సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతుల పరంపర కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఆయా శాఖల్లో ఖాళీలు ఏర్పడిన వెంటనే సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే ఉద్యానవన అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించగా... తాజాగా వెటర్నరీ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తున్నారు.
ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న 35 మంది గ్రామ పశుసంవర్థక అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించారు. వారిని అదే జిల్లా పరిధిలోని వివిధ పశువైద్యశాలల్లో ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల్లో నియమిస్తూ ఈ నెల 19వ తేదీన ఉమ్మడి గుంటూరు జిల్లా ఏడీహెచ్‌వో ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వం నిర్దేశించిన మేరకు..
గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ శాఖల ఆధ్వర్యాన 19 కేటగిరీల ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 17 కేటగిరీల ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ 17 కేటగిరీలకు సంబంధించిన శాఖల్లో ఖాళీలు ఏర్పడిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది.
ఈ మేరకు పశు వైద్యశాలల్లో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ అయితే వాటిలో 40శాతం పోస్టులను గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే పశుసంవర్థక అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి నియమించాలని స్పష్టంగా పేర్కొంది. దాని ప్రకారమే ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో 35 మందికి ప్రమోషన్లు కల్పించి పోస్టింగ్‌లు ఇచ్చారు. మరోవైపు సచివాలయాల్లో పనిచేసే ఇంజినీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌లకు కూడా పదోన్నతులకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
అపోహలు.. అభూత కల్పనల నుంచి పదోన్నతుల వరకు..
గతంలో చాలామంది ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం... ఎన్నికల ముందు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం... ఆ తర్వాత పట్టించుకోకపోవడం.. కోర్టు కేసులు, ఇతర సమస్యలతో నియామక ప్రక్రియ సంవత్సరాల తరబడి సాగిన చరిత్ర నాలుగేళ్ల క్రితం వరకు ఉంది. కానీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ఏకంగా 1.34లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు.
కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఆ ఉద్యోగాలను భర్తీ చేసి లక్ష మందికి పైగా నిరుద్యోగులకు ఒకేసారి ఉద్యోగ నియామకపత్రాలు అందజేశారు. అయితే, ఈ ప్రక్రియ ప్రారంభించినప్పుడు ఓర్వలేని ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశాయి. ఇవి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కావని, ప్రభుత్వం మారితే ఆ ఉద్యోగాలు ఉంటాయో... ఊడుతాయో.. అని భయపెట్టాయి.
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో సచివాలయ ఉద్యోగులకు మేలు చేస్తోంది. ప్రొబేషన్ ఖరారు చేసి అందరి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పే స్కేలుతో కూడిన వేతనాలు అందిస్తోంది. తాజాగా సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఆయా శాఖల్లో పోస్టింగ్‌లు కూడా ఇస్తోంది. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment