
టెక్కలి రూరల్: ఇదో ప్రేమలేఖ. తన భార్యకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లకు కృతజ్ఞత చెప్పేందుకు భర్త రాసిన లేఖ. సంతకం పెట్టడం తప్ప రాయడం తెలీని ఆ వ్యక్తి లెటర్‌ను టైప్ చేయించి ఆస్పత్రిలోని ఫిర్యాదుల పెట్టెలో వేసి వైద్యులను ఆశ్చర్యపరిచారు. నిత్యం ఫిర్యాదులతో సతమతమయ్యే వైద్య సిబ్బంది ఈ లేఖను చూసి మురిసిపోయారు. అసలు విషయంలోకి వెళ్తే.. టెక్కలి మెట్టవీధికి చెందిన గుడ్ల రామారావు భార్యకు అకస్మాత్తుగా ఆరోగ్య పరిస్థితి విషమించింది.
చదవండి: శ్యామలను బిడ్డలా చూసుకుంటా!
కాళ్లు చేతులు కదలక నోట మాట కూడా రాని పరిస్థితి ఏర్పడింది. అలాంటి స్థితిలో ఆమెను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తీసుకురాగా.. వైద్యులు పది రోజుల పాటు పసిబిడ్డను చూసుకున్నట్లుగా ఆమెను రాత్రీపగలు చూసుకున్నారు. వారి కృషి ఫలితంగా ఆమె వేగంగా కోలుకున్నారు. వైద్య సిబ్బంది చూపిన చొరవ రామారావు మనసు గెలుచుకుంది. వారిని ప్రత్యక్షంగా అభినందించడానికి మొహమాట పడి, ఓ లెటర్‌ను ఇలా టైప్ చేయించి ఫిర్యాదుల పెట్టెలో ఈ నెల 4న వేశారు. శుక్రవారం ఆ పెట్టెను తెరిచి చూసిన ఆస్పత్రి సిబ్బంది లేఖను చూసి సంతోషపడ్డారు. ప్రజలు ఏవో కారణాలతో ఎప్పుడూ తమను నిందిస్తూనే ఉంటారని, ఈ లేఖతో ఎంతో ఆనందం కలిగిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment