పెనుకొండ మండలం పులేకమ్మ గుడి వెనుక భాగంలోని (చిగ్రాల్) అటవీ ప్రాంతంలో పలు చెట్లను 5 రోజుల క్రితం అక్రమంగా కొందరు వ్యక్తులు రంపంతో కోసేశారు. అనంతరం దుంగలుగా మార్చి కారులో బెంగళూరు తరలించేందుకు సిద్ధమయ్యారు. దుంగలను కారులో తీసుకెళ్లడంపై అనుమానపడిన ఓ గొర్రెల కాపరి సోమందేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వెంటనే దాడులు నిర్వహించారు. వెలగమాకులపల్లి క్రాస్ వద్ద 44వ జాతీయ రహదారిపై స్వాధీనం చేసుకున్నారు. తీరా దొంగలను ఆరా తీస్తే పట్టుబడింది ఎర్రచందనం దుంగలని తేలింది. 40 దుంగల విలువ సుమారు రూ. 5 లక్షలకుపైగా ఉంటుందని పోలీసులు తేల్చారు. బెంగళూరు తరలించి అక్కడి నుంచి స్మగ్లర్ల ద్వారా విదేశాలకు తరలించేందుకు తీసుకెళ్తునట్లు విచారణలో బయటపడింది.
పెనుకొండ: పెనుకొండ రేంజ్ పరిధిలో 26 వేల హెక్టార్లలో అటవీప్రాంతం విస్తరించి ఉంది. బుక్కపట్నం 33,803, కదిరి 49,391, కళ్యాణదుర్గం రేంజ్ పరిధిలో 24,224 హెక్టార్లలో అటవీప్రాంతం ఉంది. 2000 సంవత్సరం నుంచి 2009 మధ్య కాలంలో పలు విడతలుగా అటవీశాఖ అధికారులు ఈ ప్రాంతంలో ఎర్రచందనం మొక్కలు నాటారు. అప్పట్లో నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి కోత దశకు చేరుకున్నాయి.
విలువైన సంపదపై స్మగ్లర్ల కన్ను..
భూ మండలంపై అత్యంత అరుదుగా దొరికే సంపదలో ఎర్రచందనం ఒకటి. విదేశీ మార్కెట్‌లో దీనికి ఉండే విలువ అంతా ఇంతా కాదు. ఎర్రబంగారంగా ఎర్రచందనాన్ని అభివర్ణిస్తారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఎర్రచందనం అంటే శేషాచలం కొండలు గుర్తొస్తాయి. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాలో విస్తరించిన ఈ అటవీ ప్రాంతంపైనే స్మగ్లర్ల కన్ను ఎక్కువగా ఉంటుంది. కానీ, ఇప్పుడు పెనుకొండ ప్రాంతంలోనూ ఇలాంటి వారి ఆనవాళ్లు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకూ పోలీసులు, అటవీ అధికారులే గుర్తించని ఎర్రచందనం చెట్లపై వీరి గొడ్డలివేటు పడడం కలకలం సృష్టించింది. ఎర్రదొంగలు ఇచ్చిన సమాచారంతో చెట్లను లెక్కించే పనిలో పడిన అటవీ శాఖ అధికారులు.. వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో పెరిగే ఎర్రచందనం చెట్లు ఈ ప్రాంతంలో ఇంత భారీగా ఎలా పెరిగాయన్న ఆలోచనల్లో మునిగిపోయారు.
సిబ్బంది కొరతతో సతమతం..
అంతర్జాతీయ స్థాయిలో భారీ రేటు పలికే ఎర్ర చందనం జాడ ఉనికిలోకి రావడంతో ఇప్పుడు వాటి సంరక్షణ అటవీ అధికారులకు తలకు మించిన భారంగా పరిణమించింది. పెనుకొండ రేంజ్ పరిధిలో అటవీశాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇక్కడ శాశ్వత‡ రేంజర్ లేకపోగా కళ్యాణదుర్గం రేంజర్ రాంసింగ్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక డిప్యూటీ రేంజర్ కానీ, బీట్ ఆఫీసర్ కానీ లేరు. ఇటీవల డీఆర్‌ఓ రామకృష్ణ, బీట్ ఆఫీసర్ గంగాధర్ అవినీతి ఆరోపణలతో సస్పెండ్ కావడంతో మరింత భారం పడింది. వారి స్థానంలో ఇప్పటికీ ఎవరినీ నియమించలేదు. 10 మంది బీట్ ఆఫీసర్లకు గానూ, 8 మంది ఉన్నారు. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు 10 మందికి, ఇద్దరు ఉన్నారు. దీంతో ఎర్రచందనం చెట్ల సంరక్షణ ప్రమాదంలో పడింది. ఎంతో విలువైన సంపదగా పేరుగాంచిన ఎర్రచందనాన్ని పోలీసులతో సమన్వయం చేసుకుంటూ అటవీ శాఖ అధికారులు కాపాడాల్సి ఉంది.
గస్తీ పెంచుతాం
ఎర్రచందనం చెట్ల మనుగడకు ఎలాంటి ఇబ్బంది రానీయం. కొన్ని చెట్లు కోత దశలో ఉన్నట్లు కనిపించినా, పూర్తిగా ఆ స్థితికి చేరుకునేందుకు చాలాకాలం పడుతుంది. తగినంత మంది సిబ్బందిని కేటాయించాలని ఉన్నతాధికారులను కోరాం. గస్తీ పెంచి ఎర్రచందనం చెట్లను సంరక్షిస్తాం.
– శామ్యూల్, సబ్ డీఎఫ్‌ఓ, పెనుకొండ
Comments
Please login to add a commentAdd a comment