కాకినాడలో జిల్లా కార్యాలయ భవన నిర్మాణంపై నోటీసులు
ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
కాకినాడ రూరల్: కాకినాడ నగరం 49వ డివిజన్లోని పైడా వారి వీధి రాజేశ్వరి నగర్ ప్రాంతంలో అనుమతి లేకుండా వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం నిర్మిస్తున్నారని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు శనివారం నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 452(1) అండ్ 461(1) ఆఫ్ ఏపీఎంసీ యాక్ట్, సెక్షన్ 89 (1అండ్2), రెడ్ విత్ సెక్షన్ 82, 90(1) ఆఫ్ ఏపీఎంఆర్ అండ్ యూడీఏ యాక్ట్–2016 కింద నిర్మాణంలో ఉన్న భవనానికి ఆదివారం నోటీసులు అతికించారు.
తదుపరి నిర్మాణాన్ని తక్షణం ఆపివేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబును ఆదేశించారు. అనధికార నిర్మాణాన్ని ఎందుకు తొలగించకూడదో తగిన కారణం చూపాలని నోటీసులో పేర్కొన్నారు. కన్నబాబు లేదా ఆయన అనుమతి పొందిన వారి ద్వారా ఏడు రోజుల్లో రాత పూర్వకంగా వివరణ ఇవ్వాలన్నారు.
టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ కడియాల శ్రీరమ్య డిజిటల్ సిగ్నేచర్‌తో ఈ నోటీసు జారీ అయ్యింది. దీనిపై టౌన్ ప్లానింగ్ విభాగం డీసీపీ హరిదాస్‌ను వివరణ కోరగా, అనుమతి కోసం దరఖాస్తు చేశారని.. అప్రూవల్ అవ్వలేదన్నారు.
కడప వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి నోటీసులు
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ జిల్లా కడపలోని రామాంజనేయపురంలో నిర్మిస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి నగర పాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్లాన్ అప్రూవల్ లేకుండా నిర్మిస్తున్నారని, దీనిపై ఎందుకు చర్యలు తీసుకో కూడదో తెలపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కార్యాలయం వద్ద గోడలకు నోటీసులు అంటించారు. పోస్ట్ ద్వారా కూడా నోటీసులు పంపినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment