సాక్షి, అమరావతి: ప్రస్తుత విద్యా వ్యవస్థలో బోధనాభ్యసన ప్రమాణాలు పడిపోతున్నాయి. మరోవైపు కరోనా పరిస్థితుల్లో స్కూళ్లు మూతపడి బోధన పూర్తిగా నిలిచిపోయింది. విద్యార్థులకు డిజిటల్ సాధనాల ద్వారా ఆన్‌లైన్ బోధన చేయించాలంటే అందుకు తగ్గట్టుగా టీచర్లను సిద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఉత్తమ బోధన అందించేలా గురువులను తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్ వరకు గల ఉపాధ్యాయులందరికీ నూతన విద్యాబోధన విధానాలు, సబ్జెక్టుల వారీ పరిజ్ఞానం పెంపొందించేలా ప్రత్యేక ఆన్‌లైన్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. గతేడాది చివరిలో ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్‌ను పూర్తిచేయించిన విద్యా శాఖ ప్రస్తుతం సెకండరీ టీచర్ ట్రైనింగ్ కోర్సులకు శ్రీకారం చుట్టింది. నేషనల్ ఇనీషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్‌మెంట్ (నిష్టా), నేషనల్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ టీచర్స్ (దీక్షా) వెబ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వీటిని అందిస్తున్నాయి. ఎలిమెంటరీ స్థాయిలో 1 నుంచి 8వ తరగతి వరకు బోధించే టీచర్లకు 18 కోర్సుల్లో శిక్షణ నిర్వహించగా.. సెకండరీ స్థాయిలో 9 నుంచి 12వ తరగతి వరకు బోధించే టీచర్లకు 13 కోర్సుల్లో శిక్షణకు శ్రీకారం చుట్టాయి. ప్రతి టీచర్ విధిగా ఈ శిక్షణ కోర్సులను పూర్తి చేయాలి.
నేటి నుంచే శ్రీకారం
దేశంలో 15 లక్షల పాఠశాలలు, 85 లక్షల మంది టీచర్లు, 26 కోట్ల మంది విద్యార్థులున్నారు. కరోనా వల్ల విద్యా వ్యవస్థ గతేడాది నుంచి పూర్తిగా స్తంభించింది. ఈ పరిస్థితిని కొంతైనా అధిగమించడానికి ప్రభుత్వాలు వెబ్‌పోర్టల్, యాప్స్, టెలికాస్ట్, బ్రాడ్‌కాస్ట్, ఐవీఆర్‌ఎస్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆన్‌లైన్ బోధనను సాగించేందుకు ఏర్పాట్లు చేయించాయి. పీఎం–ఈ–విద్య, దీక్షా, ఈ–పాఠశాల, నిష్టా, స్వయం, దీక్షా వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా టీచర్లకు శిక్షణ ఇస్తున్నాయి. 2021 ఆగస్టు 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు తరగతులు నిర్వహిస్తున్నాయి. ఈ శిక్షణలో 9 నుంచి 12వ తరగతి వరకు బోధించే ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల డీఈవోలు, ఇతర అధికారులకు సూచనలు జారీ చేసినట్టు సీమ్యాట్ డైరెక్టర్ మస్తానయ్య తెలిపారు.
ఈ కోర్సుల్లో బోధనకు సంబంధించి.. 12 ప్రాథమిక, సాధారణ అంశాలు ఉంటాయి. మరో 7 కోర్సులు ఆయా ప్రత్యేక సబ్జెక్టుల్లో ఉంటాయి. పాఠ్య ప్రణాళిక, సమ్మిళిత విద్య, వ్యక్తిగత, సామాజిక నైపుణ్యాల పెంపు, విద్యార్థుల్లో సమగ్రాభివృద్ధి, సెకండరీ స్థాయి అభ్యాసకుల స్థాయిని అవగాహన చేసుకుని వారికి మార్గదర్శనం ఇవ్వడం, పాఠశాల అభివృద్ధికి వీలైన నాయకత్వ లక్షణాలు అలవర్చడం, పాఠశాల స్థాయి మూల్యాంకన విధానం, నూతన ఆవిష్కరణలు, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, వృత్తి విద్యలతో పాటు ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, సంస్కృతం, మేథ్స్, సైన్స్, సోషల్ అంశాల్లో శిక్షణ ఇస్తారు.
లక్ష్యాలివీ..
► విద్యార్థుల్లో బోధనాభ్యసన ఫలితాలను రాబట్టడం. కరోనా వంటి పరిస్థితుల్లోనూ విద్యార్థులకు తరగతి గది వాతావరణాన్ని సృష్టించి బోధన సాగించడం.
► విద్యార్థుల భావోద్వేగాలను, వారి మానసిక పరిస్థితిని అంచనా వేస్తూ ప్రతిస్పందించడం.
► సృజనాత్మకత పెంపు, బోధనను కళాత్మకంగా ఆకర్షణీయంగా నిర్వహించడం.
► విద్యార్థుల వ్యక్తిగత సామాజిక నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా శిక్షణ.
► విద్యార్థులపై ఒత్తిడి లేని పాఠశాల స్థాయి మూల్యాంకన విధానాలను రూపొందించడం
► సామర్థ్య ఆధారిత అభ్యసనాలను పెంపొందించడం, పాఠశాల విద్యలో నూతన ఆవిష్కరణలు గురించి తెలుసుకోవడం
Comments
Please login to add a commentAdd a comment