సాక్షి, కర్నూలు జిల్లా: దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఒకరు మృతి చెందగా, 60 మందికిపైగా గాయపడ్డారు. కర్రల సమరాన్ని చూసేందుకు కొందరు స్థానికులు చెట్టు ఎక్కారు. ప్రమాదవశాత్తూ చెట్టు కొమ్మ విరిగిపడి గణేష్ అనే యువకుడు మృతిచెందాడు. గాయాలపాలైన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
దేవరగట్టులో ప్రతీ ఏడాది దసరా పండుగ రోజున బన్నీ ఉత్సవం కర్రల యుద్ధంగా జరుగుతుంది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ బన్ని ఉత్సవాన్ని మంగళవారం అర్ధరాత్రి కొనసాగించారు. ఈ నేపథ్యంలో దేవరగట్టులో మరోసారి సంప్రదాయమే గెలిచింది. ఆచారం పేరిట యథావిధి ఈ భక్తి పోరాటం కొనసాగింది.
ఈ బన్నీ ఉత్సవ యుద్దానికి పూర్వ చరిత్ర ఉంది. మాలమల్లేశ్వర విగ్రహం కోసం దేవరగట్టుతో పాటు చుట్టుపక్కల గ్రామాలవారు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజున అర్ధరాత్రి వేళా స్వామి విగ్రహాన్ని తీసుకెళ్తే అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకంతో.. ఉత్సవంలో పాల్గొంటారు.
ప్రతీ ఏడాది జరుగుతున్న ఈ సమరంలో అనేక మందికి గాయాలయ్యి, తలలు పగిలి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఇదివరకూ అనేకసార్లు జరిగింది. మా ఆచార సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తాం.. మాళమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో వెనుకడుగు వేసేది లేదన్న భక్తులు.. ఈ కర్రల సమరంలో సుమారు 2 లక్షల మందికి పైగా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment