కన్హయ్య అంటే అంత భయమెందుకు?
- సిద్దార్థ కళాశాల వేదిక రద్దుపై మండిపడ్డ వామపక్షాలు
- ఐవీ ప్యాలెస్ వద్ద నిర్వహించేందుకు సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థిసంఘ నాయకుడు కన్హయ్య కుమార్ పర్యటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) లోనికి అనుమతి నిరాకరించిన పాలకవర్గం యూనివర్శిటీ ప్రాంగణాన్ని పోలీసు మయంగా మార్చి వేసింది. బుధవారం సాయంత్రం ఆయన్ను లోపలికి వెళ్లకుండా అడ్డుకుంది. ఈ తరహాలోనే విజయవాడ సభకూ పాలకులు ఆటంకాలు కల్పించారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు విజయవాడ సిద్దార్థ ఆడిటోరియంలో సభకు స్థానిక పోలీసు యంత్రాంగం అనుమతి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేయించింది. రాజకీయ వత్తిళ్లే ఈ అనుమతి రద్దుకు కారణమని విద్యార్థి, యువజన, మేథావుల విశాల వేదిక ఆరోపించింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మీటింగ్‌కు అనుమతి నిరాకరించడం ఏమి ప్రజాస్వామికమని ప్రశ్నించింది.
ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా కన్హయ్య మీటింగ్ జరిపి తీరుతామని ప్రకటించింది. సభా వేదికను ఇండోర్‌లో నిర్వహించేకన్నా బహిరంగంగా జరపడమే ఉత్తమమని భావించి కన్హయ్య మీటింగ్ వేదికను ఆంధ్రా హాస్పిటల్స్‌కు సమీపంలోని ఐవీ ప్యాలెస్ సెంటర్‌కు మార్చింది. సాయంత్రం 5.30 గంటలకు అక్కడ సభను నిర్వహించాలని తలపెట్టింది. ఇదిలా ఉంటే, కన్హయ్య సభకు ఆటంకాలు కల్పించడాన్ని పది కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఓ విద్యార్ధి సంఘ నాయకుణ్ణి చూసి పాలకులు ఇంతగా బెంబేలు ఎత్తాలా? అని ప్రశ్నించాయి. ప్రజాస్వామ్యంలో మీటింగ్ జరుపుకునే స్వేచ్ఛ కూడా లేదా? అని ప్రశ్నించాయి. ఐవీ ప్యాలెస్ సెంటర్‌లో జరిగే సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయి పాలకులకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశాయి. కాగా, అనంతపురం ఎస్‌కే యూనివర్శిటీలో అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదల చేయాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు.