ఏలూరు (టూటౌన్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కష్టకాలంలో పేదలకు భరోసాగా నిలుస్తోంది. ఏలూరు జిల్లాలో 2022– 23 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో అధికారులు కోటికి పైగా పనిదినాలు కల్పించారు. వేతనాలు, మెటీరియల్ కాంపోనెంట్ కలిపి రూ. 227.85 కోట్ల మేరకు ఖర్చు చేశారు.
జిల్లా ఉపాధి హామీ చరిత్రలో ఇదో రికార్డుగా నిలిచింది. జిల్లాల పునర్విభజన తర్వాత ఒక్క ఏలూరు జిల్లాలోనే కోటికి పైగా పనిదినాలు కల్పించడంతో పాటు అత్యధిక నిధులు ఖర్చు చేయడంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ సిబ్బంది, అధికారులు విశేష కృషి చేశారు. వీరి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం స్వాతంత్య్ర దిన వేడుకల్లో అవార్డు ఇచ్చి సత్కరించింది. అడిగిన ప్రతిఒక్కరికీ పని కల్పించే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
కష్టకాలంలో బాసటగా..
కరోనా ప్రభావంతో పూర్తిగా ఛిన్నాభిన్నమైన పేదల బతుకులు తేరుకునేందుకు ఉపాధి హామీ పథకం ఊతమిస్తోంది. ఏలూరు జిల్లాలో 2022–23లో 1.50 కోట్లు పనిదినాలు కల్పించాలనే లక్ష్యాన్ని నిర్దేశించగా మొదటి ఐదు నెలల్లోనే 1.03 కోట్ల పనిదినాలు కల్పి ంచారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడు నెలలు పనిచేసి లక్ష్యానికి రెట్టింపు పనులు చేయాలనే దృఢ సంకల్పంతో డ్వామా సిబ్బంది పనిచేస్తున్నారు. వివిధ దశల్లో ఉన్న పనులను పూర్తి చేయడంతో పాటు కొత్తగా పనులను గుర్తించి పేదలకు ఉపాధి కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో స్థానికంగానే పనులు కల్పించడంపై ఉపాధి కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేదల జీవనానికి ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
706 కుటుంబాలకు వంద రోజుల పని
జిల్లాలో 5.35 లక్షల జాబ్ కార్డులు ఉండగా వీటిలో మొత్తం 5.82 లక్షల మంది ఉపాధి కూలీలు నమోదయ్యారు. ఇప్పటివరకూ 3.26 లక్షల జాబ్ కార్డులు కలిగిన కుటుంబాలకు చెందిన దాదాపు 4.50 లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు 103.38 లక్షల పనిదినాలు కల్పించారు. జిల్లావ్యాప్తంగా 706 కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు కల్పించారు. సగటున రోజుకు ఒక్కరికి రూ.206.16లు వేతనాలుగా చెల్లించారు. ఐదు నెలల్లో రూ.227.85 కోట్ల నిధులు ఖర్చు చేయగా దీనిలో రూ. 203.13 కోట్లు కూలీల వేతనాలుగా, రూ. 24.72 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్‌గా వెచ్చించారు. కూలీలకు వేతనాలను 15 రోజుల వ్యవధిలో 95.84 శాతం మేర చెల్లిస్తున్నారు.
అడిగిన వారందరికీ పని
ఉపాధి హామీ పథకంలో అడిగిన ప్రతిఒక్కరికీ పనులు కల్పించేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో అధికంగా పనులు కల్పించే దిశగా కృషి చేస్తున్నాం. జిల్లా నీటి యాజమాన్య సంస్థ పరి«ధిలో జరుగుతున్న అన్ని పనులను సత్వరం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జేసీ అరుణ్‌బాబు సహకారంతో నిరంతరం పనులు కల్పించేలా పనిచేస్తున్నాం.
– డి.రాంబాబు, పీడీ, డ్వామా, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment