
చౌడేపల్లె(చిత్తూరు జిల్లా): రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు ఆదివారం బోయకొండ గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. దసరా మహోత్సవాలను పురస్కరించుకొని తొలిసారిగా అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి దంపతులు, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, వెంకటేగౌడ, ఆరణి శ్రీనివాసులు, ఆదిమూలం, ఎంఎస్ బాబు, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తదితరులు పట్టువస్త్రాలు సమర్పించారు.
వీరికి ఆలయ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈవో చంద్రమౌళి ఆలయ సంప్రదాయల ప్రకారం స్వాగతం పలికారు. తొలుత అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవమూర్తులకు పూజలు చేసి హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో వర్షాలు బాగా పడుతున్నాయన్నారు. పంటలు బాగా పండి అందరూ అభివృద్ధి చెందాలని.. కోవిడ్ నుంచి ప్రజలను రక్షించాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment