నెలన్నర ఆలస్యంగా పాఠశాల విద్యా కేలండర్ విడుదల
ఈ విద్యా సంవత్సరంలో 232 పనిదినాలు.. 88 సెలవులు
ఆగస్టు 27 నుంచి 31 వరకు ఫార్మెటివ్ అసెస్‌మెంట్
వచ్చే ఏప్రిల్ 7 నుంచి 17 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు
జనవరి 11 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు
సాక్షి, అమరావతి: పాఠశాలల విద్యా బోధనలో కీలకమైన నూతన విద్యా సంవత్సరం (2024–25) కేలండర్‌ను నెలన్నర ఆలస్యంగా విడుదల చేశారు. వాస్తవానికి జూన్ 12న పాఠశాలలు తెరిచేందుకు కనీసం ఒక్క రోజు ముందైనా ఆ కేలండర్‌ను విడుదల చేయాలి. కానీ ఈసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసమని ముందుగా నిర్ణయించిన తేదీ కంటే ఒక రోజు ఆలస్యంగా బడులు తెరిచారు.
అంతేకాకుండా విద్యార్థులకు బోధించాల్సిన రోజువారీ పాఠ్యాంశాలు, నిర్వహించాల్సిన పిరియడ్స్, పరీక్షలతో పాటు సెలవులు వంటి సమగ్ర సమాచారంతో కూడిన అకడమిక్ కేలండర్ ప్రకటన సైతం వాయిదా వేశారు. కేలండర్‌పై ఇంతకాలం ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. సోషల్ మీడియా గ్రూపుల్లో తప్పుడు కేలండర్ వైరల్ కావడం, అది వాస్తవమని ఉపాధ్యాయులు నమ్మడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
ఫార్మెటివ్ అసెస్‌మెంట్–1 ఆగస్టు ఒకటో తేదీ నుంచి అన్న అంశం ఉపాధ్యాయ గ్రూపుల్లో రావడంతో సిలబస్ పూర్తి చేసేందుకు ఒత్తిడి పెరిగింది. ఎట్టకేలకు ప్రస్తుత విద్యా పాఠశాల అకడమిక్ కేలండర్‌ను సోమవారం విద్యాశాఖ మంత్రి లోకేశ్ విడుదల చేశారు. గత విద్యా సంవత్సరంలో ప్రారంభించిన టోఫెల్– ప్రైమరీ/జూనియర్ శిక్షణను ఈసారి తొలగించారు.
కేజీబీవీల్లో ఖాళీలను భర్తీ చేయండి: లోకేశ్
కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. అకడమిక్ కేలండర్ విడుదల సందర్భంగా లోకేశ్ ఉండవల్లిలోని నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలు పూర్తిచేయాలన్నారు.
పాఠశాలల్లో మధ్యా హ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని సూచించారు. స్కూళ్లలో టాయిలెట్స్ మెరుగుపర్చాలని, అవసరమైన ఉపకరణాల కొనుగోలుకు టెండర్లు పిలవాలని ఆదేశించారు. సీబీఎస్‌ఈ స్కూళ్ల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించారు.
ఆటలకు గంట కేటాయింపు
ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు 232 రోజులు పనిచేయనున్నాయి. 88 వివిధ సెలవులు ఉన్నాయి. కేలండర్‌లో పేర్కొన్న విధంగా ఫార్మెటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ), సమ్మెటివ్ అసెస్‌మెంట్(ఎస్‌ఏ) పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. పదో తరగతి వార్షిక పరీక్షలు సమ్మెటివ్ అసెస్‌మెంట్–2 (ఎస్‌ఏ) వచ్చే ఏప్రిల్ 7 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు. ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బోధన, 4 నుంచి 5 గంటల వరకు ఆటలకు కేటాయించాలి. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 వరకు అనంతరం గంట సమయాన్ని క్రీడలకు కేటాయిస్తారు.
అక్టోబర్ 4 నుంచి దసరా సెలవులు
» ఒంటిపూట బడుల సమయంలో పాఠశాలలు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి.
» అక్టోబర్ 4 నుంచి 13 వరకు దసరా సెలవులు, మైనార్టీ విద్యా సంస్థలకు డిసెంబర్ 22 నుంచి 29 వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. జనవరి 11 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు.
» అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్న పాఠశాలలు వారానికి వరుసగా రెండు పిరియడ్స్‌ను సైన్స్ పిరియడ్స్‌కు కేటాయించాలి.
» పర్యావరణ విద్య సబ్జెక్టును 6, 7 తరగతులకు భౌతికశాస్త్రం ఉపాధ్యాయులు, 8, 9, 10 తరగతులకు జీవశాస్త్రం టీచర్లు బోధించాలి.
» ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ప్రతి నెల మొదటి, రెండో శనివారం ‘నో బ్యాగ్ డే’ పాటించాలి. ఈ సమయంలో విద్యార్థులతో పేపర్ కటింగ్, క్లే మౌల్డింగ్, డ్రాయింగ్, సింగింగ్, గార్డెనింగ్ వంటి యాక్టివిటీస్ చేయించాలి.
» ప్రాథమిక పాఠశాలల పిల్లలకు లాంగ్వేజ్ పిరియడ్స్‌లో మంచి చేతి రాతను ప్రాక్టీస్ చేయించాలి. వారానికి రెండు పిరియడ్స్‌ను గూగుల్ రీడ్ యాప్ ద్వారా వినడం, మాట్లాడడం కోసం ఇంగ్లిష్ లాంగ్వేజ్ ల్యాబ్ నిర్వహించాలి.
Comments
Please login to add a commentAdd a comment