- రాచకొండ పరిరక్షణ వేదిక కన్వీనర్ తిరుమలరావు
భద్రాచలం: రంగారెడ్డి- నల్లగొండ జిల్లాల మధ్యలోని చారిత్రాత్మక రాచకొండ ప్రాంతాన్ని సినిమా స్టూడియోలకు కేటాయించాలనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని రాచకొండ పరిరక్షణ వేదిక కన్వీనర్ జయధీర్ తిరుమలరావు అన్నారు. సోమవారం భద్రాచలంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కొత్త రాష్ట్రంలో చారిత్రక కట్టడాలకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన మేధావుల్లో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
14వ శతాబ్దంలో 150 ఏళ్ల పాటు తెలుగు రాష్ట్రానికి రాజధానిగా ఉన్న రాచకొండ చారిత్రాత్మక సంపదకు పెట్టింది పేరన్నారు. ఇటువంటి ప్రదేశంలో 30 ఎకరాలను సినిమా స్టూడియో నిర్మాణానికి ఇవ్వాలనే ఆలోచన సరైంది కాదన్నారు. స్టూడియో నిర్మిస్తే ప్రకృతి సోయగాలు, పురాతన కట్టడాలు, అటవీ సంపద కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు.
చారిత్రకమైన రాచకొండ ప్రాంతాన్ని అపవిత్రం చేయాలనే ఆలోచన మానుకోవాలని, కొత్త రాష్ట్రంలో తెలంగాణ సంపదకు నష్టం వాటిల్లే చర్యలపై ప్రభుత్వం పునరాలోచించాకే నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర చెట్టు విషయంలో మేధావుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, రాచకొండ భూముల విషయంలోనూ అలాగే చేయాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ భూములపై కొందరు కన్నేస్తే పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేసి చారిత్రక సంపదను కాపాడుకున్నామని గుర్తు చేశారు.