సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత 45 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సుపరిపాలనను క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వివరించడమే లక్ష్యంగా ‘జగనన్నే మా భవిష్యత్తు.. మా నమ్మకం నువ్వే జగన్’ పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. సచివాలయానికి ముగ్గురు చొప్పున కన్వీనర్లు.. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున గృహసారథులు వెరసి ఏడు లక్షల మందితో క్షేత్రస్థాయిలో అత్యంత క్రియాశీలక వ్యవస్థలను ఏర్పాటుచేశాక మొట్టమొదటగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
ఈనెల 7న ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం 20 వరకూ అంటే 14 రోజులపాటు కొనసాగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తల నేతృత్వంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని 1.60 కోట్ల ఇళ్లకు కన్వీనర్లు, గృహసారథులు వెళ్లి.. ఆ కుటుంబాల ప్రజలతో మమేకమవుతారు. 2.6 లక్షల మంది వలంటీర్లు ఈ కార్యక్రమంలో క్రియాశీలకంగా పాల్గొంటారు. టీడీపీ సర్కార్‌కూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మధ్య తేడాలను వివరిస్తారు.
ప్రతిపక్షాలు వికృత చేష్టలకు ఒడిగడుతూ.. ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తూ సీఎం వైఎస్ జగన్ సంక్షేమ రథానికి అడుగడుగునా అడ్డుతగులుతున్న వైనాన్ని ప్రజలకు చాటిచెప్పనున్నారు. ‘పీపుల్స్ సర్వే’లో భాగంగా ప్రతి ఇంట్లోనూ ఐదు ప్రశ్నలు అడిగి.. వారు చెప్పిన సమాధానాలను ‘ప్రజా మద్దతు పుస్తకం’లో నమోదుచేసి రశీదు ఇస్తారు. ఆ తర్వాత జగన్ సర్కారుకు మద్దతు తెలిపేందుకు అంగీకరించిన వారితో 82960 82960 నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇవ్వాలని ఆ కుటుంబ సభ్యులను గృహసారథులు కోరుతారు.
ఇలా మిస్డ్‌కాల్ ఇచ్చిన నిమిషంలోపే వారికి సీఎం జగన్ సందేశంతో ఐవీఆర్‌ఎస్ కాల్ వస్తుంది. సీఎం వైఎస్ జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపట్ల రాష్ట్రంలో సగటున 87 శాతం కుటుంబాల ప్రజలు పూర్తి విశ్వసనీయత కనబరచి.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ అంటూ నినదించి.. ప్రతిపక్షాలకు తగినరీతిలో గుణపాఠం చెబుతారని వైఎస్సార్‌సీపీ బలంగా నమ్ముతోంది. ఈ కార్యక్రమాన్ని మండల ఇన్‌చార్జ్‌లు, జోనల్ కో–ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తారు.
బాధ్యత కలిగిన కార్యకర్తలున్న పార్టీ..
ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగానే కాకుండా... ప్రజల అవసరాలను గుర్తించి.. వాటిని తీర్చే బాధ్యతగల కార్యకర్తలున్న పార్టీగా వైఎస్సార్‌సీపీ ముందుకెళ్తోందన్నది ‘జగనన్నే మా భవిష్యత్తు.. మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమంలో నిరూపించాలని వైఎస్సార్‌సీపీ నిర్దేశించు కుంది.
ప్రభుత్వ పనితీరుపై.. పార్టీపట్ల ప్రజల అభిప్రాయాన్ని, వారి సంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ప్రజల అంచనాలకు అనుగుణంగా పార్టీ అజెండా మార్చుకోవాలనుకునే సమర్థమంతమైన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌ను కలిగి ఉన్నది వైఎస్సార్‌సీపీ అని గర్వంగా చెప్పుకునేందుకు ఈ కార్యక్రమాన్ని వేదికగా చేసుకుంది. అందుకనే, ప్రజలతో మమేకమయ్యే ఈ భారీ కార్యక్రమం ఎలా ఉండాలి? మా పార్టీ సైన్యం ప్రజలతో ఏ విధంగా మమేకమవ్వాలనే విషయంపై ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చింది.
ప్రజల నుంచి వచ్చిన నినాదంతోనే...
సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 98.5 శాతం సీఎం వైఎస్ జగన్ అమలుచేసి ఎన్నికల మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. అర్హతే ప్రామాణికంగా.. లంచాలకు తావులేకుండా.. అత్యంత పారదర్శకంగా 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. నాలుగేళ్లు గడవక ముందే సంక్షేమ పథకాల ద్వారా రూ.2 లక్షల కోట్లకు పైగా నిధులను డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. విద్య, వైద్య, వ్యవసాయరంగాలలో విప్లవాత్మక సంస్కరణలను సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు.
గ్రామ, వార్డు సచివాలయాలు.. 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించడం ద్వారా వికేంద్రీకరించి ప్రజల ఇళ్ల వద్దకే పరిపాలనను తీసుకొచ్చారు. దాంతో సీఎం జగన్‌పై నానాటికీ ప్రజల్లో ఆదరణ పెరుగుతూ వస్తోంది. 2019 తర్వాత జరిగిన పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలతోపాటు.. తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి రికార్డు విజయాలను కట్టబెట్టడం ద్వారా ‘జగనన్నే మా భవిష్యత్తు.. మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ ప్రజలు నినదించారు. ప్రజల నుంచి వచ్చిన ఆ నినాదంతోనే వైఎస్సార్‌సీపీ భారీ కార్యక్రమాన్ని చేపట్టింది.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోనూ..
గత ప్రభుత్వాల ఆలోచనలకు భిన్నంగా.. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే లక్షణం రాజకీయ పార్టీలకు ఉండాలన్నది వైఎస్సార్‌సీపీ విధానం. ప్రజలతో మమేకమై ప్రజల అవసరాలకు, అంచనాలకు అనుగుణంగా పాలన సాగించాలన్నది వైఎస్సార్‌సీపీ సిద్ధాంతం. ప్రజల జీవితాల్లో, వారి జీవనశైలిలో స్పష్టమైన మార్పును తెచ్చి.. ఆ మార్పును కళ్లకు కట్టినట్లు చూపించడమే తమ లక్ష్యమని వైఎస్సార్‌సీపీ చెబుతోంది. అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేసి చూపించింది.
గత 45 నెలల్లో ప్రజల జీవితాల్లో అనూహ్యమైన మార్పును తెస్తూ, బాధ్యతగా సేవలందించడంలో అందరికంటే మేం ముందున్నామని వైఎస్సార్‌సీపీ చాటిచెబుతోంది. పార్టీ అజెండా రూపకల్పన నుంచి.. సంక్షేమ పథకాల అమలుతీరు.. మెరుగైన పాలన అందిస్తున్న క్రమాన్ని ప్రజలు గుర్తిస్తున్నారన్నది గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వస్తున్న స్పందనే తార్కాణమని చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment