థర్డ్‌ స్టేజిలోకి ఒంగోలు నగరం | Ongole City Entered in Third Stage of COVID 19 Cases | Sakshi
Sakshi News home page

బిక్కు..బిక్కు!

Published Tue, Aug 4 2020 9:02 AM | Last Updated on Tue, Aug 4 2020 9:02 AM

Ongole City Entered in Third Stage of COVID 19 Cases - Sakshi

రక్షణ కవచాలు లేకుండా బ్లీచింగ్‌ చల్లుతున్న కార్మికులు

ఒంగోలు టౌన్‌: ఒంగోలు నగర పాలక సంస్థకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా గుప్పెట్లో ఉంటూ ఏ క్షణాన దాని బారిన పడతమోనని భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే నగర పాలక సంస్థకు చెందిన కీలకమైన ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. కింది స్థాయి సిబ్బంది వరకు కరోనా పాకింది. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యం రోడ్లపై ఉంటూ కాలువల్లోని చెత్తా చెదారం తీసే తమలో ఎంతమంది కరోనా బారిన పడ్డారోనంటూ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఒంగోలు నగర పాలక సంస్థపై కరోనా కొరడా ఝులిపించిన నేపథ్యంలో తదుపరి టార్గెట్‌ తామేనంటూ పారిశుద్ధ్య కార్మికులు హడలిపోతున్నారు. కాలువలు శుభ్రం చేస్తూ, రోడ్లపై ఉన్న చెత్తను తొలగిస్తున్న తాము త్వరగా కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయని, అధికారులు తమ గురించి కూడా పట్టించుకొని త్వరితగతిన నిర్ధారణ పరీక్షలు చేయించాలని వారు వేడుకుంటున్నారు. 

మురిపించి..మురిపించారు 
ఒంగోలు నగరంలో తొలి కరోనా కేసు నమోదైన మార్చి చివరి వారంలో యంత్రాంగం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎన్‌జీఓ కాలనీలో కరోనా కేసు రావడంతో ఆ ప్రాంతమంతా కర్ఫ్యూ కింద మార్చేశారు. అక్కడ పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విధులు నిర్వర్తించారు. కరోనా కేసు వచ్చిన ఇంటితో పాటు ఆ కాలనీ మొత్తం కొన్ని రోజులపాటు ఏకధాటిగా శుభ్రం చేస్తూ బ్లీచింగ్‌ చల్లుతూ వచ్చారు. ఆ తర్వాత కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. పారిశుద్ధ్య కార్మికులకు కనీసం రక్షణ కవచాలు కూడా అందించకుండా పనులు చేయిస్తున్నారంటూ సాక్షి దినపత్రికలో వారి గోడుపై వరుస కథనాలు ప్రచురించారు. స్పందించిన నగర పాలక సంస్థ అప్పటికప్పుడు వారికి రెండు శానిటైజర్లు, రెండు మాస్క్‌లు, చేతులకు గ్లౌజ్‌లు అందించింది. దాంతో వారి పని అయిపోయినట్లుగా నగర పాలక సంస్థ అధికారులు చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం కరోనా ఒంగోలు నగరం మొత్తాన్ని చుట్టు ముట్టేసింది. దాదాపు ప్రతి కాలనీలో పదికి తగ్గకుండా కరోనా కేసులు నమోదై ఉన్నాయి. అదే సమయంలో ఒంగోలు నగర పాలక సంస్థలోని కీలక అధికారులంతా కరోనా బారిన పడ్డారు. కొంతమంది సిబ్బందికి కూడా కరోనా సోకింది. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ హడావుడిగా ప్రత్యేక వాహనాన్ని తెప్పించి కార్యాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించింది. అయితే నిత్యం కరోనా అంచున ఉంటూ విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య కార్మికుల గురించి పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. 

థర్డ్‌ స్టేజిలోకి ఒంగోలు నగరం
ఒంగోలు నగరంలో కరోనా థర్డ్‌ స్టేజీలో అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. ముందుగా పేర్కొన్న విధంగా కరోనాకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించవు. కరోనా తొలి దశలో దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపించేవి. ప్రస్తుతం అలాంటి లక్షణాలు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉన్నట్లు బయటకు కనిపిస్తున్నా కరోనా ఒక్కసారిగా వారిని పడేస్తోంది. ప్రస్తుతం ఒంగోలులో ఇలాంటి పరిస్థితులు ఉండటంతో ఎవరికి కరోనా ఉందో, ఎవరికి కరోనా లేదో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. రోజూ ఉదయం, సాయంత్రం నగరంలోని అన్ని వీధులను చిమ్మడం, కాలువలను శుభ్రం చేసేవారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒంగోలు నగరంలో మొత్తం 786 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. వారిలో 105 మంది రెగ్యులర్‌ సిబ్బంది ఉండగా 681 మంది కాంట్రాక్టు కింద పనిచేస్తున్నారు.

నగరం మొత్తం కరోనా కేసులు నమోదవుతుండటంతో ఈ 786 మంది పారిశుద్ధ్య కార్మికుల్లో ఎంతమంది కరోనా బారిన పడి ఉంటారోనని అధికారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. పారిశుద్ధ్య విభాగాన్ని పర్యవేక్షించే శానిటరీ సూపర్‌వైజరే కరోనా బారిన పడ్డారు. రోజూ తమ డివిజన్‌కు వెళ్లి అక్కడ మస్టర్‌ వేసిన అనంతరం విధులకు హాజరయ్యే పారిశుద్ధ్య కార్మికుల్లో ఎంతమందికి కరోనా ఉండవచ్చన్న దానిపై చర్చ జరుగుతోంది. పారిశుద్ధ్య కార్మికులకు మూకుమ్మడిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని యంత్రాంగం నిర్ణయించింది. అంతకంటే ముందుగా నగర పాలక సంస్థ కార్యాలయంలోనే కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో అక్కడ మిగిలిన వారికి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. తమను ఎప్పుడు గుర్తించి నిర్ధారణ పరీక్షలు చేయిస్తారోనని పారిశుద్ధ్య కార్మికులు ఎదురు చూస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement