క్వారీ ప్రాంతాల్లో బుధవారం గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు
గొలుగొండ: విశాఖ జిల్లా గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెంలో కొత్తగా రంగు రాళ్ల క్వారీ వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితం గ్రామ సమీపంలో ఉన్న జిరాయితీ భూమిని చదును చేస్తుండగా చిన్న మెట్ట అంచున రంగురాయి బయటపడింది. కొందరు అనుభవజ్ఞులు ఇక్కడి మట్టిని పరిశీలించి రంగురాళ్లు ఉండే అవకాశముందని చెప్పడంతో.. ఆ విషయం తెలిసి వందలాదిమంది మంగళవారం అర్ధరాత్రి ఎక్కడికక్కడ తవ్వకాలు చేపట్టారు. బుధవారం వేకువజామున 3 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందడంతో ఎస్‌ఐ ధనుంజయ్‌నాయుడు సిబ్బందితో గ్రామానికి వెళ్లగా.. తవ్వకాలు చేపట్టిన వారు అక్కడి నుంచి పరుగులు తీశారు. కాగా, ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రంగురాళ్లకు పుట్టినిల్లు
గొలుగొండ మండలంలో ఏటా ఏదో ఒకచోట రంగురాళ్ల క్వారీలు బయటపడుతున్నాయి. 1996లో తొలిసారిగా పప్పుశెట్టిపాలెం క్వారీ బయటపడింది. ఆశకొద్దీ లోతుగా తవ్వడంతో ఏడాది కాలంలో క్వారీ కూలి 14 మంది చనిపోయారు. 1999లో కరక రంగురాళ్ల క్వారీని కనుగొన్నారు. ఇక్కడ 15 వరకు క్వారీలు వెలుగుచూడగా రూ.వేలకోట్ల విలువైన రంగురాళ్లు దొరికాయి.
అప్పట్లో ఈ 15 క్వారీల్లో ప్రమాదాలు జరిగి 100 మంది వరకు మృత్యువాతపడ్డారు. దీంతో అప్పటి కలెక్టర్ ప్రవీణ్‌ప్రకాశ్ క్వారీ ప్రాంతాలను మూయించారు. 2002లో సాలిక మల్లవరం, 2004లో పొగచట్లపాలెం, 2006లో దోనిపాలెం, 2008లో తిరిగి సాలిక మల్లవరం, 2009లో ఆరిలోవలో కొత్త క్వారీలు ఏర్పడ్డాయి. పప్పుశెట్టిపాలెంలో బుధవారం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు జేసీబీని రప్పించి క్వారీ ప్రాంతంలో తవ్వకందారులు తీసిన గోతులను మూయించివేశారు.
Comments
Please login to add a commentAdd a comment