
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 20 నుంచి రాతపరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షల నిర్వహణపై బుధవారం మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ విజయవాడలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందులో మొత్తం 19 రకాల పోస్టులకు 14 వేర్వేరు రాతపరీక్షలను వారం పాటు పెట్టాలని నిర్ణయించారు. 14,062 గ్రామ, 2,146 వార్డు సచివాలయాల పోస్టులు కలిపి మొత్తం 16,208 పోస్టులకు ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం 11,06,614 మంది దరఖాస్తు చేసుకోగా 10,63,168 మందిని పరీక్షలకు అర్హులుగా అధికారులు నిర్ధారించారు.
► మార్చిలోనే రాతపరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ స్థానిక ఎన్నికల కారణంగా వాయిదా వేశారు. ఆ తర్వాత ఆగస్టు 9 నుంచి పరీక్షల నిర్వహణకు నిర్ణయించగా కరోనాతో వాయిదా వేయాల్సి వచ్చింది. లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్న నేపథ్యంలో కోవిడ్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పరీక్ష కేంద్రాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.
► పరీక్షల తొలి రోజు దాదాపు నాలుగున్నర లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారనే అంచనాల నేపథ్యంలో అభ్యర్థులెవరూ ఇబ్బంది పడకుండా తగినన్ని పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
► ఇప్పటికే పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన కొన్ని చోట్ల కోవిడ్ కేర్ సెంటర్లు నిర్వహిస్తున్నారని అధికారులు చెప్పగా మంత్రులు ప్రత్యామ్నాయ పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాలన్నారు.
► 6,858 పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులకు పరీక్ష రాసేవారు 1,931 మంది మాత్రమేనని అధికారులు మంత్రులకు వివరించారు. దీంతో అదే అర్హతతో ప్రత్యామ్నాయ కోర్సులు చేసిన వారికి కూడా అవకాశాలు కల్పించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
► ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, గ్రామ– వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ నవీన్‌తోపాటు వివిధ శాఖలు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment