డిపోను పరిశీలిస్తున్న ఎండీ ద్వారకా తిరుమలరావు
ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
గన్నవరం: ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతో పాటు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. కృష్ణాజిల్లా గన్నవరం ఆర్టీసీ బస్టాండ్, డిపోను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులు, విద్యార్థులతో మాట్లాడి ఆర్టీసీ సర్వీస్‌ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిపోను పరిశీలించిన ఎండీ, బస్సుల కండీషన్‌పై గ్యారేజ్ సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెగ్యులర్ సర్వీస్‌ల ఆదాయంతోపాటు, కమర్షియల్ ఆదాయం పెంచే దిశగా కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు గతంలో 15 ఏళ్లకు ఆర్టీసీ స్థలాలు లీజుకు ఇచ్చినప్పటికీ సరైన స్పందన రాలేదని, ఈ విషయంలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సంస్థ కొత్తగా కొనుగోలు చేసిన వెయ్యి డీజిల్ బస్సులు వస్తుండటం వల్ల దూర ప్రాంత సర్వీస్‌లు పెరిగే అవకాశం ఉందన్నారు. పాత ఎక్స్‌ప్రెస్ బస్సులను పల్లె వెలుగు బస్సులుగా మార్పులు చేసి గ్రామీణ సర్వీస్‌లకు ఉపయోగిస్తామని చెప్పారు. అద్దె బస్సులను కూడా బ్రాండ్ న్యూ కింద కొత్తగా తీసుకున్నామని వివరించారు. ఇటీవల మహాశివరాత్రి, సంక్రాంతి, శబరిమలకు నడిపిన సర్వీస్‌ల వల్ల ఆర్టీసీ ఆదాయం పెరిగిందన్నారు.
భక్తుల సౌకర్యార్ధం దేవాలయాల సందర్శన ప్రత్యేక సర్వీస్‌లను కూడా పెంచామని చెప్పారు. ఆర్టీసీలో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతినెల 1వ తేదీనే జీతాలు పడుతున్నాయని, పీఎఫ్ ట్రస్ట్‌ను కూడా బలోపేతం చేసినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సంస్థ అప్పులు కూడా చాలావరకు తీర్చివేసినట్లు తెలిపారు. గన్నవరం బస్టాండ్ ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలాలను లీజుకు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు. డిపో మేనేజర్ పి. శివాజీ నేతృత్వంలో సిబ్బంది ఎండీకి ఘన స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment