విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విజయనగరం జిల్లా వల్లంపూడికి చెందిన లక్ష్మీకి పింఛన్ ఇస్తున్న వలంటీర్ విజయకుమారి
సాక్షి, అమరావతి/కంభం/తోటపల్లిగూడూరు/ఖాజీపేట/పాలకొల్లు అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా 58,97,231 మంది పింఛన్ లబ్ధిదారులకు రూ.1,377.48 కోట్లు పంపిణీ పూర్తయింది. మంగళవారం కూడా వలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ డబ్బులు అందజేశారు. ఈ నెలకు గాను 60.65 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.1,417.74 కోట్ల మొత్తాన్ని విడుదల చేయగా, రెండో రోజు నాటికి 97.23% మందికి పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు. మరో 3 రోజుల పాటు వలంటీర్ల ఆధ్వర్యంలో పంపిణీ కొనసాగుతుందని చెప్పారు.
శభాష్ వలంటీర్స్...
పించన్ల పంపిణీలో వలంటీర్లు తమ సేవాతత్పరతను చాటుకుంటున్నారు. ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురంలో నివాసం ఉంటున్న ట్రాన్స్ జెండర్ కొత్తపల్లి గిరి అలియాస్ షర్మిల 2 నెలల నుంచి పింఛన్ తీసుకోలేదు. ఈ నెలలో తీసుకోకపోతే పింఛన్ కట్ అయిపోయే అవకాశం ఉండటంతో షర్మిల హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి వలంటీర్ రాజు పింఛన్ అందించాడు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని చింతోపు గ్రామానికి చెందిన దారాల శేషయ్య తన ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి గాయపడి విజయవాడలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. అతడికి వలంటీర్ యెండ్లూరి సుధాకర్ మంగళవారం చింతోపు నుంచి విజయవాడకు వెళ్లి పింఛన్ అందించాడు. అలాగే, అనంతపురంలోని మారుతీనగర్‌కు చెందిన కటారు రాజమ్మకు ఇటీవల కడపలో శస్త్రచికిత్స జరిగి కాలు కదపలేని పరిస్థితిలో ఉంది.
ఆమె తన భర్త వెంకటస్వామితో కలిసి వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలోని బంధువుల నివాసంలో ఉంటోంది. అనంతపురం టౌన్ మారుతీనగర్ 51వ సచివాలయానికి చెందిన వలంటీర్ కె.అమృతలక్ష్మి తన సొంత ఖర్చుతో అనంతపురం నుంచి ఖాజీపేటకు వెళ్లి వెంకటస్వామికి పింఛన్ అందజేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో కాలు విరిగి వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పింఛనుదారుకు వలంటీర్లు నేరుగా ఆస్పత్రికి వెళ్లి పింఛన్ సొమ్ము అందజేశారు. పాలకొల్లు మండలం లంకలకోడేరు పెదపేటకు చెందిన ఉన్నమట్ట లక్ష్మీకాంతం కాలు విరగడంతో వారం రోజులుగా భీమవరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు వలంటీర్ దీపిక ఆస్పత్రికి వెళ్లి పింఛను అందజేసింది. అలాగే పాలకొల్లు మండలం వరిధనం గ్రామానికి చెందిన గునిశెట్టి తేజ వితంతు పింఛన్‌ను లబ్ధిదారు. కాలి వాపులతో భీమవరంలో చికిత్స పొందుతున్న ఆమెకు వలంటీర్ అనిత ఆస్పత్రికి వెళ్లి పింఛన్ అందజేసింది.
Comments
Please login to add a commentAdd a comment