కన్హయ్య సభ వద్ద తీవ్ర ఉద్రిక్తత
బీజేపీ, వామపక్ష నేతల మధ్య వాగ్వాదం, తోపులాట
సభలో భజరంగ్‌దళ్ కార్యకర్తను కొట్టిన వామపక్ష కార్యకర్తలు
బీజేవైఎంకు చెందిన 51మందిపై కేసు
విజయవాడ: జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్ విజయవాడలోని ఐవీ ప్యాలెస్‌లో నిర్వహించిన విద్యార్థి యువజన శంఖారావం సభ తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. కన్హయ్య పర్యటన నేపథ్యంలో ఉదయం నుంచే నగరంలో బీజేవైఎం నేతలు, అనుబంధ విభాగాల నాయకులు నిరసనలు నిర్వహించడంతో వాతావరణం వేడెక్కింది. కన్హయ్య వస్తే అడ్డుకుంటామని బీజేపీ అనుబంధ విభాగాల నేతలు ప్రకటించారు. అడ్డుకుంటే తీవ్రపరిణమాలు ఉంటాయని ఏఐఎస్‌ఎఫ్ నేతలు హెచ్చరించారు. తొలుత సిదార్థ కళాశాల ఆడిటోరియంలో కన్హయ్య సభ నిర్వహించాలని ఏర్పాట్లు చేసుకోగా పోలీసులు అనుమతి నిరాకరించారు.దీంతో ఐవీ ప్యాలెస్‌లో ప్రైవేట్ కార్యక్రమంగా సభ నిర్వహించారు.సభ ప్రారంభానికి రెండు గంటల ముందు నుంచే హడావుడి మొదలై చివరకు తోపులాట, భజరంగ్‌దళ్ కార్యకర్తపై దాడికి దారితీసింది. పోలీసు బందోబస్తు నడుమ కన్హయ్య సభకు చేరుకున్నారు. కన్హయ్య పూర్తి ప్రసంగం, సభ జరిగిన తీరును పోలీసులు వీడియో తీశారు.
పరస్పర నినాదాల హోరు..
కన్హయ్య గోబ్యాక్ అంటూ బీజేపీ నేతలు ఫ్లెక్సీలు చూపుతూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఐవీ ప్యాలెస్ సెంటర్‌కు చేరుకున్నారు. దీనికి ప్రతిగా ఏఐఎస్‌ఎఫ్, వామపక్ష నాయకులు బీజేపీ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. పరస్పరం దూషణలు చేసుకున్నారు. ఇరువర్గాలను పోలీసులు వారించినా ఆగకుండా, తోపులాటకు దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుడిపై ఏఐఎస్‌ఎఫ్ కార్యకర్తలు దాడిచేశారు. ఈ క్రమంలోనే భారతీయ జనతా మహిళా మెర్చా నాయకురాలు కర్రి నాగలక్ష్మి సమావేశ మందిరంలోకి వెళ్లి కూర్చున్నారు. వామపక్ష కార్యకర్తలు ఆమెను గుర్తించి దాడికి యత్నించేలోగా పోలీసులు అమెను బయటకు తీసుకువచ్చి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సమావేశ మందిరం బయట బీజేపీ రాష్ట్ర నాయకులు లక్ష్మీపతితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో 300 మంది పోలీసులతో సమావేశం మందిరం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు. పోలీసులతో పాటు ఏఐఎస్‌ఎఫ్ కార్యకర్తలు కూడా కర్రలు చేతబూని బందోబస్తు నిర్వహించారు. మరోవైపు గన్నవరం విమానాశ్రయం మొదలుకొని ఐవీ ప్యాలెస్ వరకు భారీగా పోలీసు పికెట్లు ఏర్పాటుచేశారు.
సభలో భజరంగ్‌దళ్ కార్యకర్త నినాదాలు..
అనంతరం సభ ప్రారంభిస్తున్న సమయంలో జాతీయ జెండాతో భజరంగ్ దళ్ నాయకుడు సమావేశ మందిరంలో భారత్‌మాతాకీ జై అంటూ నినాదాలు చేయడంతో ఏఐఎస్‌ఎఫ్, వామపక్ష కార్యకర్తలు తీవ్రస్థాయిలో దాడి చేశారు. గుంటూరు భజరంగ్‌దళ్ కార్యకర్త దేవర వెంకట అనిల్‌ను తీవ్రంగా కొట్టుకుంటూ బయటకు తీసుకెళ్లారు. పోలీసులు అడ్డుకుని అనిల్‌ను ఆస్పత్రికి తరలించారు. ఏఐఎస్‌ఎఫ్ కార్యకర్తలు కర్రలతో సమావేశ మందిరంలో రక్షణగా నిలవడంతో సమావేశం మొదలైంది.
51 మంది బీజేవైఎం కార్యకర్తలపై కేసు
సమావేశాన్ని అడ్డుకోవడానికి యత్నించారని భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు 51మందిపై విజయవాడ పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్ 151 కింద కేసులు నమోదు చేశారు. పూర్తి వీడియో రికార్డులు పరిశీలించిన అనంతరం దాడిచేసిన వారి అందరిపైనా కేసులు నమోదు చేయనున్నారు.