చిట్టి పాపాయిలకు గట్టి భరోసా | NRC Support For Underweight And Short Children | Sakshi
Sakshi News home page

చిట్టి పాపాయిలకు గట్టి భరోసా

Published Fri, May 6 2022 4:11 PM | Last Updated on Fri, May 6 2022 4:37 PM

NRC Support For Underweight And Short Children - Sakshi

కర్నూలు(హాస్పిటల్‌): చిన్నారుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల్లో ఎత్తుకు తగ్గ బరువు లేని వారిని గుర్తించి ప్రత్యేక చికిత్సతో పాటు ఉచితంగా పోషకా హారాన్ని అందిస్తోంది. ఇందుకు గానూ ఎన్‌ఆర్‌సీ కేంద్రాలను సమర్థవంతంగా ఉప యోగించుకుంటోంది. రోజుకు దాదాపు 15 మంది చిన్నారులు న్యూట్రిన్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో చేరి వైద్యం, పౌష్టికాహారం పొందుతున్నారు. ఇక్కడికి చిన్నారులను తీసుకొచ్చే తల్లిదండ్రులకూ నగదు పారితోషికం ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.   

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగంలో పౌష్టికాహార పునరావాస కేంద్రం(ఎన్‌ఆర్‌సీ)ను 2012లో ఏర్పాటు చేశారు. ఇందులో 20 పడకలున్నాయి. ఇద్దరు వైద్యులతోపాటు ముగ్గురు స్టాఫ్‌ నర్సులు, ఒక వంటమనిషి, ఇద్దరు న్యూట్రిషియన్‌ కౌన్సిలర్లు విధులు నిర్వహిస్తున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు చిన్నపిల్లల వార్డుకు వచ్చిన బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు ఇక్కడ కౌన్సిలింగ్‌తో పాటు పౌష్టికాహారం అందిస్తున్నారు. అవసరం మేరకు చిన్నారులను 14 నుంచి 21 రోజుల పాటు వార్డులో ఉంచుకుని, బరువులో మార్పు వచ్చాక డిశ్చార్జ్‌ చేయడంతో పాటు ఇంటి వద్ద ఏమి, ఎలా తినిపించాలో తల్లిదండ్రులకు వివరించి పంపిస్తున్నారు. డిశ్చార్జ్‌ అయ్యాక కూడా వారం, రెండు వారాలు, నెల, రెండు నెలలు ఇలా నాలుగుసార్లు చిన్నారులకు ఫాలో అప్‌ చికిత్సను అందిస్తున్నారు.  

చిన్నారులకు ఇస్తున్న ఆహారం 
బెల్లంతో చేసిన సగ్గు బియ్యం పాయసం, రవ్వ పాయసం, పెసరబ్యాళ్ల పాయసం, జొన్నపిండి జావ/రాగి జావ/అన్నం జావ, ఉడికించిన గంజిగడ్డ, బంగాళదుంప, మెత్తగా ఉడికించిన అన్నం, అరటిపండు, టమాటా రసం, పాలలో నానబెట్టిన అటుకులు/అటుకుల ఉప్మా, కూరగాయలతో చేసిన ఉప్మా, అరటిపండు కలిపిన పెరుగు అన్నం, పల్చటి మజ్జిగతో మెత్తని అన్నం, టమాటా గుజ్జుతో మెత్తగా అన్నం, పప్పు కట్టు చారుతో అన్నం, పప్పు చారుతో అన్నం/పాలన్నం, రవ్వ ఉప్మా/రవ్వ గంజి, పొంగళి/కిచిడి, ఇడ్లీ, రసం, కోడిగుడ్డు, పండ్లు/పండ్ల రసాలు/టెంకాయనీళ్లు/మజ్జిగ/నిమ్మ, చెరకు రసం/ఉడికించిన కూరగాయల రసం అందిస్తారు.  

తల్లులకు ఉచితంగా భోజనం, పారితోషికం 
ఆస్పత్రిలోని ఎన్‌ఆర్‌సీలో చికిత్స పొందుతు న్న పిల్లల తల్లులకు ఉచితంగా భోజనంతో పాటు రోజుకు రూ.150 చొప్పున పారితోషి కం అందిస్తున్నారు. ఇది బరువు తక్కువగా జన్మించిన పిల్లలకు వైద్యం చేయిస్తూ పనులు మానుకుని ఆస్పత్రిలో ఉంటున్నందుకు ఆసరాగా ఈ మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తోంది. అలాగే బరువు తక్కువ ఉన్న బిడ్డలను గుర్తించి ఎన్‌ఆర్‌సీకి రెఫర్‌ చేసే ఆశా వర్కర్లకు సైతం కొంత పారితోషికం ఇస్తున్నారు.  

అవగాహన లేకే బరువు తక్కువ 
ఏమి తినిపించాలి, ఎలా తినిపించాలనే అవగాహన తల్లిదండ్రులకు లేకపోవడంతోనే చిన్నారులు ఎత్తుకు తగ్గ బరువు ఉండటం లేదు. ఇలాంటి చిన్నారులు ప్రతిరోజూ 10 నుంచి 15 మందికి ఓపీ చికిత్స, నెలకు 20 నుంచి 30 మందికి అడ్మిషన్‌ చేసుకుని వైద్యం, పౌష్టికాహారం అందిస్తున్నాం. దీనివల్ల భవిష్యత్‌లో పిల్లలకు భయంకరమైన రోగాలు వచ్చే అవకాశం లేదు. ఇంట్లో చౌకగా లభించే ఆహార పదార్థాలతోనే పిల్లలకు మంచిగా ఎలా పౌష్టికాహారాన్ని అందించవచ్చో వివరిస్తున్నాం.      
– ఎన్‌ఆర్‌సీ వైద్యులు
చంద్రశేఖర్‌రెడ్డి, నాగార్జున 

బాబు ఎదుగుదలలో మార్పు వచ్చింది 
మా బాబు సూర్యప్రకాష్‌(1). బరువు తక్కువగా ఉండటంతో వారం క్రితం ఎన్‌ఆర్‌సీలో చేర్పించాం. ఇక్కడి డాక్టర్లు పిల్లలకు ఏమి, ఎప్పుడు తినిపించాలో బాగా వివరించా రు. ఇంట్లో లభించే ఆహార పదార్థాల్లోనే ఏఏ పోషకాలు ఉన్నాయి, వాటిని పిల్లలకు ఎలా తినిపించాలో చెప్పారు. ఇప్పుడు ఆస్పత్రిలోనూ బాబుకు మంచి ఆహారం, మందులు ఇస్తున్నారు. దీనివల్ల ఐదురోజుల్లోనే మార్పు కనిపించింది.                                              – హరిత, ప్యాపిలి 

పాప ఆరోగ్యంగా ఉంది 
నాకు ఏడాది క్రితం కవల పిల్లలు (బాబు, పాప) జన్మించారు. ఇందులో పాప బరువు తక్కువగా ఉండటంతో రెండు నెలల క్రితం ఎన్‌ఆర్‌సీలో చేర్పించాను. డాక్టర్లు మంచి మందులు ఇవ్వడంతో పాటు సరైన పౌష్టికాహారం అందించారు. రోజుకు 6 నుంచి 8 సార్లు పిల్లలకు ఎలాంటి ఆహారాన్ని ఎలా అందించాలో వివరించారు. డిశ్చార్జ్‌ అయ్యాక ఇంటి వద్ద అలాగే చేస్తున్నాం. ఇప్పుడు పాప ఆరోగ్యంగా ఉంటోంది.                    
– సుజాత, గార్గేయపురం, కర్నూలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement