ఆ కేసూ ‘మాఫీ’ యా! | Artist thirumala rao death Case Closed | Sakshi
Sakshi News home page

ఆ కేసూ ‘మాఫీ’ యా!

Published Sun, Dec 9 2018 12:42 PM | Last Updated on Thu, Jan 3 2019 12:14 PM

Artist thirumala rao death Case Closed  - Sakshi

కేసు దర్యాప్తు చేసిందీ లేదు.. మృతుడి పోస్టుమార్టం నివేదికా అందలేదు.. పోనీ ‘మద్యం తాగుతూ అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడంటున్న’ ప్రత్యక్ష సాక్షుల వాదనను అసలే పరిగణనలోకి తీసుకోలేదు.. కానీ గుండెపోటుతోనే అని ఏకపక్షంగా తేల్చేసి..సంఘటన జరిగిన 24 గంటల్లోపే కేసు క్లోజ్‌ చేసేశారు.. టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి ఆధ్వర్యంలోని లిక్కర్‌ మాఫియా పోలీసు, అబ్కారీ శాఖలపై ఎంతగా స్వారీ చేస్తోందో.. కేసులను ఎలా మేనేజ్‌ చేస్తోందో.. స్పష్టం చేస్తున్న సంఘటన ఇది.  ఎంవీపీ కాలనీలోని వెలగపూడి సిండికేట్‌కు చెందిన శ్రీవిజయ వైన్‌ షాపునకు అనుబంధంగా ఉన్న పర్మిట్‌ రూములో తిరుమలరావు అనే వ్యక్తి శుక్రవారం రాత్రి మద్యం సేవిస్తూ అక్కడే కుప్పకూలి మరణించగా.. అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడని పోలీసులు పేర్కొనడం చూస్తే.. సిండికేట్‌ నిర్వాహకులను కేసు నుంచి తప్పించే ఉద్దేశం స్పష్టమవుతోంది. కనీసం పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకైనా ఆగకుండా గుండెపోటు మరణమని తేల్చేసి.. కేసును మాఫీ చేసేయడం విస్మయానికి గురి చేస్తోంది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:  ఊహించిందే జరిగింది. ఎమ్మెల్యే వెలగపూడి లిక్కర్‌ మాఫియా.. ఓ కళాకారుడి మృతి కేసును తారుమారు చేసేసింది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు లిక్కర్‌ సిండికేట్‌కు చెందిన ఎంవీపీ కాలనీలోని శ్రీ విజయ వైన్స్‌లో మర్రిపాలెంకు  చెందిన కీ బోర్డ్‌ కళాకారుడు ఎం.తిరుమలరావు(48) శుక్రవారం రాత్రి కుప్పకూలి మృతి చెందిన సంగతి తెలిసిందే. మద్యం సేవిస్తూ అక్కడికక్కడే మృతి చెందాడని శుక్రవారం రాత్రి ప్రత్యక్షసాక్షులు స్పష్టం చేయగా... శనివారం సాయంత్రానికి పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు ఇందుకు విరుద్ధమైన ప్రకటన చేశారు. వైన్‌ షాపులో మద్యం కొని బాటిల్‌ మూత తీయకుండానే ఫిట్స్‌ వచ్చి పర్మిట్‌ రూమ్‌లో కుప్పకూలిన అతన్ని కేజీహెచ్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యలో మరణించాడని ప్రకటించారు. 

వాస్తవానికి తిరుమలరావు అక్కడికక్కడే చనిపోయాడని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ‘‘శ్రీ విజయ వైన్స్‌కు సమీపంలోని శ్రీ సాయిరామా శక్తి లింగేశ్వర ఆలయంలో కార్తీకమాసం ముగింపు దృష్ట్యా  శుక్రవారం రాత్రి జాగారం జరుగుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు కీ బోర్డ్‌ ప్లే చేసేందుకు తిరుమలరావు వచ్చారు. అప్పటి వరకు గుడిలోనే ఉన్న ఆయన  సాయంత్రం 6గంటల సమయంలో చిన్న పనుంది.. ఇప్పుడే వస్తానని బయటకు వెళ్లారు. అర్ధగంటయినా రాకపోవడంతో మేము ఆరా తీయగా.. పక్కనే ఉన్న వైన్‌ షాపులోకి వెళ్లి కుప్పకూలాడని తెలిసింది. మేము హుటాహుటిన వెళ్లేటప్పటికే అచేతనంగా పడి ఉన్నాడు.. కేజీహెచ్‌కు తీసుకెళ్లేందుకు వాహనం ఏర్పాటు చేయమన్నా...  ముందు వైన్‌షాపు నిర్వాహకులు అంగీకరించలేదు.

 ఆటోలో తీసుకుపొమ్మని గదమయించారు. గట్టిగా అడిగిన మీదట ప్రైవేటు అంబులెన్స్‌ను పిలిపించారు.. అప్పటికే అతను మృతి చెంచాడని అంబులెన్స్‌ వైద్య సిబ్బంది తేల్చారు.’’ అని దేవాలయ కమిటీ అధ్యక్షుడు సింహాద్రిబాబు, స్థానికులు చెబుతున్నారు. కానీ శనివారం నాడు పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు మాత్రం ఆస్పత్రికి తీసుకెళ్తుంటే మార్గమధ్యలో మృతి చెందినట్టు  ప్రకటించారు. వైన్‌షాపు యాజమాన్యానికి కనీసంగా ఎటువంటి సంబంధం లేకుండా చేసేందుకే ఘటనా స్థలంలో కాకుండా మార్గమధ్యలో చనిపోయినట్టు పోలీసులు కొత్త కథ అల్లినట్టు అర్ధమవుతోంది. 

శనివారం ఉదయం కేజీహెచ్‌లో తిరుమలరావు మృతదేహానికి శవపంచనామా నిర్వహించగా.. ఇంకా నివేదిక మాత్రం ఇవ్వలేదు. కానీ పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు మాత్రం అతను గుండెపోటుతోనే చనిపోయాడని నివేదికలో తేలినట్టు చెబుతున్నారు. మరో పక్క తిరుమలరావు కుటుంబసభ్యులు కూడా అయిందేదో అయిపోయింది.. ఇప్పుడు వివాదం చేసుకున్నా వచ్చేదేమీ లేదు.. ఆయన గుండెపోటుతో చనిపోయాడని అందరూ చెబుతున్నారు.. అదే నిజమని అనుకుంటున్నాం... అని చెప్పుకొస్తున్నారు. దీన్ని బట్టి చూస్తేనే వెలగపూడి లిక్కర్‌ మాఫియా వ్యవస్థలను, వ్యక్తులను ఎలా ప్రభావితం చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

ఆ బాటిళ్లు సీజ్‌ చేశాం: ఎక్సైజ్‌ సీఐ నాయుడు
శ్రీ విజయ వైన్స్‌లో తిరుమలరావు కొనుగోలు చేసిన మాన్షన్‌ హౌస్‌ బ్రాందీ 180ఎంఎల్‌ బాటిల్‌ను రసాయన పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపించాం... షాపులోని ఆ బ్రాండ్‌కు చెందిన 249 బాటిళ్లను విక్రయించకుండా సీజ్‌ చేశాం.. అని ఎక్సైజ్‌ సీఐ పాపునాయుడు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement