సెటిల్‌మెంట్లపై ప్రత్యేక దృష్టి
Published Fri, Nov 15 2013 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :జిల్లాలో రౌడీషీటర్ల సెటిల్‌మెంట్లు, వారి ఆధిపత్యపోరుతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, ఇకపై ఇటువంటి అసాంఘిక శక్తులపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రా రీజియన్ ఐజీ ద్వారకా తిరుమలరావు అన్నారు. గురువారం రాత్రి ఆయన అమలాపురం డివిజన్‌లో నేరాలు, దర్యాప్తు పురోగతిపై డీఎస్పీ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రౌడీలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కేసుల దర్యాప్తులో కొంత వెనుకబడిందన్నారు. ఇపుడు సమైక్యాంధ్ర ఉద్యమం ముగిసినందున పూర్తిగా కేసుల దర్యాప్తుపై దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అంతకుముందు ఏలూరు రేంజ్ డీఐజీ విక్రమాన్‌సింగ్, జిల్లా ఎస్పీ శివశంకరరెడ్డి, అమలాపురం డీఎస్పీ కె.రఘు, అమలాపురం సీఐ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, రావులపాలెం సీఐ సీహెచ్‌వీ రామారావు, ముమ్మిడివరం సీఐ ఆలీ, రాజోలు సీఐ పెద్దిరాజుతో ఆయన డివిజన్‌లో శాంతి భద్రతల పరిస్థితి, కేసుల దర్యాప్తులో పురోగతిపై చర్చించారు. ప్రధానంగా ఇటీవల అమలాపురం పట్టణంలో రౌడీషీటర్లకు చెందిన రెండు వర్గాల పరస్పర హత్యాయత్నం ఘటనలపై ఐజీ లోతుగా ఆరా తీశారు. రౌడీలను అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆయన డీఎస్పీ రఘును ప్రశ్నించినట్టు తెలిసింది. పట్టణంలో రౌడీషీటర్లపై నిఘా ఉంచామని చెప్పిన డీఎస్పీ వారిపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. డివిజన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, మహిళలపై లైంగిక దాడులు, వరకట్న వేధింపులకు సంబంధించిన కేసులు, ఇతర నేరాలపై ఐజీ, డీఐజీ కోనసీమలోని స్టేషన్ల వారీగా రికార్డులను పరిశీలించి సమీక్షించారు.
Advertisement