దేశంలో పాఠశాలల పునః ప్రారంభం ఎప్పుడు? ఎలా? | Several States Started Covid Unlock When Will School Reopen In India | Sakshi
Sakshi News home page

దేశంలో పాఠశాలల పునః ప్రారంభం ఎప్పుడు? ఎలా?

Published Sun, Jul 18 2021 9:54 PM | Last Updated on Mon, Jul 19 2021 5:36 PM

Several States Started Covid Unlock When Will School Reopen In India - Sakshi

కరోనా దెబ్బకు దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి.  నిన్న, మొన్నటి వరకూ లాక్‌డౌన్‌ మాటునే గడిపిన రాష్ట్రాలు గత కొద్ది రోజులుగా ఊపిరి తీసుకుంటున్నాయి. ఇదిలా ఉంచితే, విద్యార్థుల ఆన్‌లైన్‌ తరగతులే ఇప్పుడు  చర్చనీయాంశంగా మారింది. తమ పాఠాలను ఆన్‌లైన్‌లో వింటూనే ఉండటం అది వారికి ఎంతవరకూ వంట పడుతుందో తెలియని పరిస్థితులు దాపురించాయి. చాలా మంది పిల్లలు తమ ఇళ్లలో ఖైదు అయిపోయారు. వారి జీవితాలు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్‌లకు పరిమితయ్యాయి. కరోనాతో కాస్త తేరుకున్నామనే పరిస్థితుల్లో పలు రాష్ట్రాలు స్కూల్స్‌ ఓపెన్‌ చేయడానికి సమాయత్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే స్కూళ్లు రీఓపెన్‌ కోసం ముందడుగు వేయగా, కొన్ని రాష్ట్రాలు ఇంకా ఆన్‌లైన్‌ క్లాసులనే అనుసరిస్తున్నాయి.  ఈ పరిస్థితుల్లో స్కూళ్ల పునఃప్రారంభం అంశానికి సంబంధించిన  విషయాలు ఒకసారి చూద్దాం.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రజలకు టీకాలు వేయడం పూర్తయ్యే వరకు పాఠశాలలను, విద్యాసంస్థలను మూసివేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. విద్యాసంస్థల పునః ప్రారంభంపై స్పందిస్తూ.. ‘‘వీ కాంట్‌ టేక్‌ రిస్క్‌’’ అని పేర్కొన్నారు.

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్‌ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. “ఆగస్టు 16వ తేదీన పాఠశాలలను తిరిగి తెరిచే ప్రణాళికలను రూపొందిస్తున్నాం. తరగతులను ఎలా ప్రారంభించాలో కోవిడ్-19 మూడవ వేవ్‌పై ఆధారపడి ఉంటుంది. విద్యార్థులను రెండు బ్యాచ్‌లుగా చేసి, 50శాతం హాజరుతో పాఠశాలలను తెరవడానికి ప్రభుత్వం పరిశీలిస్తోందని’’ ఆయన తెలిపారు.

హైదరాబాద్‌: రాష్ట్రంలో పాఠశాలలను తిరిగి ప్రారంభించడంపై తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్‌లైన్ తరగతులను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమర్పించిన నివేదికలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇంకా పాఠశాలలు తెరుచుకోలేదు. ప్రస్తుతం విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు.

భువనేశ్వర్‌: ఒడిశా ప్రభుత్వం 2021, జూలై 26 నుంచి 10-12 తరగతులకు స్కూల్స్‌ తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్కూల్స్‌, మాస్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సత్యబ్రాతా సాహు ప్రకటించారు. ఇది ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు వర్తిస్తుందని తెలిపారు.  ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు వారానికి ఐదు రోజులు (సోమవారం నుంచి శుక్రవారం) పనిచేస్తాయని పేర్కొన్నారు.

ముంబై: మహారాష్ట్రలో 8 నుంచి 12వ తరగతికి చెందిన 4.16 లక్షల విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. కానీ ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌( ఎంఎంఆర్‌)లోని గ్రామాల్లోని ఏ పాఠశాలల్లో  కూడా విద్యార్థులు నేరుగా తరగతులకు హాజరుకాలేదు. ఇక రాష్ట్రంలోని 2.5 లక్షల మందిని పాఠశాలల పునః ప్రారంభంపై స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఆన్‌లైన్ సర్వే చేయగా 75శాతం పైగా తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించారు.

చండీగఢ్: ఇటీవల కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో.. జూలై 26 నుంచి 10-12 తరగతులకు చెందిన విద్యార్థులు సామాజిక దూరం పాటిస్తూ పాఠశాలలకు హాజరుకావాలని హర్యానా ప్రభుత్వం గత వారం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది. పరిస్థితులు సాధారణ స్థితికి చేరితే, ఇతర తరగతుల విద్యార్థులకు కూడా పాఠశాలలు రీఓపెన్‌ చేయనున్నట్లు తెలిపింది. ఇక పంజాబ్‌లో.. పాఠశాలలు, కోచింగ్‌​ సంస్థలను 2021, జూలై 19 నుంచి  పాక్షికంగా తెరిగి ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. తమ పిల్లలను పాఠశాలకు పంపించాలా? వద్దా? నిర్ణయించుకునే అధికారం మాత్రం తల్లిదండ్రులదే అని పేర్కొంది.

పుదుచ్చేరి: కోవిడ్‌-19 పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి జూలై 16న  విద్యాసంస్థలను పునః ప్రారంభించే నిర్ణయాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు.

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో 11-12 తరగతుల విద్యార్థుల కోసం పాఠశాలలను జూలై 25న, కళాశాలలను ఆగస్టు 1 నుంచి 50శాతం సామర్థంతో పునః ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ ప్రకటించారు.

చెన్నై: తమిళనాడులో కోవిడ్‌-19 పరిస్థితులను నిశితంగా గమనిస్నున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్‌ అన్నారు. కరోనా నియంత్రణలో ఉంటే పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పిల్లలను బడులకు పంపించడానికి తల్లిదండ్రులు కూడా సుముఖంగా ఉండాలని, దీనికి కొంత సమయం పడుతుందని తెలిపారు.  

గాంధీనగర్‌: గుజరాత్‌లో కోవిడ్‌-19 మార్గదర్శకాలను అనుసరించి 12వ తరగతి విద్యార్థుల కోసం కళాశాలలను జూలై 15వ తేదీ నుంచి ఓపెన్‌ చేశారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌, పీజీ విద్యార్థులకు 50శాతం హాజరుతో క్లాసులు తిరిగి పునః ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక్కడ విద్యార్థుల హాజరను కచ్చితం చేయలేదు.

బెంగళూరు: కర్ణాటకలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి టీకాలు వేయడం పూర్తైన తరువాత ప్రాంరంభించనున్నట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్ తెలిపారు. కాగా కర్ణాటక ఉపాధ్యాయ సంఘం వీలైనంత త్వరగా ఆఫ్‌లైన్ పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరింది.

పాట్నా: బిహార్‌ ప్రభుత్వం జూలై 18 నుంచి 50శాతం హాజరుతో పాఠశాలలు, కళాశాలలను పునః ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది.

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో కోవిడ్‌-19 కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో జిమ్స్, మాల్స్‌, స్టేడియాలు తెరుచుకుంటున్నాయి. అలాగే.. ఎందుకు పాఠశాలలు తిరిగి  పారంభించడం లేదని డిప్యూటీ సిఎం దినేష్ శర్మకు అన్‌ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ (యూసీఎస్‌ఏ) లేఖ రాసినట్లు సమాచారం.

డెహ్రాడున్: ఉత్తరాఖండ్‌లో పాఠశాలలు 2021, జూలై 1 నుంచి తిరిగి ప్రారంభించారు. అయితే కోవిడ్‌-19 దృష్ట్యా విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement