సహజ సేద్యం విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. తద్వారా పంటల సాగుకు రైతులకు పెట్టుబడి వ్యయం బాగా తగ్గుతోంది. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం కూడా తగ్గడంతో పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తోంది. ఇదే సమయంలో మార్కెట్‌లో సేంద్రీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సహజ సేద్యాన్ని ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవాలి.
– నీతి ఆయోగ్
సాక్షి, అమరావతి: సహజ సేద్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది. రాష్ట్రంలో రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు సంఘటితంగా ప్రకృతి సేద్యం చేస్తున్నారని వ్యవసాయంపై వర్కింగ్ పత్రంలో వెల్లడించింది. ఏపీ మోడల్‌ను దేశమంతా అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రాచుర్యంలోకి తేవడంలో ఏపీ దేశంలోనే ముందుందని పేర్కొంది. వ్యవసాయానికి సహజ సేద్యం కొత్త మార్గాన్ని సూచిస్తోందని తెలిపింది. ప్రకృతి సేద్యం వల్ల పురుగు మందులపై ఆధార పడటం తగ్గుతోందని, జీవ వైవిధ్యం సుసంపన్నం అవుతుందని తెలియజేసింది. ప్రత్యామ్నాయ జంతు ఉత్పత్తి వ్యవస్థలను సృష్టించడంతో పాటు పట్టణ వ్యవసాయం మెరుగుపడుతుందని పేర్కొంది. నీతిఆయోగ్ వర్కింగ్‌పత్రంలో ఇంకా ఏముందంటే..
సహజ సేద్యంతో నికర ఆదాయం
► ఆంధ్రప్రదేశ్‌లో 3,011 గ్రామాల్లో 6.95 లక్షల మంది రైతులు సహజ వ్యవసాయం చేస్తున్నారు. దీంతో ప్రధానంగా వరి, పప్పులు, శనగలు, మిరప పంటల దిగుబడిలో మెరుగుదల కనిపిస్తోంది. తద్వారా రైతులకు నికర ఆదాయం వస్తోందని మూడవ (థర్డ్) పార్టీ అధ్యయనంలో వెల్లడైంది. ఖరీదైన ఎరువులు వినియోగం తగ్గడమే కాకుండా విద్యుత్ వ్యయం కూడా తగ్గుతుంది.
► ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ పద్ధతిలో పంటలు సాగుచేసే రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోంది. అవసరమైన వాటిని సమకూరుస్తోంది. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది.
► రైతు ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలను సంఘటితం చేసి ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తోంది. ఇదే తరహాలో దేశ మంతటా ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
నిధుల కేటాయింపు పెరగాలి
► వచ్చే ఐదేళ్లలో దేశంలో 20 లక్షల హెక్టార్లను ప్రకృతి సేద్యం పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత హిమాచల్‌ప్రదేశ్‌లో 77,106 మంది రైతులు సహజ వ్యవసాయ విధానంపై శిక్షణ పొందారు. సహజ సేద్యం ద్వారా ఆ రాష్ట్రంలో ఆపిల్, గోధుమ పంటలకు వ్యాధులు సోకడం తక్కువగా ఉంది. తద్వారా ఇన్‌పుట్ వ్యయం తగ్గి, ఉత్పాదకత పెరగడం ద్వారా ఆదాయం మెరుగైంది.
► భారతదేశంలో వ్యవసాయ పర్యావరణ పద్ధతులను ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. సహజ వ్యవసాయం అనేది విజ్ఞాన ఇంటెన్సివ్ వ్యవస్థ అయినందున రైతులకు సహ శిక్షణ, సహ విద్య అందించాలి. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులను భారీగా పెంచాలి. సహజ సేద్యం విస్తీర్ణం పెరిగే కొద్దీ, ఎరువుల సబ్సిడీ వ్యయం తగ్గుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సహజ సేద్యానికి నిధుల కేటాయింపుల్లో పెద్ద పీట వేయాలి.
సేంద్రీయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ముఖ్యం
సేంద్రీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది రైతులు సహజ సేద్యం వైపు మళ్లడానికి వీలుంది. ఈ నేపథ్యంలో సేంద్రీయ ఉత్పత్తుల ట్రేసిబులిటీ, ధ్రువీకరణ, నాణ్యత సర్టిఫికేషన్ చాలా ముఖ్యం. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఇందుకు దోహదపడుతుంది. సహజ సేద్యం ద్వారానే పంటల ఉత్పత్తులు జరిగాయని కచ్చితంగా ధ్రువీకరణ జరిగినప్పుడే ప్రజల ఆదరణ ఉంటుంది. అందుకే ఆ టెక్నాలజీని అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. సేంద్రీయ ఉత్పత్తుల సర్టిఫికేషన్ కోసం సాంకేతికత వినియోగంపై మరింతగా పరిశోధన జరగాలి. అప్పుడే దేశంలో సహజ వ్యవసాయం నిలదొక్కుకోగలదు. ఈ దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment