వెంగమ్మ పేణీలు తయారు చేస్తున్న దృశ్యం
సాక్షి, కర్నూలు: బంగినపల్లి మామిడికే కాదు నోరురించే పేణీలకు కూడా ఫేమస్ బనగానపల్లె. అందులోనూ వెంగమ్మ పేణీలు అంటే కర్నూలు జిల్లా నలుమూలల్లో తెలియని వారుండరు. ఎంతో రుచికరంగా ఉండే ఈ మిఠాయిని చిన్నా పెద్దా తేడా లేకుండా లొట్టలేసుకుని తింటారు. అంతలా ప్రాచూర్యం పొందిన ఈ పేణీల తయారీని 1940వ సంవత్సరంలో సన్నుధి వెంగమ్మ అనే మహిళ ప్రారంభించారు.
అమ్మకానికి ఉంచిన పేణీలు
ఈ పేణీలు రుచిగా ఉండటంతో క్రమంగా వెంగమ్మ పేణీలుగా పేరు వచ్చిందని ప్రతీతి. ఆ తరువాత కొన్నేళ్లకు ఆమె దివంగతులయ్యారు. ఆ తరువాత ఆమె వారసులు పేణీలు తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. మొదట్లో తక్కువ ధరకే విక్రయించినా ప్రస్తుతం సరుకుల ధరలు పెరగడంతో పేణీలు కిలో రూ.200లకు విక్రయిస్తున్నారు. నేడు సుమారు 10 కుటుంబాలు బనగానపల్లెలో పేణీలు తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాయి. ప్రతి రోజు 350–400 కిలోల వరకు పేణీల తయారు చేస్తూ విక్రయిస్తున్నారు.
తయారు చేయడం ఇలా ..
10 కిలోలు పేణీలు తయారు చేయాలంటే మూడు కిలోల గోధుమ పిండి, ఆర కిలో మైదా, ఐదు కిలోల చక్కెర, రెండు కిలోల నెయ్యి లేదా డాల్డా వినియోగిస్తారు. గోధుమ పిండి, మైదాను నీటితో తడిపి రెండు గంటల పాటు ఉంచి ఆ తరువాత ముద్దగా చేస్తారు. తరువాత అవసరమైన మేర చిన్న చిన్న ఉండలు తయారు చేసి వాటిని రేకులుగా మార్చి ఫోల్డింగ్ చేస్తారు. పెనంలో నెయ్యి లేదా డాల్డా బాగా మరుగుతున్న సమయంలో అందులో వేస్తారు. బాగా కాలిన తరువాత వాటిని బయటకు తీస్తారు. కొంత సేపు తరువాత మళ్లీ చక్కెర పాకంలో 10 నిమిషాల పాటు ఉంచుతారు.
దీంతో పేణీలు చూడగానే నోరూరించేలా ఉండి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. 10 కేజీల పేణీలు తయారీకి మొత్తం ఖర్చు సుమారు రూ 1400–1500లు అవుతుందని విక్రయిస్తే రూ.2 వేలు వస్తుందని వెంగమ్మ వారసులు తెలిపారు. బనగానపల్లె పట్టణంలో ఒక్కొక్క కుటుంబం రోజుకు 30–35 కిలోలు తయారు చేసి విక్రయిస్తున్నారు. శుభకార్యాల సమయంలో కొనుగోలు మరింత ఎక్కువగా ఉంటుందని తయారీదారులు తెలిపారు.
చదవండి: కోడి పందేలను అడ్డుకుంటున్నాం
Comments
Please login to add a commentAdd a comment