వైఎస్సార్ ఆసరా రెండో విడత పంపిణీ కార్యక్రమంలో ఒంగోలు నీటి సమస్యపై సీఎం జగన్‌కు వివరిస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
గుక్కెడు నీటి కోసం ఒంగోలు నగర ప్రజలు నానా తంటాలు పడాల్సిందే. నాలుగు రోజులకు ఒకసారి ఇచ్చే మంచినీటి కోసం ఎదురుచూపులే. శివారు కాలనీల్లో మంచినీటి ట్యాంకర్లు వస్తే తప్ప నీరందని దుస్థితి. పట్టణం ఆవిర్భావం నుంచి ఉన్న ఈ సమస్యకు చెక్ పెట్టేలా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో మెగా తాగునీటి ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. రూ.409 కోట్లు ఖర్చయ్యే ఈ పథకాన్ని సీఎం జగన్ మంజూరు చేయడంతో నగరవాసుల క‘న్నీటి’ కష్టాలకు తెరపడనుంది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరంలో మంచినీటి సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. జిల్లా కేంద్రం నలుదిశలా విస్తరిస్తోంది. అందుకు తగ్గట్టుగా నీటి అవసరాలూ పెరుగుతున్నాయి. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నగరంలోని తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించారు. ముందుచూపుతో భారీ రక్షిత మంచినీటి పథకం ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. మెగా మంచినీటి ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేశారు. నగర పాలక సంస్థ అధికారులతో మొత్తం రూ.409 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయించారు. రెండు రోజుల క్రితం ఒంగోలుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు. వెంటనే స్పందించిన సీఎం పథకం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నగర ప్రజల దశాబ్దాల సమస్య తీరనుంది.
ఇదీ ప్రణాళిక...
ఈ పథకం పూర్తయితే నాలుగైదు రోజులకు వచ్చే మంచినీటికి æఇక చెక్ పడ్డట్టే. ప్రతి మనిషికి 135 లీటర్ల చొప్పున నగర ప్రజలందరికీ ప్రతిరోజూ రక్షిత మంచినీటిని అందించవచ్చు. ప్రస్తుతం నగరంలో దాదాపు 3 లక్షలకు పైగా జనాభా నివశిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఒంగోలు నగరంలో 2,65,746 మంది ఉన్నారు. నగరంలో విలీనమైన గ్రామాలకు సైతం ఈ ప్రాజెక్టు ద్వారా సంవృద్ధిగా నీటిని సరఫరా చేసేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు.
ప్రస్తుతం నగరానికి రామతీర్థం నుంచే సాగర్ నీళ్లు వస్తున్నాయి. నగరంలోని రెండు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులతో పాటు రంగారాయుడు చెరువు నుంచి ప్రస్తుతం తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సరఫరా వ్యవస్థకు భిన్నంగా నగరానికి రామతీర్థం నుంచే నీటిని సరఫరా చేయటానికి మాస్టర్ ప్లాన్ వేశారు. అందులో భాగంగా నగరం వరకు నీటిని సరఫరా చేయటానికి మొత్తం రూ.107 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందుకు పైప్‌లైన్ వ్యవస్థను రూపొందించనున్నారు. రామతీర్థం రిజర్వాయర్‌లో 18 మీటర్ల వ్యాసార్థంతో ఇన్‌టేక్ వెల్‌తో పాటు పంపు హౌస్‌ను నిర్మించనున్నారు. రిజర్వాయర్‌లోనే ఇన్‌టేక్ వెల్ కోసం కాపర్ డ్యాంను నిర్మిస్తారు. అక్కడే సర్వీసు బ్రిడ్జితో పాటు, 150 కిలోవాట్‌ల సామర్థ్యం ఉన్న ఆరు పంప్ సెట్లతో పాటు నీటిని పంపింగ్ చేయటానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయనున్నారు. అక్కడి వరకు దాదాపు రూ.5.50 కోట్ల వరకు వెచ్చించనున్నారు. చీమకుర్తి విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి ఇన్‌టేక్ వెల్ వరకు దాదాపు 16 కిలో మీటర్ల మేర విద్యుత్ లైన్‌ను ప్రత్యేకంగా వేయనున్నారు. డ్యాం వద్ద నుంచి ఇన్‌టేక్ వెల్ వరకు అప్రోచ్ రోడ్డు, 900 కిలో లీటర్ల సామర్థ్యం ఉన్న ఒక ట్యాంకును కూడా ఏర్పాటు చేయటానికి ప్రతిపాదనల్లో పొందుపరిచారు. అక్కడ నుంచి ఒంగోలు వరకు నీటిని సరఫరా చేయటానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లకు సంబంధించి మొత్తం రూ.107 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు.
రీ మోడల్‌కు రూ.302 కోట్లు
నగరంలోని మంచినీటి వ్యవస్థను మొత్తాన్ని రీ మోడల్ చేయటానికి దాదాపు రూ.302 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇంటింటికీ మంచినీరు సరఫరా చేసేందుకు మొత్తం 28 జోన్లుగా విభజించారు. కొత్తగా నగరంలో కలిసిన నగర శివారు గ్రామాలు, విలీన గ్రామాలన్నింటినీ కలుపుకొని ఈ నూతన విధానానికి రూపకల్పన చేశారు. ఈ మెగా మంచినీటి ప్రాజెక్టు కోసం 28 జోన్లలో కొత్తగా 12 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించ తలపెట్టారు. ఒంగోలు నగరం నలుదిశలా వీటిని ఏర్పాటు చేయాలి. ఒక్కో ట్యాంకు 500 కిలో లీటర్ల సామర్ధ్యం నుంచి 700 కిలో లీటర్ల సామర్ధ్యం వరకు ఉంటాయి. ఇప్పటి వరకు ఉన్న పాత ట్యాంకుల నాణ్యతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని వాటిని వాడాలా, వద్దా అన్న దానిపై కూడా లోతుగా అధ్యయనం చేశారు. భవిష్యత్తులో నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేయాల్సి వచ్చినా మంచినీటి పైప్‌లైన్ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉన్న మంచినీటి పైప్‌లైన్ వ్యవస్థ మొత్తం రీ మోడల్ దిశగా ప్రణాళికలు రూపొందించారు.
అమృత్ పథకానికి రూ.70 కోట్లు గ్రాంట్‌గా తెప్పించిన మంత్రి బాలినేని
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ‘‘అమృత్’’ పథకాన్ని టీడీపీ పాలకులు మధ్యలోనే వదిలేశారు. నిధులు లేవని గుండ్లకమ్మ నుంచి ఏర్పాటు చేసిన పథకం పనులు నిలిచిపోయాయి. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ కమీషన్ల కక్కుర్తితో ఈ పథకం మధ్యలోనే నిలిచిపోయింది. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన బాలినేని అమృత్ పథకం పూర్తి చేయటానికి ప్రభుత్వం నుంచి రూ.70 కోట్లు గ్రాంట్‌గా తెప్పించారు. దీంతో ఆగిపోయిన పథకం పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ పథకంలో నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించనున్నారు.
సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు
అడిగిన వెంటనే ఒంగోలు నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సిద్ధం చేసిన మెగా మంచినీటి పథకాన్ని స్వయంగా సీఎం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించటం ఎంతో సంతోషంగా ఉంది. ఒంగోలు నగర ప్రజలు ఎంతో అదృష్టవంతులు. ఈ పథకంతో నగర రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయి. ఇప్పటి వరకు ప్రజలు మంచినీటి కోసం పడుతున్న కష్టాలు తీరనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జీవితాంతం ఒంగోలు నగర ప్రజలతో పాటు రుణపడి ఉంటా.
– బాలినేని శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర మంత్రి
Comments
Please login to add a commentAdd a comment