tirumala rao
-
దూరప్రాంతాలకు కొత్తగా వెయ్యి బస్సులు
గన్నవరం: ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతో పాటు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. కృష్ణాజిల్లా గన్నవరం ఆర్టీసీ బస్టాండ్, డిపోను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులు, విద్యార్థులతో మాట్లాడి ఆర్టీసీ సర్వీస్‌ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిపోను పరిశీలించిన ఎండీ, బస్సుల కండీషన్‌పై గ్యారేజ్ సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెగ్యులర్ సర్వీస్‌ల ఆదాయంతోపాటు, కమర్షియల్ ఆదాయం పెంచే దిశగా కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు గతంలో 15 ఏళ్లకు ఆర్టీసీ స్థలాలు లీజుకు ఇచ్చినప్పటికీ సరైన స్పందన రాలేదని, ఈ విషయంలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సంస్థ కొత్తగా కొనుగోలు చేసిన వెయ్యి డీజిల్ బస్సులు వస్తుండటం వల్ల దూర ప్రాంత సర్వీస్‌లు పెరిగే అవకాశం ఉందన్నారు. పాత ఎక్స్‌ప్రెస్ బస్సులను పల్లె వెలుగు బస్సులుగా మార్పులు చేసి గ్రామీణ సర్వీస్‌లకు ఉపయోగిస్తామని చెప్పారు. అద్దె బస్సులను కూడా బ్రాండ్ న్యూ కింద కొత్తగా తీసుకున్నామని వివరించారు. ఇటీవల మహాశివరాత్రి, సంక్రాంతి, శబరిమలకు నడిపిన సర్వీస్‌ల వల్ల ఆర్టీసీ ఆదాయం పెరిగిందన్నారు. భక్తుల సౌకర్యార్ధం దేవాలయాల సందర్శన ప్రత్యేక సర్వీస్‌లను కూడా పెంచామని చెప్పారు. ఆర్టీసీలో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతినెల 1వ తేదీనే జీతాలు పడుతున్నాయని, పీఎఫ్ ట్రస్ట్‌ను కూడా బలోపేతం చేసినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సంస్థ అప్పులు కూడా చాలావరకు తీర్చివేసినట్లు తెలిపారు. గన్నవరం బస్టాండ్ ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలాలను లీజుకు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు. డిపో మేనేజర్ పి. శివాజీ నేతృత్వంలో సిబ్బంది ఎండీకి ఘన స్వాగతం పలికారు. -
కొత్తగా వెయ్యి ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు
నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): ఈ ఏడాది కొత్తగా వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మంగళవారం ఆయన నర్సీపట్నం ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ విజయదశమి ఆర్టీసీకి ఆదాయం తెచ్చే పండుగ అన్నారు. దసరాకు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం 5,500 స్పెషల్ బస్సులను తిప్పుతున్నామన్నారు. గతంలో దసరా పర్వదినాల్లో 50 శాతం అదనపు చార్జీలు విధించటం జరిగేదని, రెండేళ్లుగా చార్జీల పెంపునకు స్వస్తి పలికామని చెప్పారు. రాను పోను ప్రయాణికులకు 10 శాతం రాయితీ కల్పిస్తున్నామన్నారు. రాయితీలు కల్పించి ఓఆర్ పెంచి ఆదాయ పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొత్తగా 1500 డీజిల్ బస్సులు ఆర్డర్ చేశామన్నారు. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ ఏడాది వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేశామని, మూడు నెలల్లో ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇకపై ప్రతి ఏటా వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు కొనేందుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అలాగే పీఎఫ్ బకాయిలు సకాలంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించటం వల్ల సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం రూ.3 వేలు నుంచి రూ.4 వేలు పెన్షన్ వచ్చే కేడర్‌లో ఉన్న వారికి ఇకపై రూ.25 వేలు పెన్షన్, రూ.5 నుంచి 6 వేలు ఉన్న వారికి రూ.30 వేలు నుంచి రూ.50 వేలు వరకు పెన్షన్ వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన డిపో ఆవరణలో మొక్కలు నాటారు. స్థానిక ఏఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తిరుమలరావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎండీ వెంట జిల్లా ప్రజారవాణా సంస్థ అధికారి పద్మావతి ఉన్నారు. -
కార్గో పార్శిళ్లపై నిఘా పెంచండి
సాక్షి, అమరావతి: ఆర్టీసీ బస్సుల్లో గంజాయి, గుట్కా, లిక్కర్, ఇతర చట్టవిరుద్దమైన వస్తువుల రవాణాను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని.. కార్గో ద్వారా బుక్ చేసే పార్శిళ్లపై నిఘా పెంచాలని ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. సోమవారం ఆయన అన్ని జిల్లాల, జోన్ల ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొంతమంది డ్రైవర్లు, కండక్టర్లు అనుమతి లేని లగేజ్ తీసుకుంటున్నారని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడినా, ఆర్టీసీ ఆదాయానికి గండికొట్టే చర్యలు చేసినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆర్టీసీ పరిధిలోని అన్ని కౌంటర్లలో గంజాయి, మత్తు, పేలుడు పదార్థాలు, చట్టబద్ధంగా నిషేదించబడిన అన్నిరకాల వస్తువులను అనుమతించరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై కార్గోలో బుక్ చేసే ప్రతి పార్శిల్‌ను క్షుణంగా పరిశీలించాలని సూచించారు. వినియోగదారుని ఆధార్, అడ్రస్, ఫోన్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలని, ఈ అంశాల పట్ల నిబద్ధతతో ఉండాలని సూచించారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కేఎస్ బ్రహ్మనందరెడ్డి, ఎ.కోటేశ్వరరావు, ఓఎస్డీ రవివర్మ, సీటీఎం చంద్రశేఖర్, నాగేంద్రప్రసాద్, డిప్యూటీ సీటీఎం త్రినాథ్ పాల్గొన్నారు. (చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ) -
ఉన్నత స్థానాలు చేరుకునేందుకే నైపుణ్య శిక్షణ
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలు ఉన్నత స్థానాలు చేరుకునేందుకు నైపుణ్య శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ (సీహెచ్ఎస్ఎస్) సౌజన్యంతో ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం నిర్వహించిన ఉచిత ఇంటెర్న్షిప్ కార్యక్రమం ముగింపు వేడుకను విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో సోమవారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలు ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని తమ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ఉద్యోగుల పిల్లల కెరీర్ గైడెన్స్ కోసం ఈ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఆన్లైన్లో నిర్వహించిన ఈ శిక్షణకు 700 మంది హాజరయ్యారన్నారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు నానుడి
కీర్తిశేషులు అని రాయకుండా పోయిన పెద్దలు అని రాసేవాడు బి.స.బంగారయ్య. తెలుగు మీద అంత పట్టింపు ఆయనకు. తన పేరును కూడా అదే రీతిలో తెలుగీకరణ చేసుకున్నాడు. శ, ష అక్షరాలను రాసేవాడు కాదు. వాటిని ‘స’తో మార్చేవాడు. ఞ, ఙ వచ్చిన చోట సున్నాతో పూరించేవాడు. ఖ, ఘ, ధ, భ లాంటి దీర్ఘ ప్రాణాలను పరిహరించేవాడు. 1965లో ఆయన వెలువరంచిన ‘నుడి–నానుడి’ పుస్తకం గతేడాది జయధీర్ తిరుమలరావు సంపాదకుడిగా ‘సాహితీ సర్కిల్’ పునర్ముద్రించింది. అందులో నానుడి గురించి బంగారయ్య చెప్పినదాన్లో కొంత ఇక్కడ: నానుడిలో రెండు బాగాలు ఉంటాయి. ఒకటి: నానుడి ఒక జ’నుల యొక్క పాటనను పదిల పరిచే పేటిక. వారి బతుకులను ఆయా కాలాలలో పళించే అద్దము. వారి తాతముత్తాతలు సాదించిన పెంపు ముందుపోకలను, వారు అనుసరించిన అనుబూతులను ఆపోహలను నమోదు చేసి ఉంచే ఒక స్తావరము; అనగా ఆ జా’తి నడకను పోకడను దాచిపెట్టే ఒక బోసాణము. దీనిని చ’రిత అన ఒచ్చును. రెండు: వారి ఎల్లికాన్ని (destination) తుది గురిని చూపించే ఒక పతకము (plan), ఒక దిట్టము , ఆ జా’తి కోరికలను ఒరవడులను (ideals), వారి ఆస’లను బయాలను సూచిస్తుంది. దీనిని ఊగితి అంటాము. దీని లోనిది ఎంత సాదించ గలిగినారు అనే దానిని పట్టి కొలస్తాము ఆ జా’తి యొక్క ముందుపోకను. ఒక యుగపు నానుడి లోని ఈ రెండో బాగము లోనిది ఎంతవరకు తరువాతి యుగములోని నానుడి యొక్క తొలి బాగములో కనిపిస్తుందో, అంతవరకు ఆ జా’తి ముందుకు సాగింది అని చెప్ప ఒచ్చును. అనగా వారు తమ ముందు ఉంచుకొనిన పతకములో ఎంత సాదించినారు, ఎంత సాదించి దానిని తమ నానుడిలో పదిలపరుచుకొన్నారు, అని ఏది చూపుతుంది వారి ముందుపోకను. అలాటి నానుడిలో నూరేడుకు నూరేడుకు, యుగానికి యుగానికి ఒక పొత్తు, ఒక లంకె, ఒక సాగుదల (continuity) ఉంటాయి... ఒక జా’తి తమ జా’తీయ పెరుగుదలలో జరిగిన పెక్కు సంగటనలు, ఆయా కాలాలలో మంది పవుకడలు (aspirations), పోకడలు, కట్టు బొట్టులు, తీరు తెన్నులు, తిండి తిప్పలు, అనువాయిలు ఆచా’రాలు, తమాసాలు తతంగాలు, నాటి లోని సీమలు, పల్లెలు, పట్టణాలు, మనుసులు మతులు (motives) – ఇలాటి వాటిని అన్నిటిని గురించి వారు పెంపొందించుకొనిన నుడిలో, వారు సంతరించుకొనిన కవితా ఆనువాయిలలో, మాట రూపములో గాని రాత రూపములో గాని పదిలపరుచుకొనిందే నానుడి... ఆర్యులను గురించి గొప్ప ఏకికపు పొత్తాలను రాసిన మా’క్సుముల్లరు జర్మనుడు. ఏ నాడూ ఇండియా మొగము కూడా చూచిన వాడు కాడు. మరి, ఆర్యుల యొక్క పాటన మప్పితాలను గురించి అంత విపులంగా అంత వివరంగా కొన్ని వేల ఏళ్ల తరువాత ఎలా రాయ గలిగినాడు? వారి నానుడిని చూచి, వారి నానుడిని చదివి, వారి నానుడిని పరికించి, వారి నానుడిని పరిసీలించి. ఆర్యుల నానుడి సాజంగా సాగుదలగా పెరిగిన అట్టిది. గనుక అది వారి జా’తీయ బతుకుకు అద్దము పట్ట గలిగింది. (జ’ వచ్చినప్పుడు చిక్కగా పుక్కిటితో పలకాలి.) -
స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రత
విజయవాడ: విజయవాడ లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో భద్రత పర్చామని విజయవాడ నగర సీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. విజయవాడలో తిరుమల రావు బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలకు 4 స్ట్రాంగ్‌రూంలు కేటాయించామని, మొత్తం 28 స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలు భద్రపరిచినట్లు తెలిపారు. ప్రతి స్ట్రాంగ్‌రూమ్‌కి 2 తాళాలు ఉన్నాయని చెప్పారు. మొదటి అంచెలో స్ట్రాంగ్ రూం వద్ద సీఆర్పీఎఫ్ పహారా, రెండో అంచెలో ఏపీఎస్పీ సిబ్బంది, మూడో అంచెలో లోకల్ పోలీసులు పహారా కాస్తారని తెలిపారు. ఎవరు లోపలికి వెళ్లినా లాగ్ బుక్‌లో నమోదు చేస్తారని స్పష్టంగా పేర్కొన్నారు. మొత్తం 28 సీసీ కెమెరాలు ఉన్నాయని, సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేశారని వెల్లడించారు. అనుమతి ఉన్నవారికి మాత్రమే లోపలి అనుమతి ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించి లోపలికి చొరబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
ఆ కేసూ ‘మాఫీ’ యా!
కేసు దర్యాప్తు చేసిందీ లేదు.. మృతుడి పోస్టుమార్టం నివేదికా అందలేదు.. పోనీ ‘మద్యం తాగుతూ అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడంటున్న’ ప్రత్యక్ష సాక్షుల వాదనను అసలే పరిగణనలోకి తీసుకోలేదు.. కానీ గుండెపోటుతోనే అని ఏకపక్షంగా తేల్చేసి..సంఘటన జరిగిన 24 గంటల్లోపే కేసు క్లోజ్ చేసేశారు.. టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి ఆధ్వర్యంలోని లిక్కర్ మాఫియా పోలీసు, అబ్కారీ శాఖలపై ఎంతగా స్వారీ చేస్తోందో.. కేసులను ఎలా మేనేజ్ చేస్తోందో.. స్పష్టం చేస్తున్న సంఘటన ఇది. ఎంవీపీ కాలనీలోని వెలగపూడి సిండికేట్‌కు చెందిన శ్రీవిజయ వైన్ షాపునకు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూములో తిరుమలరావు అనే వ్యక్తి శుక్రవారం రాత్రి మద్యం సేవిస్తూ అక్కడే కుప్పకూలి మరణించగా.. అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడని పోలీసులు పేర్కొనడం చూస్తే.. సిండికేట్ నిర్వాహకులను కేసు నుంచి తప్పించే ఉద్దేశం స్పష్టమవుతోంది. కనీసం పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకైనా ఆగకుండా గుండెపోటు మరణమని తేల్చేసి.. కేసును మాఫీ చేసేయడం విస్మయానికి గురి చేస్తోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఊహించిందే జరిగింది. ఎమ్మెల్యే వెలగపూడి లిక్కర్ మాఫియా.. ఓ కళాకారుడి మృతి కేసును తారుమారు చేసేసింది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు లిక్కర్ సిండికేట్‌కు చెందిన ఎంవీపీ కాలనీలోని శ్రీ విజయ వైన్స్‌లో మర్రిపాలెంకు చెందిన కీ బోర్డ్ కళాకారుడు ఎం.తిరుమలరావు(48) శుక్రవారం రాత్రి కుప్పకూలి మృతి చెందిన సంగతి తెలిసిందే. మద్యం సేవిస్తూ అక్కడికక్కడే మృతి చెందాడని శుక్రవారం రాత్రి ప్రత్యక్షసాక్షులు స్పష్టం చేయగా... శనివారం సాయంత్రానికి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఇందుకు విరుద్ధమైన ప్రకటన చేశారు. వైన్ షాపులో మద్యం కొని బాటిల్ మూత తీయకుండానే ఫిట్స్ వచ్చి పర్మిట్ రూమ్‌లో కుప్పకూలిన అతన్ని కేజీహెచ్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యలో మరణించాడని ప్రకటించారు. వాస్తవానికి తిరుమలరావు అక్కడికక్కడే చనిపోయాడని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ‘‘శ్రీ విజయ వైన్స్‌కు సమీపంలోని శ్రీ సాయిరామా శక్తి లింగేశ్వర ఆలయంలో కార్తీకమాసం ముగింపు దృష్ట్యా శుక్రవారం రాత్రి జాగారం జరుగుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు కీ బోర్డ్ ప్లే చేసేందుకు తిరుమలరావు వచ్చారు. అప్పటి వరకు గుడిలోనే ఉన్న ఆయన సాయంత్రం 6గంటల సమయంలో చిన్న పనుంది.. ఇప్పుడే వస్తానని బయటకు వెళ్లారు. అర్ధగంటయినా రాకపోవడంతో మేము ఆరా తీయగా.. పక్కనే ఉన్న వైన్ షాపులోకి వెళ్లి కుప్పకూలాడని తెలిసింది. మేము హుటాహుటిన వెళ్లేటప్పటికే అచేతనంగా పడి ఉన్నాడు.. కేజీహెచ్‌కు తీసుకెళ్లేందుకు వాహనం ఏర్పాటు చేయమన్నా... ముందు వైన్‌షాపు నిర్వాహకులు అంగీకరించలేదు. ఆటోలో తీసుకుపొమ్మని గదమయించారు. గట్టిగా అడిగిన మీదట ప్రైవేటు అంబులెన్స్‌ను పిలిపించారు.. అప్పటికే అతను మృతి చెంచాడని అంబులెన్స్ వైద్య సిబ్బంది తేల్చారు.’’ అని దేవాలయ కమిటీ అధ్యక్షుడు సింహాద్రిబాబు, స్థానికులు చెబుతున్నారు. కానీ శనివారం నాడు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మాత్రం ఆస్పత్రికి తీసుకెళ్తుంటే మార్గమధ్యలో మృతి చెందినట్టు ప్రకటించారు. వైన్‌షాపు యాజమాన్యానికి కనీసంగా ఎటువంటి సంబంధం లేకుండా చేసేందుకే ఘటనా స్థలంలో కాకుండా మార్గమధ్యలో చనిపోయినట్టు పోలీసులు కొత్త కథ అల్లినట్టు అర్ధమవుతోంది. శనివారం ఉదయం కేజీహెచ్‌లో తిరుమలరావు మృతదేహానికి శవపంచనామా నిర్వహించగా.. ఇంకా నివేదిక మాత్రం ఇవ్వలేదు. కానీ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మాత్రం అతను గుండెపోటుతోనే చనిపోయాడని నివేదికలో తేలినట్టు చెబుతున్నారు. మరో పక్క తిరుమలరావు కుటుంబసభ్యులు కూడా అయిందేదో అయిపోయింది.. ఇప్పుడు వివాదం చేసుకున్నా వచ్చేదేమీ లేదు.. ఆయన గుండెపోటుతో చనిపోయాడని అందరూ చెబుతున్నారు.. అదే నిజమని అనుకుంటున్నాం... అని చెప్పుకొస్తున్నారు. దీన్ని బట్టి చూస్తేనే వెలగపూడి లిక్కర్ మాఫియా వ్యవస్థలను, వ్యక్తులను ఎలా ప్రభావితం చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఆ బాటిళ్లు సీజ్ చేశాం: ఎక్సైజ్ సీఐ నాయుడు శ్రీ విజయ వైన్స్‌లో తిరుమలరావు కొనుగోలు చేసిన మాన్షన్ హౌస్ బ్రాందీ 180ఎంఎల్ బాటిల్‌ను రసాయన పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపించాం... షాపులోని ఆ బ్రాండ్‌కు చెందిన 249 బాటిళ్లను విక్రయించకుండా సీజ్ చేశాం.. అని ఎక్సైజ్ సీఐ పాపునాయుడు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
భార్యపై శాడిస్టు భర్త కిరాతకం
భర్తను స్తంభానికి కట్టేసిన స్థానికులు వేధింపులు, హింసించడం కింద కేసు నమోదు అక్కిరెడ్డిపాలెం: పెళ్లై రెండు నెలలైంది. భర్తలో శాడిజం రెట్టింపైంది. భార్యను ఒంటి నిండా బ్లేడుతో ముక్కలు ముక్కలుగా కోశాడు. ఏమీ ఎరుగని వాడిలా బయటకు వెళ్లిపోయాడు. తీవ్ర భయంతో పక్కింటి వాళ్లకు ఆమె బాధను వెళ్లగక్కడంతో విషయం బయటకు పొక్కింది. వెంటనే తిరిగి వచ్చిన భర్తను స్థానికులు ఆగ్రహంతో స్తంభానికి కట్టేశారు. 64వ వార్డు గుడివాడ అప్పన్నకాలనీలో బుధవారం చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి బాధితురాలు, గాజువాక పోలీసులు తెలిపిన వివరాలివి.. నెల్లూరు జిల్లాకు చెందిన మౌనిక, శ్రీకాకుళం జిల్లాకు చెందిన నానుపర్తి తిరుమలరావుకు రెండు నెలల కిందట పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. తిరుమలరావు ఏషియన్ పెయింట్స్ కంపెనీలో సెక్యూరిటీగా పని చేస్తూ కొద్ది నెలల పాటు గుడివాడ అప్పన్నకాలనీలో నివాసం ఉండేవాడు. వివాహం అవ్వడంతో కాలనీలోని రేషన్ డిపో సమీపంలోకి ఇళ్లు మారాడు. పెళ్లైన మూడో రోజు నుంచే ఆమెకు నరకం చూపించాడు. ఈ క్రమంలో బుధవారం ఆమె ఒంటిపై బ్లేడుతో కోసి, ఏమీ ఎరుగని వాడిలా బయటకు వెళ్లిపోయాడు. తీవ్ర బాధతో ఆమె చుట్టుపక్కల వారికి ఈ విషయం చెప్పింది. ఆమె శరీరంపై కోసిన గాట్లను చూపడంతో ఆగ్రహం చెందిన వారంతా.. తిరిగి వచ్చిన తిరుమలరావును స్తంభానికి కట్టేశాడు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెళ్లైన దగ్గర నుంచి తన భర్త.. మాటలతో, చేతలతో నానా ఇబ్బంది పెట్టి నరకం చూపిస్తున్నాడని విలపించింది. సమాచారం తెలుసుకున్న మర్రిపాలెంలో ఉన్న ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హింసించడం, వేధింపుల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
రాచకొండలో స్టూడియో నిర్మించొద్దు
రాచకొండ పరిరక్షణ వేదిక కన్వీనర్ తిరుమలరావు భద్రాచలం: రంగారెడ్డి- నల్లగొండ జిల్లాల మధ్యలోని చారిత్రాత్మక రాచకొండ ప్రాంతాన్ని సినిమా స్టూడియోలకు కేటాయించాలనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని రాచకొండ పరిరక్షణ వేదిక కన్వీనర్ జయధీర్ తిరుమలరావు అన్నారు. సోమవారం భద్రాచలంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కొత్త రాష్ట్రంలో చారిత్రక కట్టడాలకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన మేధావుల్లో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 14వ శతాబ్దంలో 150 ఏళ్ల పాటు తెలుగు రాష్ట్రానికి రాజధానిగా ఉన్న రాచకొండ చారిత్రాత్మక సంపదకు పెట్టింది పేరన్నారు. ఇటువంటి ప్రదేశంలో 30 ఎకరాలను సినిమా స్టూడియో నిర్మాణానికి ఇవ్వాలనే ఆలోచన సరైంది కాదన్నారు. స్టూడియో నిర్మిస్తే ప్రకృతి సోయగాలు, పురాతన కట్టడాలు, అటవీ సంపద కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. చారిత్రకమైన రాచకొండ ప్రాంతాన్ని అపవిత్రం చేయాలనే ఆలోచన మానుకోవాలని, కొత్త రాష్ట్రంలో తెలంగాణ సంపదకు నష్టం వాటిల్లే చర్యలపై ప్రభుత్వం పునరాలోచించాకే నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర చెట్టు విషయంలో మేధావుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, రాచకొండ భూముల విషయంలోనూ అలాగే చేయాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ భూములపై కొందరు కన్నేస్తే పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేసి చారిత్రక సంపదను కాపాడుకున్నామని గుర్తు చేశారు. -
బాలిక హత్యను తీవ్రంగా పరిగణిస్తున్నాం...
వినుకొండ : ముక్కుపచ్చలారని బాలికపై అతి కిరాతంగా లైంగికదాడి జరిపి, హత్య చేసిన సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని సీబీసీఐడీ అడిషనల్ డీజీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. వినుకొండ పట్టణ శివారు రాజీవ్ రజక కాలనీకి చెందిన మైనర్ బాలిక లక్ష్మీతిరుపతమ్మ ఇంటి వద్ద ఆడుకుంటుండగా అపహరణకు గురైన బాలిక 14వ తేదీన శావల్యాపురం మండలం కనుమర్లపూడి గ్రామ సమీపంలోని నక్కలగండివాగు వద్ద మృతదేహమై కనిపించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం విధితమే. ఈ ఘటనపై స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి తక్షణమే విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. దీంతో సీబీసీఐడి అడిషన్ డీజీ తిరుమలరావు సిబ్బందితో కలిసి శావల్యాపురం మండలం కనుమర్లపూడి సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం పట్టణంలోని రాజీవ్ రజక కాలనీలోని బాలిక పెంపుడు తల్లి లింగమ్మను విచారించారు. సంఘటనకు ముందుగా జరిగిన విషయాలను అడిగి తెల్సుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వెంకటేశ్వర్లును పట్టణ పోలీసు స్టేషన్లో ఆయన విచారించారు. అదేవిధంగా బాలిక శవాన్ని పోస్టు మార్టం నిర్వహించిన డాక్టర్ లక్ష్మణరావును వివరాలు అడిగి తెల్సుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విచారణకు సంబంధించి జిల్లా రూరల్ ఎస్పీకి పలు సూచనలు చేశామని, ఆ దిశగా విచారణ చేయాలని సూచించినట్లు చెప్పారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్‌తో మాట్లాడామని పేర్కొన్నారు. ఆయనతో పాటు ఎస్పీ సత్యనారాయణ, ఐజీ రామకృష్ణ, సీఐడీ డిఎస్పీ రఘు, నర్సరావుపేట డిఎస్పీ డి ప్రసాదు, సీఐడీ సీఐ శివప్రసాదు, లీగల్ అడ్వైజర్ తదితరులు ఉన్నారు. -
సెటిల్మెంట్లపై ప్రత్యేక దృష్టి
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :జిల్లాలో రౌడీషీటర్ల సెటిల్మెంట్లు, వారి ఆధిపత్యపోరుతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, ఇకపై ఇటువంటి అసాంఘిక శక్తులపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రా రీజియన్ ఐజీ ద్వారకా తిరుమలరావు అన్నారు. గురువారం రాత్రి ఆయన అమలాపురం డివిజన్లో నేరాలు, దర్యాప్తు పురోగతిపై డీఎస్పీ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రౌడీలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కేసుల దర్యాప్తులో కొంత వెనుకబడిందన్నారు. ఇపుడు సమైక్యాంధ్ర ఉద్యమం ముగిసినందున పూర్తిగా కేసుల దర్యాప్తుపై దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతకుముందు ఏలూరు రేంజ్ డీఐజీ విక్రమాన్సింగ్, జిల్లా ఎస్పీ శివశంకరరెడ్డి, అమలాపురం డీఎస్పీ కె.రఘు, అమలాపురం సీఐ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, రావులపాలెం సీఐ సీహెచ్‌వీ రామారావు, ముమ్మిడివరం సీఐ ఆలీ, రాజోలు సీఐ పెద్దిరాజుతో ఆయన డివిజన్లో శాంతి భద్రతల పరిస్థితి, కేసుల దర్యాప్తులో పురోగతిపై చర్చించారు. ప్రధానంగా ఇటీవల అమలాపురం పట్టణంలో రౌడీషీటర్లకు చెందిన రెండు వర్గాల పరస్పర హత్యాయత్నం ఘటనలపై ఐజీ లోతుగా ఆరా తీశారు. రౌడీలను అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆయన డీఎస్పీ రఘును ప్రశ్నించినట్టు తెలిసింది. పట్టణంలో రౌడీషీటర్లపై నిఘా ఉంచామని చెప్పిన డీఎస్పీ వారిపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. డివిజన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, మహిళలపై లైంగిక దాడులు, వరకట్న వేధింపులకు సంబంధించిన కేసులు, ఇతర నేరాలపై ఐజీ, డీఐజీ కోనసీమలోని స్టేషన్ల వారీగా రికార్డులను పరిశీలించి సమీక్షించారు.