ఆన్‌లైన్‌లో ఆమోదం తెలిపిన మంత్రులు.. గవర్నర్‌కు పంపిన సర్కారు
ఆయన ఆమోదించగానే ఆర్డినెన్స్ జారీ
అంతకుముందు.. అసెంబ్లీ, ‘మండలి’ ప్రొరోగ్
సమావేశాలు జరిగినా పూర్తి బడ్జెట్ పెట్టకుండా ప్రభుత్వం ఎగనామం
సాక్షి, అమరావతి: నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు చంద్రబాబు ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్స్ జారీచేయనుంది. మంత్రుల ఆమోదం కోసం మంగళవారం వారికి సర్క్యులేషన్‌లో పంపగా వారు ఆన్‌లైన్‌లో దానికి ఆమోదం తెలిపారు. దీంతో.. దీనిని గవర్నర్‌కు పంపారు. ఆయన ఆమోదించాక రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్స్‌ను జారీచేస్తుంది. ఇక ఈ నాలుగు నెలల అత్యవసర వ్యయానికే ఆర్డినెన్స్ జారీచేస్తున్నట్లు సమాచారం.
హామీలు ఎగ్గొట్టేందుకే..
ఎన్నికల ముందు సూపర్ సిక్స్, సూపర్ టెన్ అంటూ ప్రజలకిచ్చిన హామీల అమలును ఎగ్గొట్టేందుకే ఈ నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. అంతకుముందు.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి నాలుగు నెలల వ్యయానికి సభ అనుమతి తీసుకుంది. ఈ గడువు ఈ నెలాఖరుతో (జూలై 31తో) ముగియనుంది.
సాధారణంగా అయితే.. ఎన్నికల ఫలితాలు అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వాలు తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఈనెల 23న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం ఈనెల 22 నుంచి 26 వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించినప్పటికీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు.
పైగా.. శ్వేతపత్రాల పేరుతో ఆత్మస్తుతి పరనిందలతో గత ప్రభుత్వంపై ఆరోపణలకే అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకుంది. గవర్నర్ ప్రసంగం ద్వారా అప్పులపై అవాస్తవాలను చెప్పించడంతో పాటు హామీలను తక్షణం అమలుచేయలేమని కూడా గవర్నర్‌తో చెప్పించింది. అంటే.. చంద్రబాబు నిజస్వరూపం ఇక్కడే బట్టబయలైంది. హామీలివ్వడమే తప్ప అమలుచేసే తత్వం తనది కాదని ఆయన రుజువు చేసుకున్నారు.
అప్పులపై వాస్తవాలు బయటపడతాయనే
వాస్తవానికి.. గవర్నర్ ప్రసంగం ఎన్నికల హామీలు అమలు అంశాలతో సాగడం రివాజు. కానీ, అందుకు పూర్తి భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం గవర్నర్ ప్రసంగాన్ని గత ప్రభుత్వంపై నిందలకే పరిమితం చేశారు. పూర్తిస్థాయి బడ్జెట్ పెడితే గత ప్రభుత్వం చేసిన అప్పుల వాస్తవాలను బడ్జెట్ డాక్యుమెంట్‌లో స్పష్టంచేయాల్సి వస్తుంది. అలాగే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్ కేటాయింపులు చేయాల్సి వస్తుంది. దీంతో శ్వేతపత్రాల ముసుగు లో అవాస్తవ ఆరోపణలతో కాలయాపన చేశారు.
అసలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున మరో నాలుగు నెలల వ్యయానికి ఓటాన్ బడ్జెట్‌కు సభ ఆమోదం తీసుకోవచ్చు. అలా చేయకుండా అసెంబ్లీ, మండలి సమావేశాలను ముగించేశారు. అసెంబ్లీ, ‘మండలి’ని మంగళవారం ప్రొరోగ్ చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో.. బుధవారం నాలుగు నెలల వ్యయానికి ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్‌ను జారీచేయనుంది.
ఇది అసెంబ్లీని అవమానించడమే..
అసెంబ్లీ సమావేశాలను ముగించేసి, ఆర్డినెన్స్ ఇవ్వడం అంటే శాసనసభను అవమానించడమే అవుతుందని సీనియర్ రాజకీయవేత్తలు అంటున్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టలేనంత అసాధారణ పరిస్థితులేవీ రాష్ట్రంలో లేవని.. కేంద్ర, రాష్ట్ర ఆదాయాలు ఎంత వస్తాయో స్పష్టంగా ఉన్నాయని, అయినాసరే చంద్రబాబు పూర్తి బడ్జెట్ పెట్టకుండా ఆర్డినెన్స్ ఎత్తుగడ వేశారంటే హామీలకు ఎగనామం పెట్టడానికేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల ప్రాధాన్యతల్లో సూపర్ సిక్స్ హామీలకు చోటులేదు. నాణ్యమైన లిక్కర్ బ్రాండ్స్, చెత్త తొలగింపు, నూతన ఇసుక విధానాలకే చోటుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment