School academic calendar
-
నెలన్నర ఆలస్యంగా ఏపీ పాఠశాల విద్యా కేలండర్ విడుదల
సాక్షి, విజయవాడ: ఏపీలో స్కూల్స్ ప్రారంభమై నెలన్నర గడుస్తోంది. 2024-25 ఏడాదికి పాఠశాల విద్యా కేలండర్‌ను చంద్రబాబు ప్రభుత్వం నెలన్నర ఆలస్యంగా నిన్న(సోమవారం) విడుదల చేసింది. ఏపీలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు 2024-25 అకడమిక్ క్యాలెండర్ నిన్న (సోమవారం) విడుదలైంది. పాఠశాలల పనిదినాలు 232 రోజులు కాగా, సెలవులు 83 రోజులు ఉన్నాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగుతాయి. ప్రతీ రోజూ గంటపాటు ఆటల పిరియాడ్ ఉంటుంది. ఒంటి పూట బడులు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయని నిర్ణయించారు. పండగ సెలవులు..దసరా సెలవులు: 04-10-2024 నుండి 13-10-2024క్రిస్మస్ సెలవు: 25-12-2024 సంక్రాంతి సెలవులు: 10-01-2025 నుండి 19-01-2025 వరకు ఉన్నాయి.పరీక్షలు షెడ్యూల్.. ఎఫ్ ఎ 1 ఆగస్ట్ 27 నుంచి 31 వరకు ఎఫ్ ఎ 2 అక్డోబర్ 21 నుంచి 25 వరకుఎస్ఎ 1 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు.ఎఫ్ఎ 3 జనవరి 27 నుంచి 31 వరకుపదో తరగతి ప్రీ ఫైనల్ ఫివ్రవరి 10 నుంచి 20 వరకుఎఫ్ఎ4 మార్చ్ 3 నుంచి 7 వరకుఎఎస్ ఎ 2 ఏప్రిల్ 7 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు అకడమిక్ కాలెండర్లో పేర్కొంది. -
టోఫెల్ శిక్షణ ఎత్తివేత
సాక్షి, అమరావతి: పాఠశాలల విద్యా బోధనలో కీలకమైన నూతన విద్యా సంవత్సరం (2024–25) కేలండర్‌ను నెలన్నర ఆలస్యంగా విడుదల చేశారు. వాస్తవానికి జూన్ 12న పాఠశాలలు తెరిచేందుకు కనీసం ఒక్క రోజు ముందైనా ఆ కేలండర్‌ను విడుదల చేయాలి. కానీ ఈసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసమని ముందుగా నిర్ణయించిన తేదీ కంటే ఒక రోజు ఆలస్యంగా బడులు తెరిచారు. అంతేకాకుండా విద్యార్థులకు బోధించాల్సిన రోజువారీ పాఠ్యాంశాలు, నిర్వహించాల్సిన పిరియడ్స్, పరీక్షలతో పాటు సెలవులు వంటి సమగ్ర సమాచారంతో కూడిన అకడమిక్ కేలండర్ ప్రకటన సైతం వాయిదా వేశారు. కేలండర్పై ఇంతకాలం ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. సోషల్ మీడియా గ్రూపుల్లో తప్పుడు కేలండర్ వైరల్ కావడం, అది వాస్తవమని ఉపాధ్యాయులు నమ్మడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.ఫార్మెటివ్ అసెస్మెంట్–1 ఆగస్టు ఒకటో తేదీ నుంచి అన్న అంశం ఉపాధ్యాయ గ్రూపుల్లో రావడంతో సిలబస్ పూర్తి చేసేందుకు ఒత్తిడి పెరిగింది. ఎట్టకేలకు ప్రస్తుత విద్యా పాఠశాల అకడమిక్ కేలండర్‌ను సోమవారం విద్యాశాఖ మంత్రి లోకేశ్ విడుదల చేశారు. గత విద్యా సంవత్సరంలో ప్రారంభించిన టోఫెల్– ప్రైమరీ/జూనియర్ శిక్షణను ఈసారి తొలగించారు. కేజీబీవీల్లో ఖాళీలను భర్తీ చేయండి: లోకేశ్ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. అకడమిక్ కేలండర్ విడుదల సందర్భంగా లోకేశ్ ఉండవల్లిలోని నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు పూర్తిచేయాలన్నారు. పాఠశాలల్లో మధ్యా హ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని సూచించారు. స్కూళ్లలో టాయిలెట్స్ మెరుగుపర్చాలని, అవసరమైన ఉపకరణాల కొనుగోలుకు టెండర్లు పిలవాలని ఆదేశించారు. సీబీఎస్ఈ స్కూళ్ల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించారు.ఆటలకు గంట కేటాయింపు ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు 232 రోజులు పనిచేయనున్నాయి. 88 వివిధ సెలవులు ఉన్నాయి. కేలండర్లో పేర్కొన్న విధంగా ఫార్మెటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ), సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ) పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. పదో తరగతి వార్షిక పరీక్షలు సమ్మెటివ్ అసెస్మెంట్–2 (ఎస్ఏ) వచ్చే ఏప్రిల్ 7 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు. ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బోధన, 4 నుంచి 5 గంటల వరకు ఆటలకు కేటాయించాలి. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 వరకు అనంతరం గంట సమయాన్ని క్రీడలకు కేటాయిస్తారు.అక్టోబర్ 4 నుంచి దసరా సెలవులు » ఒంటిపూట బడుల సమయంలో పాఠశాలలు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి. » అక్టోబర్ 4 నుంచి 13 వరకు దసరా సెలవులు, మైనార్టీ విద్యా సంస్థలకు డిసెంబర్ 22 నుంచి 29 వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. జనవరి 11 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. » అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్న పాఠశాలలు వారానికి వరుసగా రెండు పిరియడ్స్‌ను సైన్స్ పిరియడ్స్‌కు కేటాయించాలి. » పర్యావరణ విద్య సబ్జెక్టును 6, 7 తరగతులకు భౌతికశాస్త్రం ఉపాధ్యాయులు, 8, 9, 10 తరగతులకు జీవశాస్త్రం టీచర్లు బోధించాలి. » ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ప్రతి నెల మొదటి, రెండో శనివారం ‘నో బ్యాగ్ డే’ పాటించాలి. ఈ సమయంలో విద్యార్థులతో పేపర్ కటింగ్, క్లే మౌల్డింగ్, డ్రాయింగ్, సింగింగ్, గార్డెనింగ్ వంటి యాక్టివిటీస్ చేయించాలి. » ప్రాథమిక పాఠశాలల పిల్లలకు లాంగ్వేజ్ పిరియడ్స్‌లో మంచి చేతి రాతను ప్రాక్టీస్ చేయించాలి. వారానికి రెండు పిరియడ్స్‌ను గూగుల్ రీడ్ యాప్ ద్వారా వినడం, మాట్లాడడం కోసం ఇంగ్లిష్ లాంగ్వేజ్ ల్యాబ్ నిర్వహించాలి. -
TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వేసవి సెలవులు అనంతరం జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు తిగిరి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విద్యా శాఖ విడుదలు చేసింది.అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. రానున్న విద్యా సంవత్సరంలో పాఠశాలలు మొత్తం 229 రోజులు పనిచేయనున్నాయి. స్కూళ్లు జూన్ 12న ప్రారంభమై.. వచ్చే ఏడాది ఏప్రిల్ 24 చివరి వర్కింగ్ డే. ఇక, 2025 ఏప్రిల్ 24 నుంచి 2025 జూన్ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. ఈ ఏడాది దసరాకు అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు అంటే 13 రోజులపాటు పండుగ సెలవులు ఉంటాయి. డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు. ఇక, 2025 జనవరిలో సంక్రాంతి సెలవులు జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం ఆరు రోజులు ఉంటాయని విద్యా శాఖ వెల్లడించింది.మరోవైపు, 2025 జనవరి పదో తేదీ వరకు పదో తరగతి సిలబస్‌ను పూర్తి చేయనున్నారు. తర్వాత రివిజన్ క్లాసులు ఉంటాయి. ఫిబ్రవరి 28, 2025 వరకు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి సిలబస్ పూర్తి చేస్తారు. ప్రతీ రోజూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఐదు నిమిషాల పాటు యోగా, మెడిటేషన్ క్లాసులు ఉండనున్నాయి. పదో తరగతి బోర్డు పరీక్షలను 2025 మార్చి నెలలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్లో పేర్కొంది. -
తెలంగాణ: స్కూల్స్ అకడమిక్ ఇయర్ క్యాలెండర్ రిలీజ్
సాక్షి, హైదరాబాద్: తరగతుల ప్రారంభానికి కంటే.. ఈ ఏడాది విద్యా సంవత్సరం షెడ్యూల్ ఖరారు చేసింది తెలంగాణ విద్యాశాఖ(ప్రాథమిక). 2023-24 పాఠశాల విద్యా సంవత్సరం షెడ్యూల్ విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్లుగా.. జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. అలాగే.. వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 24వ తేదీని చివరి పనిదినంగా నిర్ణయించింది. ► 2023-24 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి. ► బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి ► 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి ► 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి ► అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు ► జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ► ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు ► 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్ ఇయర్ క్యాలెండర్లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ. -
దేశంలో పాఠశాలల పునః ప్రారంభం ఎప్పుడు? ఎలా?
కరోనా దెబ్బకు దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. నిన్న, మొన్నటి వరకూ లాక్డౌన్ మాటునే గడిపిన రాష్ట్రాలు గత కొద్ది రోజులుగా ఊపిరి తీసుకుంటున్నాయి. ఇదిలా ఉంచితే, విద్యార్థుల ఆన్లైన్ తరగతులే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమ పాఠాలను ఆన్లైన్లో వింటూనే ఉండటం అది వారికి ఎంతవరకూ వంట పడుతుందో తెలియని పరిస్థితులు దాపురించాయి. చాలా మంది పిల్లలు తమ ఇళ్లలో ఖైదు అయిపోయారు. వారి జీవితాలు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్లకు పరిమితయ్యాయి. కరోనాతో కాస్త తేరుకున్నామనే పరిస్థితుల్లో పలు రాష్ట్రాలు స్కూల్స్ ఓపెన్ చేయడానికి సమాయత్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే స్కూళ్లు రీఓపెన్ కోసం ముందడుగు వేయగా, కొన్ని రాష్ట్రాలు ఇంకా ఆన్లైన్ క్లాసులనే అనుసరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో స్కూళ్ల పునఃప్రారంభం అంశానికి సంబంధించిన విషయాలు ఒకసారి చూద్దాం. న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రజలకు టీకాలు వేయడం పూర్తయ్యే వరకు పాఠశాలలను, విద్యాసంస్థలను మూసివేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. విద్యాసంస్థల పునః ప్రారంభంపై స్పందిస్తూ.. ‘‘వీ కాంట్ టేక్ రిస్క్’’ అని పేర్కొన్నారు. అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. “ఆగస్టు 16వ తేదీన పాఠశాలలను తిరిగి తెరిచే ప్రణాళికలను రూపొందిస్తున్నాం. తరగతులను ఎలా ప్రారంభించాలో కోవిడ్-19 మూడవ వేవ్‌పై ఆధారపడి ఉంటుంది. విద్యార్థులను రెండు బ్యాచ్‌లుగా చేసి, 50శాతం హాజరుతో పాఠశాలలను తెరవడానికి ప్రభుత్వం పరిశీలిస్తోందని’’ ఆయన తెలిపారు. హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలలను తిరిగి ప్రారంభించడంపై తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్‌లైన్ తరగతులను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమర్పించిన నివేదికలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇంకా పాఠశాలలు తెరుచుకోలేదు. ప్రస్తుతం విద్యార్థుల కోసం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. భువనేశ్వర్: ఒడిశా ప్రభుత్వం 2021, జూలై 26 నుంచి 10-12 తరగతులకు స్కూల్స్ తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్కూల్స్, మాస్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సత్యబ్రాతా సాహు ప్రకటించారు. ఇది ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు వర్తిస్తుందని తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు వారానికి ఐదు రోజులు (సోమవారం నుంచి శుక్రవారం) పనిచేస్తాయని పేర్కొన్నారు. ముంబై: మహారాష్ట్రలో 8 నుంచి 12వ తరగతికి చెందిన 4.16 లక్షల విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. కానీ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్( ఎంఎంఆర్)లోని గ్రామాల్లోని ఏ పాఠశాలల్లో కూడా విద్యార్థులు నేరుగా తరగతులకు హాజరుకాలేదు. ఇక రాష్ట్రంలోని 2.5 లక్షల మందిని పాఠశాలల పునః ప్రారంభంపై స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఆన్లైన్ సర్వే చేయగా 75శాతం పైగా తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించారు. చండీగఢ్: ఇటీవల కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో.. జూలై 26 నుంచి 10-12 తరగతులకు చెందిన విద్యార్థులు సామాజిక దూరం పాటిస్తూ పాఠశాలలకు హాజరుకావాలని హర్యానా ప్రభుత్వం గత వారం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది. పరిస్థితులు సాధారణ స్థితికి చేరితే, ఇతర తరగతుల విద్యార్థులకు కూడా పాఠశాలలు రీఓపెన్ చేయనున్నట్లు తెలిపింది. ఇక పంజాబ్‌లో.. పాఠశాలలు, కోచింగ్ సంస్థలను 2021, జూలై 19 నుంచి పాక్షికంగా తెరిగి ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. తమ పిల్లలను పాఠశాలకు పంపించాలా? వద్దా? నిర్ణయించుకునే అధికారం మాత్రం తల్లిదండ్రులదే అని పేర్కొంది. పుదుచ్చేరి: కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి జూలై 16న విద్యాసంస్థలను పునః ప్రారంభించే నిర్ణయాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు. భోపాల్: మధ్యప్రదేశ్‌లో 11-12 తరగతుల విద్యార్థుల కోసం పాఠశాలలను జూలై 25న, కళాశాలలను ఆగస్టు 1 నుంచి 50శాతం సామర్థంతో పునః ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ప్రకటించారు. చెన్నై: తమిళనాడులో కోవిడ్-19 పరిస్థితులను నిశితంగా గమనిస్నున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ అన్నారు. కరోనా నియంత్రణలో ఉంటే పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పిల్లలను బడులకు పంపించడానికి తల్లిదండ్రులు కూడా సుముఖంగా ఉండాలని, దీనికి కొంత సమయం పడుతుందని తెలిపారు. గాంధీనగర్: గుజరాత్లో కోవిడ్-19 మార్గదర్శకాలను అనుసరించి 12వ తరగతి విద్యార్థుల కోసం కళాశాలలను జూలై 15వ తేదీ నుంచి ఓపెన్ చేశారు. అండర్ గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులకు 50శాతం హాజరుతో క్లాసులు తిరిగి పునః ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక్కడ విద్యార్థుల హాజరను కచ్చితం చేయలేదు. బెంగళూరు: కర్ణాటకలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి టీకాలు వేయడం పూర్తైన తరువాత ప్రాంరంభించనున్నట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్ తెలిపారు. కాగా కర్ణాటక ఉపాధ్యాయ సంఘం వీలైనంత త్వరగా ఆఫ్‌లైన్ పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరింది. పాట్నా: బిహార్ ప్రభుత్వం జూలై 18 నుంచి 50శాతం హాజరుతో పాఠశాలలు, కళాశాలలను పునః ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది. లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో జిమ్స్, మాల్స్, స్టేడియాలు తెరుచుకుంటున్నాయి. అలాగే.. ఎందుకు పాఠశాలలు తిరిగి పారంభించడం లేదని డిప్యూటీ సిఎం దినేష్ శర్మకు అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ (యూసీఎస్‌ఏ) లేఖ రాసినట్లు సమాచారం. డెహ్రాడున్: ఉత్తరాఖండ్‌లో పాఠశాలలు 2021, జూలై 1 నుంచి తిరిగి ప్రారంభించారు. అయితే కోవిడ్-19 దృష్ట్యా విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
జూన్ నెలాఖరులో కొత్త విద్యా సంవత్సరం!
సాక్షి, హైదరాబాద్: మళ్లీ జూన్ వచ్చేస్తోంది. దీంతో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ మల్లగుల్లాలు పడుతోంది. కరోనా కేసులు తగ్గిపోతాయా? థర్డ్ వేవ్ వస్తుందా? జూలై వరకు ఆగాల్సి వస్తుందా? ఎలా ముందుకు సాగాలి? అన్న అంశాలపై తర్జనభర్జనలు పడుతోంది. సాధారణంగా ఏటా జూన్ 12వ తేదీన కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే కరోనా కారణంగా గతేడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యింది. ఈసారి కూడా కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖలో ఆలోచన మొదలయ్యింది. అన్ని పరిస్థితులూ అనుకూలిస్తే జూన్ నెలాఖరులో ప్రారంభించాలన్న అభిప్రాయంతో ఉంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటేనే బోధన ప్రారంభించేందుకు సాధ్యం అవుతుందని, లేదంటే జూలై వరకు ఆగాల్సి వస్తుందేమోనన్న భావనలో అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అవసరమైన అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండేలా కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే.. రాష్ట్రంలో 40,898 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉండగా వాటిల్లో 59,26,253 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి బోధన ప్రారంభించే విష యంలో విద్యాశాఖ పలు ఆలోచనలు చేస్తున్నా.. కరోనా కేసులను బట్టి, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారమే ముందుకు సాగనుంది. ప్ర స్తుతం కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగిం చింది. దీంతో లాక్డౌన్ ముగిసిన తర్వాతే విద్యా సంవత్సరంపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉంది. మార్చి 24వ తేదీనుంచి రాష్ట్రంలో ప్రత్యక్ష విద్యాబోధనను నిలిపివేసిన సమయంలో.. జూన్ 1వ తేదీ తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో దీనిపై ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించే అవకాశం ఉంది. కరోనా పరిస్థితులపై సమీక్షించి, పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు విద్యా బోధనకు సంబంధించిన కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముందుగానే ఆన్లైన్/డిజిటల్ తరగతులు! కరోనాతో సాధారణ పరిస్థితులు లేకపోవడంతో గతేడాది జూన్‌లో విద్యా బోధన ప్రారంభం కాలేదు. చివరకు సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్/డిజిటల్ బోధనను ప్రారంభించింది. అయితే ఈసారి అప్పటివరకు వేచి చూడకుండా ముందు గానే విద్యాబోధనను ప్రారంభించాలన్న ఆలోచనను విద్యాశాఖ చేస్తోంది. కరోనా థర్డ్ వేవ్ ఉంటుందనే వాదనల నేపథ్యంలో, ప్రత్యక్ష బోధన ప్రారంభించే పరిస్థితులు ఇప్పట్లో నెలకొంటాయన్న ఆశ లేదు. కాబట్టి జూన్ నెలాఖరుకు లేదంటే జూలైలో ఆన్లైన్ /డిజిటల్ బోధనను ప్రారంభించే అవకాశం ఉంది. దీనిపై సీఎం కేసీఆర్‌తో చర్చించాక, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకే ముందుకు సాగనుంది. సిద్ధంగా పాఠ్యాంశాలు డిజిటల్/ఆన్లైన్ బోధనను వచ్చే నెలలో ప్రారంభించినా, ఆ తర్వాత ప్రారంభించినా కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు అదే పద్ధతిలో బోధన కొనసాగనుంది. ఈ మేరకు అవసరమైన అన్ని డిజిటల్/ఆన్లైన్ పాఠాలు సిద్ధం చేసేలా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు, ఇంగ్లిషు, ఉర్దూ మీడియంలకు చెందిన 1,500కు పైగా వీడియో పాఠాలు ఉన్నాయి. గతేడాది వాటిని టీశాట్, దూరదర్శన్ ద్వారా ప్రసారం చేసి బోధనను కొనసాగించింది. చాలావరకు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వాటినే విన్నారు. మరోవైపు పాఠాల కాన్సెప్ట్‌లతో కూడిన 10 వేల వరకు టిక్‌టాక్ వీడియోలను (విద్యార్థులకు సులభంగా అర్థం అయ్యే షార్ట్ వీడియోలు) విద్యాశాఖ యూట్యూబ్ ఛానెల్లో అందుబాటులో ఉంచింది. ఈసారి కూడా అదే పద్ధతిలో ముందుకు సాగాలని విద్యాశాఖ భావిస్తోంది. గతేడాది ఆలస్యంగా ఆన్లైన్/డిజిటల్ విద్యాబోధనను ప్రారంభించిన నేపథ్యంలో సిలబస్ 30 శాతం తగ్గించింది. ఈసారి ఒకవేళ ముందుగా ప్రారంభిస్తే ఆ మేరకు వీడియో పాఠాలను సిద్ధం చేయాలని భావిస్తోంది. ఏదిఏమైనా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు తాము ముందుకు సాగుతామని పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేన పేర్కొన్నారు. -
పూర్తయిన పాఠాలపైనే విద్యార్థులకు పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా అస్తవ్యస్తంగా మారిన విద్యా బోధనను గాడిలో పెట్టే పనిలో ప్రభుత్వం పడింది. ఇందులో భాగంగా 9, 10వ తరగతులతోపాటు ఇంటర్, డిగ్రీ, పీజీ తరగతులను ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రారంభించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అందుకు అవసరమైన చర్యలపై కార్యాచరణ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రధానమైన సిలబస్, పరీక్షల విధానంపై దృష్టి సారించాయి. ప్రస్తుతం 1 నుంచి 8వ తరగతి వరకు ప్రత్యక్ష విద్యా బోధనపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఇప్పటివరకు ఆన్లైన్/ టీశాట్/ దూరదర్శన్ ద్వారా ప్రసారం చేసిన వీడియో పాఠాలపైనే పరీక్షలు నిర్వహించాలా? లేదంటే పరీక్షలే లేకుండా పైతరగతులకు పంపించాలా అనే దానిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఎక్కువ శాతం అధికారులు మాత్రం 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలే అవసరం లేదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగానే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 9, 10వ తరగతుల వారికి మాత్రం మాత్రం పరీక్షలు నిర్వహించాల్సిందేనన్న భావనలో పాఠశాల విద్యా శాఖ అధికారులు ఉన్నారు. 70 శాతం సిలబస్ మాత్రమే ఉండేలా ఇప్పటికే పాఠశాల విద్యా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మిగతా 30 శాతం సిలబస్‌లో ప్రాజెక్టులు, అసైన్మెంట్ ఆధారిత ఇంటర్నల్స్ ఉంటాయని పేర్కొంది. సీనియర్ అధికారులు మాత్రం పాఠశాలలు ప్రారంభమయ్యాక పూర్తి చేసే సిలబస్, ప్రస్తుతం ఆన్లైన్/ టీవీ ద్వారా ప్రసారం చేసిన పాఠాలపైనే పరీక్షలు నిర్వహించాలని సూచిస్తున్నారు. వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తయ్యే పాఠ్యాంశాల్లో ప్రాజెక్టులు, అసైన్మెంట్లతో ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. వాటి ఆధారంగా విద్యార్థులకు మార్కులను ఇవ్వొచ్చని పేర్కొన్నారు. దీనిపై కూడా ఇంతవరకు అధికారిక నిర్ణయం లేదు. ఇకనైనా ప్రభుత్వం సిలబస్ కుదింపుపై స్పష్టత ఇస్తే ఆ విధానం కొనసాగుతుందని, లేదంటే ఏప్రిల్ నాటికి అయ్యే పాఠ్యాంశాలపై మాత్రమే ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించి విద్యాసంవత్సరాన్ని ముగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇంటర్లో.. ఇంటర్‌లోనూ ఇదే పరిస్థితి ఇంటర్మీడియట్ సిలబస్ విషయంలోనూ గందరగోళం కొనసాగుతోంది. అధికారులు ఇంతవరకు సిలబస్ కుదింపుపై తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు. గతంలో 30 శాతం సిలబస్ ను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అందులో తెలంగాణ పండుగలు, జాతీయనేతలు, సంఘసంస్కర్తల పాఠాలు తొలగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తడంతో.. అది నిర్ణయం కాదని, అలాంటి పాఠ్యాంశాలను తొలగించట్లేదని, పైగా అది ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన మాత్రమేనని బోర్డు అధికారులు ప్రకటించారు. అయితే ప్రభుత్వం 30 శాతం సిలబస్ కుదింపునకు ఓకే చెప్పినట్లు తెలిసింది. తగ్గించిన సిలబస్‌ను ప్రకటించలేదు. ఇంటర్మీడియట్ సిలబస్ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలతో ముడిపడి ఉన్నందున లెక్చరర్లు, విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. జేఈఈ మెయిన్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో సిలబస్ కుదింపు లేదు. కేవలం విద్యార్థులకు ప్రశ్నల సంఖ్యను పెంచి ఆప్షన్లు ఎక్కువగా ఇచ్చారు. కాబట్టి విద్యార్థులు ఉన్న సిలబస్ మొత్తం ప్రిపేర్ కావాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు వొకేషనల్ కోర్సుల సిలబస్ తగ్గింపుపైనా బోర్డు కసరత్తు చేయలేదు. -
స్కూళ్లు ఎప్పటినుంచి ప్రారంభిద్దాం?
సాక్షి, హైదరాబాద్ : పాఠశాలలను ఎప్పటినుంచి ప్రారంభించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారో రాష్ట్రాల వారీగా అభిప్రాయాలను తెలియజేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) అన్ని రాష్ట్రాల విద్యాశాఖ లను కోరింది. ఈ మేరకు ఎంహెచ్ఆర్డీ అండర్ సెక్రటరీ రాజేశ్ సాంప్లే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యాశాఖ కార్యదర్శులకు లేఖలు రాశారు. స్కూళ్లను ఆగస్టు/సెప్టెంబర్/అక్టోబర్ నెలల్లో ఏ నెలలో ప్రారంభిస్తే బాగుంటుందో తెలియజేయాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారో కూడా తెలపాలని, ఇతరత్రా అంశాలు ఏమైనా ఉంటే కూడా ఈనెల 20లోగా చెప్పాలని సూచించారు. ఆ వివరాలను తమ మెయిల్ ఐడీకి (coordinationeel @gmail.com లేదా rsamplay. edu@nic.in) పంపించాలని వెల్లడించారు. అయితే ఈనెల 15న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో స్కూల్ సేఫ్టీ ప్లాన్‌పై ఎంహెచ్ఆర్డీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. అందులో పాఠశాలల ప్రారంభంపై కూడా అభిప్రాయాలను తీసుకుంది. అయితే ఆ తరువాత మూడు రోజులకే మళ్లీ అభిప్రాయాలను తెలియజేయాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యాశాఖ కార్యదర్శులకు ఈ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈనెల 15న జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాలల ప్రారంభ తేదీలను ఇంకా నిర్ణయించలేదని 17 రాష్ట్రాలు వెల్లడించాయి. అందులో అండమాన్ నికోబార్, ఛత్తీస్‌గఢ్, డయ్యూ డామన్, గోవా, గుజరాత్, లక్షద్వీప్, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరాం, ఒడిషా, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నా యి. ఐదు రాష్ట్రాలు మాత్రం కేంద్రం జారీ చేసే ఆదేశాల మేరకు ప్రారంభిస్తామని వెల్లడించాయి. అందులో హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలు ఉన్నా యి. ఇక మరో 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తేదీలను, నెలలను నిర్ణయించినట్లు వెల్లడించాయి. అందులో సెప్టెంబర్ 5న స్కూళ్ల ను ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్, ఆగస్టు తరువాత ప్రారంభిస్తామని అరుణాచల్ ప్రదేశ్ వెల్లడించాయి. అస్సాం (జూలై 31న), బిహార్ (ఆగ స్టు 15న), చండీగఢ్ (ఆగస్టు 15 తరువాత), ఢిల్లీ (ఆగస్టులో), హరియాణా (ఆగస్టు 15), కర్ణాటక (సెప్టెంబర్ 1 తరువాత), కేరళ, లఢక్ (ఆగస్టు 31 తరువాత), మణిపూర్ (సెప్టెంబర్ 1న), నాగాలాండ్ (సెప్టెంబర్ మొదటివారం), పాండి చ్చేరి (జూలై 31 తరువాత), రాజస్తాన్ సెప్టెంబ ర్లో స్కూళ్లను ప్రారంభిస్తామని వెల్లడించాయి. -
ఏప్రిల్ 13 నుంచే వేసవి సెలవులు
జూన్ 1న పాఠశాలలు పునః ప్రారంభం - పాఠశాల విద్యా కేలండర్ జారీ - 2018 ఫిబ్రవరి 28లోగా టెన్త్ ప్రీఫైనల్ పరీక్షలు పూర్తి - వచ్చే నెల 20 నుంచి అక్టోబరు 4 వరకు దసరా సెలవులు - ఉన్నత పాఠశాలల్లో ఆప్షనల్ హాలిడేల వినియోగంపై నిబంధనలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యా కేలండర్ జారీ అయింది. పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించేలా కొత్తగా అకడమిక్ కేలండర్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేలండర్ ప్రకారం.. 2017–18 విద్యా సంవత్సరం వచ్చే ఏడాది ఏప్రిల్ 12వ తేదీతో ముగుస్తుంది. ఏప్రిల్ 13 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 1న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ఇక కేలండర్ ప్రకారం పదో తరగతి విద్యార్థులకు జనవరి 31వ తేదీలోగా పాఠ్యాంశాల బోధన పూర్తి చేసి.. రివిజన్ ప్రారంభించాలి. ఫిబ్రవరి 28లోగా ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించాలి. ఒకటి నుంచి 9వ తరగతి వరకు సిలబస్‌ను ఫిబ్రవరి 28వ తేదీలోగా పూర్తి చేయాలి. విద్యా కేలండర్లోని ప్రధాన అంశాలు ► ఉన్నత పాఠశాలలు ఆప్షనల్ హాలిడేస్ వినియోగించుకునే విషయంలో నిబంధనలు పాటించాలి. గతంలో మాదిరిగా టీచర్లంతా ఆప్షనల్ హాలిడేస్ తీసుకుని.. పాఠశాలకు సెలవు ఇవ్వడానికి వీల్లేదు. ప్రధానోపాధ్యాయుడు గరిష్టంగా పాఠశాలలోని 30 శాతం మంది టీచర్లకే ఆప్షనల్ హాలిడేస్‌ను మం జూరు చేయాలి. మిగతా వారితో పాఠశాలను కొనసాగించాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మాత్రం గతంలో తరహాలో పాఠశాలకు సెలవు ఇవ్వొచ్చు. ► అక్టోబర్‌లో జాతీయ క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో... సెప్టెంబర్ 2లోగా మండల, డివిజన్ స్థాయి, సెప్టెంబర్ 20లోగా జిల్లా స్థాయి గేమ్స్ పూర్తి చేయాలి. అక్టోబర్ 4వ తేదీలోగా రాష్ట్ర స్థాయిలో గేమ్స్ పూర్తి చేసి.. జాతీయ స్థాయికి ఎంపికైన టీములను పంపించాలి. ► పాఠశాల వార్షిక దినోత్సవాన్ని జనవరి/ఫిబ్రవరిలో, బాలసభను ప్రతి నెల 4వ శనివారం, మాస్ డ్రిల్/యోగాను ప్రతి నెల మొదటి, మూడో శనివారం నిర్వహించాలి. సెలవులివీ.. 20–9–2017 నుంచి 4–10–2017 వరకు దసరా సెలవులు 24–12–2017 నుంచి 28–12–2017 వరకు మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు 12–1–2018 నుంచి 16–1–2018 వరకు మిషనరీ స్కూళ్లు మినహా ఇతర పాఠశాలలకు సంక్రాంతి సెలవులు డిజిటల్ తరగతుల షెడ్యూల్ ఇదీ.. 10వ తరగతి : ఉదయం 10:30 నుంచి 11:15 గంటల వరకు 9వ తరగతి : ఉదయం 11:30 నుంచి 12:15 వరకు 8వ తరగతి : మధ్యాహ్నం 2 నుంచి 2:45 వరకు 7వ తరగతి : 2:45 నుంచి 3:30 వరకు 6వ తరగతి : 3:40 నుంచి 4:20 వరకు పాఠశాలల వేళలు ఉన్నత పాఠశాలలు: ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు. హైదరాబాద్ జంట నగరాల్లో ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4 వరకు. ప్రాథమికోన్నత పాఠశాలలు: ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 వరకు. హైదరాబాద్ జంట నగరాల్లో ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. ప్రాథమిక పాఠశాలలు: ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు. హైదరాబాద్ జంట నగరాల్లో ఉదయం 8:45 నుంచి సాయంత్రం 3:45 వరకు. పరీక్షల షెడ్యూలు ఇలా.. 31–7–2017లోగా: ఫార్మేటివ్ అసెస్మెంట్–1 19–9–2017లోగా: ఫార్మేటివ్ అసెస్మెంట్–2 23–10–2017 నుంచి 28–10–2017 వరకు: సమ్మేటివ్ అసెస్మెంట్–1 30–11–2017లోగా: ఫార్మేటివ్ అసెస్మెంట్–3 31–1–2018లోగా: టెన్త్ విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్–4 28–2–2018లోగా: ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్–4 2–4–2018 నుంచి 9–4–2018 వరకు: సమ్మేటివ్ అసెస్మెంట్–2 10–4–2018న: జవాబు పత్రాల అందజేత 11–4–2018న: తల్లిదండ్రులతో సమావేశం, ప్రోగ్రెస్ కార్డుల అందజేత (పదోతరగతి వారికి 28–2–2018లోగా ప్రీఫైనల్ పరీక్షలు.. మార్చి మొదటి వారంలో వార్షిక పరీక్షలు)