సప్తవర్ణాల విప్లవానికి సిద్ధం
హైదరాబాద్ సదస్సులో కన్హయ్యకుమార్
భారతమాత, భారత్‌కీ అమ్మీ, మదర్ ఇండియా ఒక్కరే
భారతమాతను విభజించే కుట్ర జరుగుతోంది
జాతీయ జెండాను కాషాయమయం చేస్తున్నారు
అభివృద్ధిలో విఫలమైన బీజేపీ నకిలీ జాతీయవాదాన్ని తెరపైకి తెచ్చింది
హైదరాబాద్: ఆకుపచ్చ, తెలుపు, కాషాయ రంగులు తమవేనని.. తమ దృష్టిలో భారతమాత, భారత్‌కీ అమ్మీ, మదర్ ఇండి యా అందరూ భారతమాతలేనని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్ చెప్పారు. భారతమాతను విభజించడం వెనక కుట్ర దాగి ఉందని విమర్శించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం నిర్వహించిన రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సదస్సులో కన్హయ్య ప్రసంగించారు. ‘‘భారతమాత ఉంది. ఆమె తెల్లగానేకాదు నల్లగా, చామనఛాయగానూ ఉంటుంది. ధగధగా మెరిసే పట్టుచీరలోనేకాదు చిరిగిన మువ్వన్నెల చీరలోనూ ఉంటుంది. ఆదివాసులకు ప్రతీకైన సల్వార్ కమీజ్‌లోనూ ఉండొచ్చు. కానీ ఒక్క మీ దృక్కోణం నుంచే, మీకు నచ్చిన రంగులోనే భారతమాతను చూపలేరు. భారతదేశపు రంగే భారతమాత రంగు. అదే దేశ ప్రజల రంగు. ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ఆ రంగును వినియోగంచలేరు. ఎరుపు (వామపక్షవాదుల) రంగుకు వ్యతిరేకంగా నీలం (అంబేడ్కరిస్టుల) రంగును ఉపయోగించలేరు.
ఎరుపు, నీలం వర్ణాల ఐక్యతతో కులతత్వం, మతతత్వంపై పోరాడుతాం. ఈ రంగులే కాదు సప్తవర్ణాలూ ఉంటాయి. అంటరానితనం, అగ్ర, నిమ్న విభేదాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో విప్లవం సాధ్యం కానుంది. మేం సప్తవర్ణాల విప్లవానికి సిద్ధంగా ఉన్నాం..’’ అని కన్హయ్య చెప్పారు. విద్యార్థులకు వ్యతిరేకంగా భద్రతా దళాలను నిలబెట్టే కుట్రలో విజయం సాధించలేరని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ప్రాణత్యాగం చేస్తున్న వారూ అమరులేనని, పొలాల్లో చనిపోతున్న రైతులూ అమరులేనని, వర్సిటీల్లో ప్రాణత్యాగం చేస్తున్న రోహిత్ లాంటి వారూ అమరులేనని పేర్కొన్నారు. సమాజంలో అసమానతలు తొలగించేందుకు వీరంతా త్యాగాలు చేస్తున్నారని చెప్పారు. అభివృద్ధిలో విఫలమైన బీజే పీ మతోన్మాద విధానాలతో నకిలీ జాతీయవాదాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శించారు. ఈ దేశం ఏ ఒక్క భాష, మతం, కులం, లింగానికి చెందినది కాదని... అన్ని రకాల జాతీయవాదాలను గౌరవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
క్రోనీ క్యాపిటలిజమే పెద్ద సమస్య
దేశానికి, యావత్ ప్రపంచాన్ని క్రోనీ క్యాపిటలిజం పట్టిపీడిస్తోందని కన్హయ్య పేర్కొన్నారు. ముస్లింలు అమెరికా వదిలి వెళ్లాలన్న డోనాల్డ్ ట్రంప్‌కు అమెరికాలో మద్దతు పెరుగుతుండడం దానికి నిదర్శనమన్నారు. అల్లర్లు చేయించి ఎలా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారో ఆలోచించాలని చెప్పారు. తమ పోరాటం ఒక వర్సిటీకి పరిమితమైనదికాదని, వేల ఏళ్ల అంటరానితనం అంతానికి పోరాటమని వ్యాఖ్యానించారు. మార్క్సిస్టు, అంబేడ్కరైట్, సోషలిస్టు, లోహియాయిస్టు, తటస్తులు.. ఇలా ఏ భావజాలపు ప్రజలైనా సరే ఈ రోజు ముప్పేట దాడిలో చిక్కుకున్నారని... ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని పేర్కొన్నారు. తాను దేశంలోని విద్యార్థులను ఏకం చేస్తున్నానని ఓ వ్యక్తి విమర్శించాడని... ఎవరు విభజిస్తే తాము ఏకం చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తే సమాధానం రాలేదని చెప్పారు. ఒక చిహ్నం ఆధారంగా ప్రజలను విభజించేందుకు హిందూత్వ శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. జాతీయ జెండా నుంచి తెలుపు, ఆకుపచ్చ రంగులు, అశోక చక్రాన్ని మాయం చేసి పూర్తిగా కాషాయమయం చేసేందుకు ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.
విద్యార్థులు ముందుకు రావాలి
యూనివర్సిటీల్లో, వివిధ రంగాల్లో రాజకీయ జోక్యాన్ని అరికట్టేందుకు విద్యార్థులు ముందుకు రావాలని కన్హయ్య పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సుకు ముందు మఖ్దూం భవన్‌లో ఆయన మాట్లాడారు. తాము చేసే ఉద్యమాలకు మద్దతుగా వచ్చే వామపక్షాలను సైతం కలుపుకోవాలని... మత అసహనానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధపడాలని పేర్కొన్నారు. హెచ్‌సీయూ వీసీ అప్పారావును వెనక్కి పంపేందుకు పోరాడాలన్నారు.
భావాలు వేరైనా పోరు ఒకటే...
‘‘శ్రామికవర్గం విముక్తి కోసం పోరాడే మార్క్సిస్టు కావచ్చు, దళితుల విముక్తి కోసం పోరాడే అంబేడ్కరైట్స్ కావచ్చు, ఆదివాసుల హక్కుల కోసం పోరాడేవాళ్లు ఉండవచ్చు, అల్ప సంఖ్యాకుల హక్కుల కోసం పోరాడేవాళ్లు కావచ్చు.. సరళీకృత విధానాల తరంలో అందరి పోరాటం ఒకటే అయింది..’’ అని కన్హయ్య పేర్కొన్నారు. కులం, మతం ఏదైనా అణచివేతకు వ్యతిరేకంగా ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. దళితులైనా, ఆది వాసులైనా, మైనారిటీలదైనా, మహిళలలైనా లడాయి ఒక్కటేనన్నారు. కేవలం వంద గృహాలు దేశ సంపదలో 95 శాతాన్ని తమ అధీనంలో ఉంచుకున్నాయని, వాళ్ల పక్షానే బీజేపీ నిలబడిందని ఆరోపించారు.
మోదీజీ.. ఆశలెందుకు రేపారు?
ఆప్ మేరీ గలీమే ఆయే క్యోం
(మీరు మా వీధికి ఎందుకొచ్చారు)
నాఉమ్మీదీ మే ఉమ్మీద్ జగాయే క్యోం
(నైరాశ్యపు మనసుల్లో ఆశలెందుకు రేపారు)
ఖుష్ థే అప్నే ముఫ్లిసీ మే
(మా దైన్యంలో మేం ఆనందంగా ఉంటిమి)
అచ్ఛే దిన్‌కా సప్నే దిఖాయే క్యోం
(మంచి రోజుల కలలెందుకు చూపారు)
మోదీపై సదస్సులో అప్పటికప్పుడు రాసిన
ఈ కవితను కన్హయ్య చదివి వినిపించారు