ఏలూరు (మెట్రో): పశ్చిమ గోదావరి జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) పథకం ద్వారా శాశ్వత గృహ హక్కు పత్రాలు అందించేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ గృహ నిర్మాణ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నవారికిఆ అప్పు ఎంత ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.15 వేలు మాత్రమే చెల్లించి దానిని పూర్తిగా మాఫీ చేసుకుని శాశ్వత గృహ హక్కు పత్రాలు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
సొంతిల్లు ఉన్నా దానికి శాశ్వత గృహ హక్కు పత్రాలు లేక, అత్యవసర సమయాల్లో కుటుంబ అవసరాల కోసం బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు పొందడానికి కూడా వీలులేక ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది భారీ ఊరట కలిగించే పథకం. ఈ పథకం ద్వారా శాశ్వత గృహ హక్కు పత్రాలు పొందేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఈ పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలో లబ్ధిదారులకు దీనిపై పూర్తి అవగాహన కల్పిస్తూ అధికారులు చర్యలు తీసుకోవడంతో ఇంకా సందేహాలు ఉన్నవారు కూడా ఇప్పుడు ఈ పట్టాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.
భారీ సంఖ్యలో దరఖాస్తులు...
ఓటీఎస్ పథకానికి జిల్లా వ్యాప్తంగా 1,56.914 మంది అర్హత కలిగినవారు ఉండగా, వారిలో ఇప్పటికే 1,13,665 మంది దరఖాస్తు చేసి సొమ్ము చెల్లించారు. మొత్తం రూ.16 కోట్ల 63 లక్షల 32 వేల 793 ఇప్పటికే లబ్ధిదారులు ప్రభుత్వానికి అందించారు. దరఖాస్తుదారుల్లో 83,707 మందికి ఇప్పటికే డేటా నమోదు ప్రక్రియను తహసీల్దార్లు పూర్తిచేశారు. వారిలో 52,281 మందికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి పట్టాలు అందజేశారు. ఇంకా 31,426 మందికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి హక్కు పత్రాలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
అమలులో ముందు వరుసలో..
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను ప్రతిష్టాత్మకంగా భావించి ఈ హక్కు పత్రాల కార్యక్రమాన్ని లాంఛనంగా జిల్లాలోనే ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా అధికారులు మొదట్లో చూపించిన వేగాన్నే ఇప్పటికీ కొనసాగిస్తూ ప్రతి లబ్ధిదారునికీ హక్కు పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది డిసెంబరు 21న అర్హులైన లబ్ధిదారులకు శాశ్వత గృహ హక్కు పత్రాలు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో అందించారు. జిల్లాలో అర్హులకు హక్కు పత్రాలు అందించడంలో భాగంగా ఓటీఎస్ పథకాన్ని అమలు చేయడంలో ముందు వరుసలో నిలబడటంపై జిల్లా అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, పంచాయతీ, గృహనిర్మాణ అధికారులు ఓటీఎస్ పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు.
అర్హులందరికీ పట్టాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ జగనన్న శాశ్వత గృహ హక్కు పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సచివాలయ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఓటీఎస్ పథకాన్ని అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ హక్కు పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 52,281 మందికి పట్టాలు అందించాం. త్వరలోనే మరింత మందికి అందించేందుకు రిజిస్ట్రేషన్ పత్రాలు సిద్ధం చేస్తున్నాం.
– సూరజ్ ధనుంజయ్, జాయింట్ కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment