులు..
Published Mon, May 18 2015 4:16 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM
Advertisement