అరెస్టు చేయకుండా మళ్లీ బాధ్యతలా?
హెచ్‌సీయూ వీసీ వ్యవహారంలో ఉత్తమ్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులున్న వ్యక్తికి హెచ్‌సీయూ వైస్‌చాన్సలర్‌గా మళ్లీ బాధ్యతలు అప్పగించడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాశవిక రాజకీయాలకు నిదర్శనమని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్, రామ్మోహన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు రోజా ఎంజాన్‌లతో కలసి బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశంలో రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కులను పాలకులు కాలరాస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు.
హెచ్‌సీయూలో వేముల రోహిత్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో వీసీ అప్పారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని వివరించారు. అలాంటి వీసీని అరెస్టు చేయకుండా మళ్లీ అదే పదవిలో తిరిగి నియమించడం దారుణమన్నారు. యూనివర్సిటీలను రాజకీయ కేంద్రాలుగా చేసుకుని బీజేపీ సర్కార్ అమానుష నిర్ణయాలు తీసుకుంటోందని, దీనికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం మద్దతునిస్తోందని ఉత్తమ్ విమర్శించారు. హెచ్‌సీయూలో పోలీసురాజ్యం నడుస్తున్నదని, యూనివర్సిటీలోకి విద్యార్థులను కూడా రానివ్వడం లేదని అన్నారు. పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని, ప్రశ్నించేవారిని అణచివేసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. కాగా, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఉద్యమ వాతావరణ నెలకుంటోందని రాష్ట్ర ప్రభుత్వం భయపడుతున్నదన్నారు. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నదనే భయంతోనే యూనివర్సిటీల్లో ఉద్యమాలపై, విద్యార్థులపై పోలీసులు కిరాతకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
వీసీని రీకాల్ చేయాలి: వీహెచ్
హెచ్‌సీయూ వీసీని వెంటనే రీకాల్ చేయాలని ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఢిల్లీ విద్యార్థినేత కన్హయ్య కుమార్ రావడానికి ముందుగానే వీసీని తిరిగి నియమించడం వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందన్నారు. కన్హయ్య సమావేశాన్ని ఆపడానికే వీసీని మళ్లీ తీసుకొచ్చారని ఆరోపించారు. వీసీని రీకాల్ చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని, రాష్ట్రపతికి లేఖ రాయాలని వీహెచ్ డిమాండ్ చేశారు.