పోలీసుల సమక్షంలో తల్లిదండ్రుల వద్దకు చేరిన హరిప్రకాష్
పాలకొండ రూరల్(శ్రీకాకుళం): పదిహేనేళ్ల వయసు.. తెలిసీతెలియని తనం.. అమ్మానాన్న హాస్టల్‌లో చేర్పిస్తున్నారన్న కోపం.. ఆ కుర్రాడిని ఇంటి నుంచి పారిపోయేలా చేసింది. ఏళ్లకు ఏళ్లు గడిచినా కుమారుడి ఆచూకీ తల్లిదండ్రులకు తెలియలేదు. అమ్మతో మాట్లాడాలని ఆ బిడ్డకూ అనిపించలేదు. ఐదేళ్ల పాటు సాగిన ఈ ఎడబాటుకు ఆధార్ కార్డు ముగింపు పలికింది. తల్లీబిడ్డల మధ్య ఏర్పడిన దూరాన్ని దూరం చేసి వారిని కలిపింది. వివరాల్లోకి వెళితే..
మెళియాపుట్టి మండలం పెద్ద లక్ష్మీపురం గ్రామానికి చెందిన బైపోతు తవిటినాయుడు, రాజేశ్వరి దంపతుల ఏకైక కుమారుడు హరి ప్రకాష్‌ను 2016లో హాస్టల్‌లో చేర్పించారు. అయితే హరికి అక్కడ చదవడం ఇష్టం లేదు. తల్లిదండ్రులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. హైదరాబాద్ వెళ్లి అక్కడ ఓ పెట్రోల్ బంకులో పనికి కుదిరాడు. ఇన్నేళ్లలో కనీసం ఇంటికి ఫోన్ కూడా చేయలేదు. కాలం అలా గడిచిపోయింది. తల్లిదండ్రులు మాత్రం ఒక్కగానొక్క కొడుకు కోసం ఎదురుచూస్తూనే ఉన్నా రు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
ఇటీవల హరికి ఆ బంకులో క్యాషియర్‌గా పదోన్నతి రావడంతో వ్యక్తిగత సెల్‌ఫోన్ కోసం యత్నించాడు. ఈ క్రమంలో సిమ్‌కార్డు కొనుగోలు చేసేందుకు ఆధార్ తప్పనిసరి కావడంతో ఆధార్‌కార్డు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. నూతన ఆధార్‌కార్డు తన పాత ఆధార్‌కార్డుకు అనుసంధానం చేసి ఉండడంతో స్వగ్రామమైన పెద్ద లక్ష్మీపురంలో ఉన్న తల్లిదండ్రుల ఇంటికి కొత్త కార్డు వచ్చింది. ఊహించని విధంగా కుమారుడి పేరిట ఆధార్ కార్డు ఇంటికి రావడంతో తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌ను సంప్రదించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ పాతపట్నం సీఐ ఎం.వినోద్‌బాబుకు సమాచారం అందించారు.
స్పందించిన సీఐ ఆధార్‌కార్డులో ఉన్న వివరాల మేరకు దర్యాప్తు ప్రారంభించారు. తప్పిపోయిన హరిప్రకాష్ హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించారు. తమ బృందాలను పంపించి ఆయనను స్వగ్రామం తీసుకువచ్చారు. శుక్రవా రం పాలకొండ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం ద్వారా డీఎస్పీ ఎం.శ్రావణి సమక్షంలో హరిప్రకాష్‌ను తల్లితండ్రులకు అప్పగించారు.
ఐదేళ్ల తర్వాత కొడుకును చూసిన తల్లిదండ్రులు ఉద్వేగానికి లోనయ్యాడు. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం గడుపుతున్నామని, ఏకైక కుమారుడు వదిలి వెళ్లిపోవడంతో ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నామని వారు తెలిపారు. కొడుకును అప్పగించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మిస్సింగ్ కేసును ఛేదించడంలో చొరవ చూపిన సీఐ, ఎస్‌ఐలను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment