సగర్వంగా చాటాలి: సీఎం రేవంత్
పెట్టుబడుల ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా కార్యాచరణ
దశాబ్దం తర్వాత రాష్ట్రంలో నిజమైన ప్రజాపాలన
రుణాల రీస్ట్రక్చరింగ్‌పై సర్కారు దృష్టి
గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలి. విశ్వవేదికపై తెలంగాణ బ్రాండ్‌ను సగర్వంగా చాటాలి. అమెరికా, దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురంచి సమగ్రంగా వివరించాం. ఫ్యూచర్ స్టేట్‌గా తెలంగాణను పరిచయం చేశాం. ఈ సందర్భంగా, దావోస్ పర్యటన సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చడానికి కార్యాచరణ ప్రారంభించాం.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో దశాబ్దం తర్వాత నిజమైన ప్రజాపాలన మొదలైంది. లోతైన సమీక్షలతో మంచీ చెడులను విశ్లేషించి మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం అన్న స్పృహ, స్ఫూర్తితో పాలన చేస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం గోల్కొండ కోటపై ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
స్వేచ్ఛా స్వాతంత్య్రాల పునరుద్ధరణ
‘అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరు ద్ధరిస్తామన్నాం. అక్షరాలా చేసి చూపిస్తున్నాం. పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈ రోజు తెలంగాణలో ఉంది. మా ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమై ఉంది. గత పదేళ్లలో రాష్ట్ర అప్పు దాదాపు 10 రెట్లు పెరిగింది.
రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రూ.75,577 కోట్లు ఉన్న అప్పు, 2023 డిసెంబర్ నాటికి రూ.7 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేస్తున్నాం. అమెరికా పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో జరిగిన భేటీలో తక్కువ వడ్డీలతో రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునే అంశంపై సానుకూల చర్చలు జరిగాయి. గతంలో మాదిరిగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజలపై భారం మోపం’ అని రేవంత్ చెప్పారు.
త్వరలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు
‘ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీల అమలు బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే ప్రారంభించి చరిత్ర సృష్టించాం. మహా లక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాల ద్వారా జూలై నాటికి మహిళలు రూ. 2,619 కోట్లు ఆదా చేయగలిగారు. ఆరోగ్యశ్రీ వైద్యచికిత్సల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ అమలు చేయాలని నిర్ణయించాం. ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీని త్వరలో ప్రారంభిస్తాం. రూ.500కే వంట గ్యాస్ సరఫరాతో 43 లక్షల మందికి లబ్ధి చేకూరుతోంది. గృహజ్యోతి పథకం కింద 47,13,112 పేదల గృహాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
భూ సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం
‘ధరణిలో అనేక అవకతవకలు జరిగినట్టుగా గుర్తించాం. భూ సమస్యల పరిష్కారానికి సరికొత్త సమగ్ర చట్టం తీసుకురావాలని భావిస్తున్నాం. డ్రగ్స్ విషయంలో జీరో టాలరెన్స్‌ను అనుసరిస్తున్నాం. సైబర్ నేరాల బాధితులకు సత్వర సహాయం అందేలా 1930 నంబర్‌తో 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అంగన్‌వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం. బేగరి కంచె వద్ద యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశాం..’ అని సీఎం పేర్కొన్నారు.
అమరవీరులకు సీఎం నివాళి
సాక్షి, హైదరాబాద్/రసూల్‌పురా: స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని గురువారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ముందుగా జూనియర్ సైనికుడు ఒకరు నివాళులర్పించిన అనంతరం ఆర్మీ అధికారులు, సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి.. పలువురు ఆర్మీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. కాగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కూడా రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.
నిరుద్యోగులు చెప్పుడు మాటలు వినొద్దు
‘రాష్ట్రంలో 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం. శాసనసభలో జాబ్ క్యాలెండర్ ప్రవేశ పెట్టాం. నిరుద్యోగ యువత చెప్పుడు మాటలు విని భవిష్యత్తును చెడగొట్టుకోవద్దు. 63 లక్షల మంది మహిళలను వ్యాపార, పా రిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇందిర మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేశాం. 63.86 లక్షల మంది మహిళా సభ్యులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. పొరుగు రాష్ట్రాలు, కేంద్రంతో స్నేహ పూర్వకంగా, సఖ్యతతో వ్యవహరిస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘రైతన్నలకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ ఓ అద్భుత ఘట్టం..’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment