
ఫైల్ ఫోటో
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు 2021–22 నుంచి 2023–24 బ్లాక్ పీరియడ్‌కు గాను ఫీజుల ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో తమకు సమర్పించాలని రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి కోరారు. ఇందుకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు కోరుతున్న ఫీజులు, అందుకు సంబంధించిన జమా ఖర్చుల వివరాలు, డాక్యుమెంట్లు, ఇతర సమాచారాన్ని కమిషన్ వెబ్‌సైట్ (www.apsermc.ap. gov.in)లో పొందుపరచాలని కోరారు.
ఇందుకు ఫిబ్రవరి 15 తుది గడువుని పేర్కొన్నారు. ఇంతకుముందు గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలను ఆధారంగా చేసుకుని ఫీజులను నిర్ణయించామన్నారు. ఆ ఫీజుల పరిధిలోకి రాని విద్యాసంస్థలు అదనపు ఫీజుల వివరాల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పామన్నారు. దీన్ని సవాల్ చేస్తూ కొన్ని విద్యాసంస్థలు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం సూచనల మేరకు తిరిగి నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. హైకోర్టు సూచన మేరకు విద్యాసంస్థల్లోని మౌలిక సదుపాయాలు, ఇతర ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్ ఫీజులను సవరిస్తుందన్నారు. ఏదైనా విద్యా సంస్థ దరఖాస్తు చేసుకోకపోతే ఫీజులు వసూలు చేసుకోవడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment