
సాక్షి, నెల్లూరు (కృష్ణపట్నం): కరోనా మహమ్మారికి విరుగుడుగా భావిస్తున్న ఆనందయ్య ఆయుర్వేద మందు వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆయుష్ చేపట్టిన ప్రాధమిక విచారణలో తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. అయితే ఈ మందు తయారీ విధానంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను వారం రోజుల్లో ప్రభుత్వానికి అందజేస్తామని ప్రకటించారు.
ప్రభుత్వం అనుమతిచ్చాకే ఈ మందు పంపిణీ జరుగుతుందని, అంతవరకు ఎవ్వరూ దీన్ని వాడకూడదని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ మందుపై అధ్యయనానికి ఐసీఎంఆర్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందాన్ని పంపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే.
వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇస్తాం
కృష్టపట్నంలో ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఆయుష్ కమిషనర్ రాములు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనందయ్య మందుతో సైడ్‌ఎఫెక్ట్స్ లేవని ప్రాథమిక నిర్థారణలో తేలిందని అన్నారు. ఆయుర్వేద మందు తయారీ విధానంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇస్తామని అన్నారు.
ప్రభుత్వం అనుమతి ఇచ్చాకే ఆయుర్వేద మందు పంపిణీ జరుగుతుందని రాములు స్పష్టం చేశారు. కాగా, కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై అధ్యయనం జరిపేందుకు కేంద్ర సంస్థలు రంగంలోకి దిగనున్నాయి. ఈ మేరకు సెంట్రల్ ఆయుష్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డీజీతో సంప్రదింపులు జరిపినట్టు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment