యూనివర్సిటీలపై వ్యూహాత్మక దాడి
విద్యార్థులపై బీజేపీ దమనకాండకు దిగుతోంది
జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్
హైదరాబాద్: అభివృద్ధి నినాదంతో గెలిచి ఇప్పుడు దాని స్థానంలో హిందుత్వవాదాన్ని బీజేపీ తెరపైకి తెస్తోందని.. దానిని ప్రశ్నిస్తున్న విద్యార్థి లోకంపై వ్యూహాత్మకంగా దాడి చేస్తోం దని జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్ ఆరోపించారు. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో దమనకాండ చోటుచేసుకుంటోందన్నారు. ఇది కేవలం జేఎన్‌యూ, హెచ్‌సీయూలకే పరిమితం కాలేదని... అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ, పుణె, జాదవ్‌పూర్, అలహాబాద్ వర్సిటీలకూ విస్తరించిందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో వివక్షను దూరం చేసేందుకు తాము డిమాండ్ చేస్తున్న రోహిత్ చట్టం కోసం పోరాడుతూనే ఉంటామని, తమకు పౌర సమాజం అండగా నిలవాల్సిన అవసరముందని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో నారాయణగూడలోని ఏఐటీయూసీ కార్యాలయంలో కన్హయ్యకుమార్ విలేకరులతో మాట్లాడారు. తమకు రోహిత్ వేముల ఆదర్శమని, అఫ్జల్‌గురు కాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం పట్ల పూర్తి విశ్వాసం ఉన్న తాము ఆందోళనను పూర్తి శాంతియుత వాతావరణంలోనే నిర్వహిస్తున్నామన్నారు. కానీ ప్రభుత్వమే దానిని ఉద్రిక్తంగా మారుస్తోందని ఆరోపించారు. బుధవారం తాను హెచ్‌సీయూకి వచ్చే కార్యక్రమం ఎప్పుడో ఖరారైనా.. సరిగ్గా ఒకరోజు ముందే వీసీ అప్పారావు విశ్వవిద్యాలయానికి ఎందుకొచ్చారని ప్రశ్నించారు. ఆయన వచ్చేసరికే ఆయన అభిమానులు, అనుకూల విద్యార్థులు ఆయన గదిలో ఉండి మరీ స్వాగతం పలికారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేసేవారు వీసీ చాంబర్‌పై దాడి ఎందుకు చేశారని ప్రశ్నించిన విలేకరులపై కన్హయ్య అసహనం వ్యక్తం చేశారు.
జేఎన్‌యూలో దేశ వ్యతిరేక నినాదాలు, అఫ్జల్‌గురుకు అనుకూలంగా మాట్లాడడం పట్ల ప్రశ్నలు సంధించడంతో ఆయన ఇబ్బంది పడ్డారు. ‘‘మీరు కూడా అసలు విషయం వదిలి పక్కదారిలో వెళ్తున్నారు. జేఎన్‌యూ నినాదాలకు మాకు సంబంధం లేదు. వీసీ చాంబర్‌పై దాడి ఎవరు చేశారో తేల్చేందుకు నేను పోలీసును కాదు, విద్యార్థిని. వాస్తవమేమిటో పోలీసులు తేలుస్తారు’’ అని చెప్పారు. ప్రభుత్వ దమనకాండకు విలేకరులు కూడా బలవుతున్నారని, సమాజం కోసం పరితపించేవారికి రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు. దేశభక్తి అంటే మోదీ భక్తి కాదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోనని, విద్యార్థి నేతగా రోహిత్ చట్టం కోసం పోరాడడమే ప్రస్తుతం తన లక్ష్యమని చెప్పారు.