![Notification For Filling The Posts Of Anganwadi Supervisor - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/15/Anganwadi-Supervisor.jpg.webp?itok=gYGWzc0y)
( ఫైల్ ఫోటో )
అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పదోన్నతుల కోసం ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న వారికి సువర్ణావకాశం కలి్పంచింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సూపర్‌వైజర్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఒంగోలు రీజియన్ పరిధిలో 142 పోస్టులు ఉన్నాయి. సుమారు 5,530 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణకు ఒంగోలు నగర పరిధిలోని ఏడు ఇంజినీరింగ్ కళాశాలలను ఎంపిక చేశారు. కలెక్టర్ దినేష్ కుమార్ పర్యవేక్షణలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
ఒంగోలు సబర్బన్: అంగన్‌వాడీ సూపర్‌వైజర్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ పోస్టు కోసం ఏళ్ల తరబడి పడిగాపులు కాసిన అంగన్‌వాడీ కార్యకర్తలకు సువర్ణావకాశం కల్పించింది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి పూనుకున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో కొన్ని పోస్టులను భర్తీ చేశారు. ఆ తరువాత 2013 డిసెంబర్‌లో కిరణ్ కుమార్ రెడ్డి రెగ్యులర్ పోస్టులను అసంపూర్తిగా భర్తీ చేశారు. ఆ తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఐదేళ్లపాటు నిర్లక్ష్యం చేశారు. పోస్టుల భర్తీకి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు ఆందోళన చేసినా పెడచెవిన పెట్టారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నోటిఫికేషన్ జారీ కావడంతో అంగన్‌వాడీ కార్యకర్తల్లో ఆనందం నెలకొంది. ఈ నెల 12వ తేదీతో అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగిసింది.
5,530 దరఖాస్తులు
అంగన్‌వాడీల్లో కార్యకర్తలుగా పనిచేస్తున్న వారి నుంచే సూపర్‌వైజర్ గ్రేడ్–2 పోస్టులకు ఎంపిక చేస్తారు. పాత ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో పనిచేస్తున్న వారికి సంబంధించి ప్రక్రియను ప్రారంభించారు. జిల్లాల పునర్విభజన తరువాత ఈ మూడు జిల్లాల పరిధి ప్రస్తుతం ఐదు జిల్లాలకు పెరిగింది. ఒంగోలు ఆర్‌జేడీ కార్యాలయం పరిధిలో మొత్తం 142 సూపర్‌వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందుకుగాను మొత్తం 5,530 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
50 మార్కులు..
అంగన్‌వాడీ సూపర్‌వైజర్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి రాత పరీక్షతో పాటు స్పోకెన్ ఇంగ్లిష్ ప్రొఫిషిఎన్సీ (ఆన్ వీడియో)తో కూడిన పరీక్ష నిర్వహించనున్నారు. 50 మార్కులు. అందులో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు 90 ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున వేస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు ఒక్కోదానికి అర మార్కు చొప్పున 45 మార్కులకు ఇస్తారు. వీటితోపాటు ఐదు మార్కులకు స్పోకెన్ ఇంగ్లిషు ప్రొఫిషిఎన్సీకి కేటాయించారు. అలాగే నెగిటివ్ మార్కుల విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ప్రశ్నకు తప్పుడు సమాధానం రాస్తే పావు మార్కు తగ్గిస్తారు.
ఏడు కాలేజీల్లో పరీక్ష
ఒంగోలు ఆర్‌జేడీ కార్యాలయం పరిధిలో సూపర్‌వైజర్ గ్రేడ్–2 పోస్టుల కోసం రాత పరీక్ష నిర్వహించేందుకు ఏడు కాలేజీలను ఎంపిక చేశారు. కలెక్టర్ ఏఎస్.దినేష్ కుమార్ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందుకు సంబంధించి పోలీస్ అధికారులు, ప్రభుత్వ అనుబంధ విభాగాల అధికారులతో కలెక్టర్ సమీక్ష కూడా నిర్వహించారు.
ఏర్పాట్లు పూర్తి
సూపర్‌వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 15 నుంచి హాల్ టికెట్లు పంపిణీ చేస్తున్నాం. 18వ తేదీన కేటాయించిన కాలేజీల్లో రాత పరీక్ష ఉంటుంది. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు అభ్యర్థులు పరీక్ష హాలులోకి రావాలి. 10 గంటలకు పరీక్ష ప్రశ్న పత్రం ఇస్తాం. 10 గంటల తరువాత ఎవరినీ హాలులోని అనుమతించం. – వై.శైలజ, ఆర్‌జేడీ, ఒంగోలు
Comments
Please login to add a commentAdd a comment