భిక్షాటన చేస్తున్న కుప్పమ్మ,కుమారుడికి అన్నం తినిపిస్తున్న కుప్పమ్మ
కేవీబీపురం: తల్లి ఒంటరిదైపోతుందన్న ఆలోచనతో కొడుకు పెళ్లి చేసుకోకుండా తల్లి సేవలోనే జీవించాడు. అయితే విధి చిన్నచూపు చూడడంతో కిడ్నీ దెబ్బతిని అతడు మంచం పట్టాడు. బిడ్డ అనారోగ్యానికి గురై.. కదలలేని స్థితికి చేరడంతో 90 ఏళ్ల వయస్సులో ఆ తల్లి యాచకురాలిగా మారింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని అంజూరు పంచాయతీ జయలక్ష్మీపురం గ్రామానికి చెందిన రామలింగయ్య(54) తాపీ మే్రస్తిగా జీవించేవాడు. ఇతని తండ్రి సుబ్రమణ్యం చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి కుప్పమ్మ (90) కూలీ పనులు చేసి తన ఇద్దరు బిడ్డలను సాకింది. ఈ క్రమంలో పెద్ద కుమారుడు క్రిష్ణయ్య వివాహం తరువాత వేరు కాపురంతో దూరమయ్యాడు. అప్పటి నుంచి చిన్నకుమారుడు రామలింగయ్య పెళ్లి చేసుకోకుండా తల్లిని కంటికిరెప్పలా కాపాడేవాడు.
అయితే నాలుగేళ్ల క్రితం కిడ్నీలు దెబ్బతినడంతో మంచానికే పరిమితమై కదల్లేని స్థితికి చేరాడు. దీంతో బిడ్డను కాపాడుకునేందుకు ఆ వృద్ధురాలు పడరాని పాట్లు పడుతోంది. తనకు వచ్చే పింఛన్ సొమ్ము రూ.3 వేలతో బిడ్డకు చిన్నపాటి వైద్యసేవలందిస్తూ.. రక్షించుకునేందుకు తాపత్రయపడుతోంది. తనకున్న రెండెకరాలను అమ్మి.. కుమారుడి స్నేహితుల సహాయంతో చైన్నైలో వైద్యం అందించానని.. అయితే పరిస్థితిలో మార్పురాలేదని ఆ వృద్ధురాలు వాపోయింది. ఆపరేషన్‌కు రూ.8 లక్షలు ఖర్చువుతుందని వైద్యులు సూచించినట్లు తెలిపింది. అయినా కోలుకుంటాడనే గ్యారంటీ లేదని చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో యాచకురాలిగా మారినట్లు వాపోయింది. అధికారులు, దాతలు స్పందించి తమకు భోజన సదుపాయం, మందులైనా అందిస్తే.. బతికినంతకాలం రుణపడి ఉంటానని కన్నీటి పర్యంతమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment