ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కృష్ణా : గన్నవరం విమానాశ్రయంలో ప్రముఖ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలు ఇస్తామంటూ ఆన్‌లైన్ మోసానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. ఉద్యోగంలో చేరండి అంటూ మోసగాళ్లు ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ లెటర్ పంపిస్తుండటంతో నిరుద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆశతో ఉద్యోగంలో చేరేందుకు వెళ్లిన యువకులకు మోసం అని తెలియడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఈ విషయంపై గన్నవరం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పే వారి మాటలు నమ్మొద్దని సూచించారు. గన్నవరం విమానాశ్రయంలో ఉద్యోగం ఇస్తామని మోసం చేసినట్లు కొంత మంది ఫోన్ ద్వారా తెలియజేశారని వెల్లడించారు.
ఉద్యోగం కోసం వెళ్ళే వాళ్ళు ఎయిర్ లైన్స్ నిజమైన వెబ్‌సైట్‌లో చూసి వెళ్లాలని తెలిపారు. ఎయిర్ లైన్స్‌లో ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగం ఇవ్వరని ఆయన స్పష్టం చేశారు. ముందస్తుగా నగదు డిపాజిట్ చేయించి అపాయింట్‌మెంట్ లెటర్ ఆన్‌లైన్‌లో పంపిస్తే అది ఫేక్‌గా గుర్తించాలని పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిస్తే ఎయిర్ పోర్ట్ అథారిటీ ద్వారా సమాచారం తెలుసుకోవాలన్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఉద్యోగాలు పేరిట మోసపోకుండా ముందస్తుగా తెలుసుకునేందుకు ఓ ఫోన్ నంబర్ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. గతంలో కూడా మోసపోయిన వారు తమ దృష్టికి తీసుకురావడంతో విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment