
సాక్షి, అమరావతి: వైఎస్సార్ పెన్షన్ కానుకను ఆగస్టు 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల చేతికే నేరుగా అందించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ మేరక ఒకేరోజు 61.28 లక్షల మంది పెన్షనర్ల ఇంటి వద్దకే వెళ్లి, నేరుగా వారి చేతికే పెన్షన్ సొమ్మును అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 2.68 లక్షల మంది వాలంటీర్లు పెన్షన్ సొమ్మును పంపిణీ చేసేందుకు సిద్ధంగా వున్నారు. పెన్షన్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.1478.90 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ప్రతినెలా ఒకటో తేదీనే పెన్షనర్లకు వారికి అందాల్సిన పెన్షన్ మొత్తాన్ని కచ్చితంగా అందేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు జూలై నెలకు సంబంధించిన పెన్షన్‌ను ఆగస్టు ఒకటో తేదీనే అందించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల ఖాతాలకు ఇప్పటికే పెన్షన్సొమ్మును జమచేశారు. వాలంటీర్లు ఈ సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఇళ్లకువెళ్లి అందించనున్నారు. గతంలో పెన్షన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల వద్ద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పడిగాపులు కాసే పరిస్థితిని ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది. ప్రతినెలా ఒకటో తేదీన ఉదయం నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారు. పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి స్థాయి నుంచి గ్రామ, వార్డు స్థాయి కార్యదర్శి వరకు భాగస్వాములు అవుతుండటం విశేషం.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నెల కూడా పెన్షనర్ల బయోమెట్రిక్‌కు బదులు జియో ట్యాగింగ్‌తో కూడిన ఫోటోలను తీసుకుని, పెన్షన్ అందిస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) సీఈఓ పి.రాజాబాబు తెలిపారు. ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 6734 మంది పెన్షనర్లు పోర్టబులిటీ ద్వారా పెన్షన్ తీసుకుంటున్నారని, అలాగే 1458 మందికి సంబంధించి లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాల్లో ఉండిపోవడం వల్ల ఈనెలకు సంబంధించిన పెన్షన్‌ను హోల్డ్‌లో ఉంచమన్నారు. వారు తిరిగి వచ్చిన తరువాత చెల్లిస్తామని తెలిపారు. 14,967 మంది ఇతర జిల్లాలకు పెన్షన్ బదిలీ కోరారని, మరో 30,044 మంది ఒకే జిల్లాలో ఉంటూ పెన్షన్ బదిలీ చేయాలని కోరినట్లు చెప్పారు. అలాగే వివిధ కారణాల వల్ల గత ఆరు నెలల నుంచి పెన్షన్ తీసుకోలేని 1,52,095 మందికి చెల్లించాల్సిన బకాయిలు కూడా ఈ నెలలోనే అందచేస్తున్నామని అన్నారు.
ఈనెల కొత్తగా 2.20 లక్షల పెన్షన్లు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఈ నెలలో కొత్తగా మంజూరు చేసిన 2,20,385 మందికి కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కొత్తగా మంజూరు చేసిన పెన్షన్‌లకు రూ.51.67 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. జూలై నెలలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి, వారికి దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లోనే పెన్షన్ మంజూరు కార్డులను అందచేశామన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో తీసుకువచ్చిన ఈ విప్లవాత్మక మార్పుతో రాష్ట్రంలో సంతృప్త స్థాయిలో సామాజిక పెన్షన్లను అందించగలుగుతున్నామని అన్నారు.
గత నెలలో దరఖాస్తు చేసుకున్న వారిలో 1568 మందికి కొత్తగా హెల్త్ పెన్షన్లు కూడా మంజూరు చేశామని వెల్లడించారు. అలాగే ఈ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మిణ్ కార్పోరేషన్ ద్వారా నెలకు రూ.2వేలు ఇస్తున్న పెన్షన్లను కూడా వైఎస్సార్ పెన్షన్ కానుక కిందకు తెచ్చి, నెలకు రూ.2250 చెల్లిస్తున్నామని తెలిపారు. వాలంటీర్ల ద్వారా వారికి కూడా నెల ఒకటో తేదీనే పెన్షన్ సొమ్ము వారి చేతికి అందిస్తామని అన్నారు. అలాగే గతంలో కల్చరల్ డిపార్ట్‌మెంట్ నుంచి కళాకారులకు అందించే పెన్షన్‌ను కూడా వైఎస్సాఆర్ పెన్షన్ కానుక కిందకు తెచ్చి, వాలంటీర్ల ద్వారానే అందించబోతున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment